అసాధ్యమే!
♦ 20లోపు బదిలీల ప్రక్రియ పూర్తి కావడం గగనమే
♦ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఇప్పటికీ అందని ఆదేశాలు
♦ గడువు ముంచుకొస్తున్నా.. ప్రారంభం కాని కౌన్సెలింగ్
♦ బదిలీ కోరుకునే ఉద్యోగుల్లో ఆందోళన..
ఓ వైపు ముంచుకొస్తున్న గడువు.. మరో వైపు అందని స్పష్టమైన ఆదేశాలు.. వెరసి ఉద్యోగుల బదిలీల పర్వం ఒక ప్రహసనంగా మారింది. కొన్నిశాఖల్లో ఆన్‌లైన్ అంటున్నారు... మరికొన్ని శాఖల్లో మ్యానువల్‌తో సరిపెట్టమంటున్నారు.. ఫలితంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బదిలీలు కోరుకునే ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.
సాక్షి, కడప : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా బదిలీలపైనే చర్చసాగుతోంది. నలుగురు ఉద్యోగులు కలిస్తే చాలు బదిలీలపైనే టాపిక్ నడుస్తోంది. ఈ నెల 20లోపు బదిలీల ప్రక్రియ పూర్తికావాలన్న ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోడంతో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. అసలు బదిలీపై వెళతామా? లేక గడువు దాటి ఆగిపోతుందా? అన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. ఏదో ఒక అవకాశం వచ్చింది కదా అని ఏదో ఒక పక్క సెంటర్‌కు బదిలీపై వెళదామనుకుంటే ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన నిబంధనలు రాని నేపధ్యంలో బదిలీలపై సందిగ్దం నెలకొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పెద్ద ఎత్తున బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ గైడ్‌లైన్స్ రాలేదు.
ఆన్‌లైనా? మ్యాన్యువల్‌నా?
వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఏలు, హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్‌వైజర్లు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఆఫీసు ఉద్యోగులు ఇలా కలపుకుంటే దాదాపు వెయ్యి మందికి పైగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వందల సంఖ్యలో ఉద్యోగులు బదిలీపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైదరాబాదు ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకు బదిలీలకు సంబంధించి ఎలా నిర్వహించాలి.. వాటి నిబంధనలు ఏమిటి... వ్యవహరించాల్సిన అంశాలు... తీసుకోవాల్సిన ఆప్షన్లు తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు...అప్పుడంటున్నా ఇప్పటివరకు ఎలాంటి జీఓలు విడుదల కాలేదు. ఖరారు చేసిన నిబంధనల జీఓ రాకపోవడంతో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖే కాకుండా మరికొన్ని శాఖలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
కనిపించని కౌన్సెలింగ్..
జిల్లాలో కొన్నిశాఖలు మినహా చాలా శాఖల్లో కౌన్సెలింగ్ కనిపించడం లేదు. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 16, 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నా విధి విధానాలు రాని కారణంగా ఇంతవరకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. పైగా మరొక రోజు మాత్రమే గడువు ఉండడంతో కౌన్సెలింగ్‌కు మళ్లీ ప్రభుత్వం తేదీలను ప్రకటిస్తుందా? లేక ఉద్యోగుల బదిలీలు ఆపి వేస్తుందా? అన్నది అర్థం కావడం లేదు.
ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం : డీఎంహెచ్‌ఓ
బదిలీలకు సంబంధించి ఉద్యోగులంతా ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని, అయితే ప్రభుత్వ నిబంధనలు ఇంతవరకు రాని పరిస్థితుల నేపధ్యంలో కౌన్సెలింగ్ జరగలేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణరాజు తెలిపారు. బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు రాగానే వెంటనే చేపడతామన్నారు. మరొకరోజు సమయం ఉందని...గడువు పెంచే అవకాశం కూడా లేకపోలేదని ఆయన తెలియజేశారు. తాము కూడా అంతా సిద్ధం చేసి గైడ్‌లైన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
జెడ్పీ ఉద్యోగుల కౌన్సెలింగ్ షురూ..
కడప ఎడ్యుకేషన్: జెడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్తు పరిధిలో పనిచేస్తున్న నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, ఎనిమిది మంది జూనియర్ అసిస్టెంట్లు, 39 మంది రికార్డు అసిస్టెంట్లు, 19 మంది వాచ్‌మెన్‌లు, 46 మంది అటెండర్లు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మొదటగా ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారిని వరుసగా పిలిపించి ఆప్షన్లు ప్రకారం వారు కోరుకున్న చోటికి పంపించారు. అనంతరం మూడేళ్లు పూర్థి చేసుకున్న వారికి బదిలీలను నిర్వహించారు. జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, డిప్యూటీ చెర్మైన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఇన్‌చార్జు సీఈఓ స్వేత, డిప్యూటీ సీఈఓ ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్లు అజమెద్దీన్, శ్రీనివాసులరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ ఆలస్యం..శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఇన్‌చార్జు సీఈఓగా ఉన్న జేసీ కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్సు వల్ల సకాలంలో రాలేకపోయారు. దీంతో ఉద్యో గులతోపాటు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఆమె కోసం వేచిచూశారు.