మా భూముల్లో సర్వే ఆపండి
* హైకోర్టులో మహబూబ్‌నగర్ జిల్లా శాతాపూర్ రైతుల పిటిషన్
* కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, అంజనాగిరి రిజర్వాయర్ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్ వరకు సొరంగం తవ్వేందుకు రెవెన్యూ అధికారులు ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి తమ భూముల్లో సర్వే నిర్వహించడాన్ని సవాలు చేస్తూ శాతాపూర్ గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
చట్ట ప్రకారం పాటించాల్సిన విధి విధానాలను పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ యు.రాముడు, మరో 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, సర్వే వల్ల రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, ప్రశ్నిస్తే ఎకరాకు రూ.8 వేల పరిహారం ఇస్తామని మౌఖికంగా చెబుతున్నారని వివరించారు.
సర్వే విషయంలో ప్రశ్నిస్తే విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు కేసులు నమోదు చేస్తామంటూ రైతులను అధికారులు బెదిరిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ప్రభు త్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ జోక్యంచేసుకుని, ఎవ్వరినీ బెదిరించడం లేదన్నారు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించే అధికారం ప్రభుత్వానికి భూ సేకరణ చట్టం ప్రకారం ఉందన్నారు. అర్జున్ కలుగజేసుకుంటూ, జీవో 123 కింద భూములు ఇవ్వాలంటూ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. దీనికి శరత్ అభ్యంతరం చెప్పారు. బెదిరిస్తున్నారంటూ పదే పదే చెప్పడం అందరికీ అలవాటైపోయిందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, రైతులపై ఒత్తిళ్లు లేకుంటే వాళ్లు ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ఇక్కడి వరకు వస్తారా? అంటూ వ్యాఖ్యానించారు.
ఎల్లూరు రైతుల పిటిషన్ కొట్టివేత..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీ డిజైనింగ్ పేరుతో నవయుగ కంపెనీ తమ భూముల్లో చేస్తున్న సర్వేను అడ్డుకోవాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, ఎల్లూరు గ్రామానికి చెందిన టి.నాగజ్యోతి, మరో 40 మంది రైతులు ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు.