
మదనపల్లె టౌన్: మాజీ సైనికుడి పేరుతో నకిలీ పట్టా సృష్టించి డీకేటీ భూమిని విక్రయించి సొమ్ము చేసుకున్న 9 మంది టీడీపీ నేతలను మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ రమేశ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కామిశెట్టి వెంకటరమణకు ప్రభుత్వం 1990లో సర్వే నంబర్ 691–2లో 1.90 సెంట్ల డీకేటీ భూమి ఇచ్చింది. దీనిపై టీడీపీ నేతలు కన్నేశారు. అప్పటి వీఆర్‌వో రెడ్డి శేఖర్ సహకారంతో ఈ డీకేటీ పట్టాను మాజీ సైనికుడి పేరిట మార్పు చేసి నకిలీ పట్టా సృష్టించారు.
భూమిని విక్రయించుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చినట్లు నకిలీ ఎన్‌ఓసీని సైతం తయారుచేశారు. 2016 పిబ్రవరి 18న ఆ భూమిని పుంగనూరుకు చెందిన రాచమడుగు రాయల్‌కుమార్‌కు రూ.55 లక్షలకు విక్రయించారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో 2016 అక్టోబర్ 15న అప్పటి సబ్ కలెక్టర్ కృతికాబాత్రా విచారణకు ఆదేశించారు. నకిలీ పట్టా సృష్టించి భూమిని విక్రయించినది వాస్తవమేనని విచారణలో తేలింది. ఈ క్రమంలో టీడీపీ సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ గంగారపు నాగ వెంకటస్వామినాయుడు అలియాస్ సిమెంటు బాబురెడ్డి (58), జీవి.రంగారెడ్డి(56), పఠాన్ ఖాశీఖాన్(60), కామిశెట్టి సుభద్రమ్మ (67), జి.లీలావతి (45), శరణ్‌కుమార్ (50), జి.వెంకరమణ (50), బాగేపల్లె నాగరాజు (50), బాగేపల్లె శకుంతల(48)ను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.