‘అమ్మ’ను వేధిస్తున్న కొడుకు! విగ్రహం ఎక్కి ఆవేదన | son harrased mother and wife | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ను వేధిస్తున్న కొడుకు!

Published Mon, Nov 27 2017 10:00 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

son harrased mother and wife - Sakshi

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని విజయ్‌నగర్‌కు చెందిన దాసరి సాయిలు, జయలక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. సాయిలు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రాజేందర్‌కు తమ సమీప బంధువైన స్టేషన్‌ ఘనపూర్‌కు చెందిన సుమలతతో వివాహం జరిపించారు. రాజేందర్‌ తన భార్యతో కలిసి తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఇటీవల నుంచి రాజేందర్‌ భార్యను మానసికంగా వేధిస్తున్నాడు. అడ్డుకోబోయిన తల్లితోపాటు తండ్రిని కూడా తిడుతూ దాడి చేస్తున్నాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నిలదీస్తున్నందుకు దాడి చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో మనస్థాపం చెందిన భార్య సుమలత పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 3న హన్మకొండ సుబేదార్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో రాజేందర్‌పై ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ద్వారా న్యాయం చేయాలని కోరింది.

దీంతో పెద్దల సమక్షంలో రాజీకుదుర్చుకున్న రాజేందర్, ఇక నుంచి భార్యతోపాటు తల్లిదండ్రులపై ఎలాంటి వేధింపులకు పాల్పడనంటూ అదే రోజు లిఖిత పూర్వకంగా రాసి, తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. అయినా మార్పురాని రాజేందర్‌ తిరిగి  తల్లిదండ్రులతోపాటు భార్యపై వేధింపులు కొనసాగించాడు. దీంతో మనస్థాపానికి గురైన తల్లి జయలక్ష్మి ఆదివారం గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని, బాపూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఎక్కి ఆందోళన చేపట్టింది. కొడుకు నుంచి మాకు ప్రాణభయం ఉందని, కొడుకు వేధింపుల నుంచి రక్షించాలని వేడుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధ కొనసాగిస్తూ, కోడలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగామని, చివరికి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను కలిసినా తమ కష్టాలు తీరలేదని బోరున విలపించింది. కొడుకు ఫోటోను చూపిస్తూ కన్నీరు పెట్టుకుంది. విషయం తెలిసిన ఎస్సై దేవయ్య వెంటనే స్పందించి జయలక్ష్మికి నచ్చజెప్పారు. మహిళా కానిస్టేబుల్‌తో వృద్ధురాలిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న సీఐ
తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు...
కన్న తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ జి.కృష్ణ హెచ్చరించారు. కన్న కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆందోళన చేపట్టిన వృద్ధురాలు జయలక్ష్మీతోపాటు ఆమె భర్త సాయిలు, కొడుకు రాజేందర్‌కు సీఐ ఆదివారం రాత్రి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తల్లిదండ్రులు అధైర్యపడవద్దని, ఏ కష్టం వచ్చినా, ఎంత రాత్రెనా తనకు నేరుగా ఫోన్‌ చేయాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ రావడానికి భయపడద్దని, వృద్ధాప్యంలో ఇలా మానసింగా ఆందోళనలకు గురికావద్దని నచ్చజెప్పారు. తల్లిదండ్రులను, భార్యను వేధింపులకు గురి చేయడం సరికాదని, రాజేందర్‌పై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను వేధించినా శిక్ష తప్పదన్నారు. ఇక నుంచి వేధింపులకు పాల్పడనని రాజేందర్‌ సీఐకి లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement