ప్రతీకాత్మక చిత్రం
విజయనగరం ఫోర్ట్: దత్తిరాజేరు మండలానికి చెందిన పూర్ణ లక్ష్మి (పేరు మార్చాం)కి గజపతినగరం మండలానికి చెందిన ఓ వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం కూడా ఇచ్చారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయిన ఐదు నెలల వరకు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి భర్త వేధించసాగాడు. నువ్వు చదువుకున్న దానివని.. ఉద్యోగం చేస్తావనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను.. ఇప్పుడేమీ చేయకపోతే ఎలా అంటూ వేధించసాగాడు. అంతేకాకుండా ఇష్టం లేకపోయినా ఆశ్లీల చిత్రాల్లో మాదిరిగా శృంగారం చేయాలని సెక్సవల్ అబ్యూజ్ చేసేవాడు.
అదనపు కట్నం తెమ్మని కొట్టడం, తిట్టడం వంటివి చేసేవాడు. ఆరు నెలల కిందట చున్నీతో పీక నులిమి చంపడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో అంతవరకు సహనంగా ఉన్న లక్ష్మి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా ఫలితం లేకపోయింది. చివరకు విసిగిపోయి కేంద్రాస్పత్రిలో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించింది. బొబ్బిలికి చెందిన చామంతి లక్ష్మికి (పేరు మార్చాం) 2003లో బొబ్బిలికి చెందిన వ్యక్తితో 2009లో వివాహం జరిగింది. భర్త ఆరు నెలల వరకు బాగానే చూసుకున్నాడు. చామంతి లక్ష్మి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, భర్త మాత్రం చెడు అలవాట్లకు బానిసై జులాయిగా మారాడు.
తను చేసిన అప్పులను తీర్చాలంటూ భార్యను వేధించేవాడు. ఎంతగా ఇబ్బంది పెట్టినా లక్ష్మి తొమ్మిదేళ్లుగా భర్తను భరిస్తూ వచ్చింది. చివరికి బంగారు ఆభరణాలు, ఇల్లు కూడా అమ్మేసినా ఏమీ చేయలేకపోయింది. అయినప్పటికీ భర్త వేధిస్తుండడంతో చేసిది లేక చివరకు గృహహింస విభాగాన్ని ఆశ్రయించింది. ఇది ఈ ఇద్దరు మహిళల పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా అనేకమంది గృహిణులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మహిళలకు రక్షణగా అనేక చట్టాలు వచ్చినప్పటికి వేధింపులు, కొట్టడాలు, చంపడాలు తగ్గడం లేదు. గతంలో కంటే వేధింపులు ఇంకా పెరుగుతునే ఉన్నాయి.
చెప్పుకోలేకపోతున్న మహిళలు..
భర్త, అత్తమామలు ఎన్ని వేధింపులు పెట్టినా చాలామంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ఎదురించి సమస్యను పరిష్కరించుకుంటున్నా, ఇంకా చాలామంది వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అదనపు కట్నం తేవాలని.. కారు, ఇల్లు కొనడానికి డబ్బులు తీసుకురావాలి వేధిస్తున్న వారు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఈ వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యయత్నానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా మరణాన్నే ఆశ్రయిస్తున్నారు. కాస్త ధైర్యం ఉన్నవారు మాత్రం గృహహింస విభాగంలో ఫిర్యాదు చేస్తున్నారు.
పరిష్కారానికి కృషి
గృహహింసలో నమోదైన కేసులను కౌన్సిలర్లు మాధవి, రజనీ విచారిస్తారు. ముందుగా భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పటికీ సమస్య కొలిక్కి రాకపోతే కోర్టులో సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూస్తారు.
కేసుల వివరాలు ..
2006 నుంచి ఇప్పటి వరకు 529 మంది ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్‌లో 86 కేసులు పరిష్కరించగా, 85 కేసులు ఉపసంహరించుకున్నారు. 358 కేసుల్లో గృహ ఘటన నివేదిక పొందుపరచగా, 53 కేసులు కోర్టులో విత్‌డ్రా అయ్యాయి. గృహఘటన నివేదిక పొందుపరిచిన తర్వాత విత్ డ్రా అయినవి 34 కాగా ఒక కేసులో తాత్కాలిక ఉత్తర్వులు వచ్చాయి. కోర్టులో తుదితీర్పు వచ్చినవి 174 కాగా ఇంకా పెండింగ్‌లో ఉన్నవి 97 కేసులు.
Comments
Please login to add a commentAdd a comment