Vizainagaram district
-
అతిసార మరణాలపై వైఎస్ జగన్ హెచ్చరికలు.. దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో అతిసార (డయేరియా) మరణాలపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అతిసార మరణాలు సంభవించిన విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు.గత వారం రోజులుగా విజయనగరం జిల్లా గుర్లలో అతిసార ప్రబులుతుందని, కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని సాక్షి మీడియా పలు కథనాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు అతిసార వ్యాధి తీవ్రతను గుర్తిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహంఅయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. వారం రోజులుగా మరణాలు లేవంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు బుకాయించారు. అయితే ఈ ఘటనపై వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా ఏపీ ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శగుర్లలో అతిసారాతో మరణాలు సంభవించడం, భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు బాసటగా నిలిచారు. గుర్లలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. వ్యాధి గ్రస్తులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారు.ఆదివారం గుర్లలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అతిసారాతో విజయనగరం జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం: రాజన్న దొర
-
కోవిడ్ వ్యాక్సినేషన్లో విజయనగరం జిల్లా రికార్డ్
సాక్షి, విజయనగరం: కోవిడ్ వ్యాక్సినేషన్లో విజయనగరం జిల్లా ఆదివారం రికార్డ్ సాధించింది. జిల్లాలోని 248 గ్రామ, వార్డు సచివాలయాల్లో వంద శాతంకు మించి వ్యాక్సిన్‌ను జిల్లా ప్రజలకు అందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించినట్లు విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం టెస్టుల సంఖ్యల పెంచుతూ.. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,531కు చేరింది. -
వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో ‘క్షీర విప్లవం’
విజయనగరం ఫోర్ట్: పాడి పశువులు పెంచే వారి ఇల్లు పది కాలాల పాటు పచ్చగా ఉంటుందన్నది పెద్దల నానుడి. గ్రామీణ ప్రజలు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అని గట్టిగా నమ్ముతారు. దీనిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద మహిళలకు పాడి, జీవాల యూనిట్లను మంజూరు చేస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఊతమిస్తోంది. రైతుల ఇళ్లు పాడి పశువులు, జీవాలతో కళకళలాడేలా యూనిట్లు మంజూరు చేస్తోంది. ప్రభుత్వం అందించిన ‘చేయూత’ ఇలా... వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.75 వేల విలువ చేసే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఆవు లేదా గేదె అయితే ఒకటి, 8 ఆడగొర్రెలు, ఒక గొర్రెపోతు, 8 మేకలు, ఒక మేకపోతును యూనిట్‌గా సమకూర్చుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,245 ఆవులు, గేదెలు యూనిట్లు అందజేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.16.83 కోట్లు ఖర్చుచేసింది. రూ.7.53 కోట్ల విలువైన 1004 గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేసింది. పెరగనున్న పాల ఉత్పత్తి... ప్రస్తుతం జిల్లాలో పాలిచ్చే ఆవులు 2,28,773, గేదెలు 73,554 ఉన్నాయి. సగటున రోజుకి జిల్లాలో 3.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేసిన 2,245 ఆవులు, గేదెల యూనిట్ల నుంచి రోజుకు 18 వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ‘చేయూత’ను అందిస్తోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తోంది. పాడి పశువులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు తీసుకున్న మహిళలు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. - వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ జగన్‌బాబు మేలు మరచిపోలేం జగన్‌బాబు మాలాంటి పేదోళ్ల మనుగడకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత కింద ఇచ్చిన ఆవును బాగా పోషిస్తున్నాను. పాలు విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నా. - రెడ్డి కొండమ్మ, వసాది గ్రామం, గంట్యాడ మండలం ప్రస్తుతం జిల్లాలో ఉన్న పశువుల వివరాలు జిల్లాలో 6,26,847 పశువులు ఉన్నాయి. ఇందులో 4,90,998 ఆవులు, 1,35,858 గేదెలు, 5,40,336 గొర్రెలు, 2,71,205 మేకలు, 54,92,310 కోళ్లు ఉన్నాయి. -
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర
-
అగ్రి ల్యాబ్ రైతులకు ఉపయోగంగా ఉంటుంది
-
చెల్లీ.. ఏ.. బీ.. సీ.. డీ.. నాంపల్లి టేషను కాడ..
గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో రోడ్డు పక్కన గుడారం వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబమిది. కుటుంబ పోషణార్ధం తండ్రి పనికి వెళ్లాడు, తల్లి ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో పెద్దకుమార్తె తన ఇద్దరు చెల్లెళ్లను చూసుకోవడానికి బుధవారం బడి మానేసింది. నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటి వద్ద తన ఇద్దరు చెల్లెళ్ల్లతో ఏబీసీడీలు దిద్దిస్తోంది. – మిరియాల వీరాంజనేయులు, గుంటూరు అరండల్‌పేట కొడవలి పట్టిన కలెక్టర్ కలెక్టర్ కొడవలి పట్టి వరికోత కోశారు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జట్టు ట్రస్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ బుధవారం పరిశీలించారు. దురుబిలి గ్రామానికి చెందిన పత్తి అనే రైతు పొలంలో కలెక్టర్ వరి కోత కోశారు. అనంతరం వరి పంట కోత ప్రయోగం చేసి అధిక దిగుబడి వచ్చినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. – కురుపాం నాంపల్లి టేషను కాడ.... హైదరాబాద్ నగరానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు, యాచకులు, నిరాశ్రయలు తల దాచుకునే చోటులేక నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదుట బుధవారం రాత్రి వణికించే చలిలో నిద్రపోతున్న దృశ్యం -
గుర్తు పెట్టుకునే పనులు టీడీపీ చేసిందా..?
-
అదే మాట... పాత పాట!
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లా వాసులను మభ్యపెట్టే యత్నం చేశారు. గత ఎన్నికల్లో... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పదేపదే చెబుతూ వచ్చారో... అవే అంశాలను గురువారం భోగాపురం వేదికగా చెప్పుకొచ్చారు. జిల్లాను ఇతర జిల్లాకు సమానంగా అభివృద్ధి చేస్తానని... సాంస్కృతిక రాజధానిని చేసేస్తానని... పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని... ఎంఎస్‌ఏఈ పార్కులు ఏర్పా టు చేస్తానని ఎప్పటి మాదిరిగానే చెప్పుకొచ్చారు. అయితే పదవీకాలం పూర్తయిపోవస్తుంటే... ఇంకా ఎలా అమలు చేస్తారన్నదే అందరిలోనూ నెలకొన్న సందేహం. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు గురువారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిబ్బలపాలెంవద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భోగాపు రం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది గా అభివర్ణించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా, పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 1200మందికి ఉద్యోగాలు వస్తాయనీ, ప్రపంచంలో ఎక్కడకు పోవాలన్నా కనెక్టవిటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం–భోగాపురం–విశాఖపట్నం బీచ్‌రోడ్డు వస్తుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మూడున్నరేళ్ల క్రితం ఎయిర్‌ఫోర్టు మంజూౖ రెనపుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చినపుడు కూడా ఇదే విషయం తెలపడం విశేషం. కనీసం టెండర్లు కూడా ఖరారు కాకుండా నే... కేంద్ర ప్రభుత్వాధీనంలోని ఈ ఎయిర్‌పోర్టుకు ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా శంకుస్థాపన చేయడం అందరినీ నివ్వెరపరుస్తోంది. మళ్లీ తెరపైకి సాంస్కృతిక రాజధాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబునాయుడుకు గుర్తుకు వచ్చేది విజయనగరం వైభవం. అదే తడవుగా సంగీత, సాహిత్యానికి నిలయమైన విజయనగరాన్ని సాంస్కృతిక రాజధాని చేసేస్తానన్నారు. 2014 ఎన్నికలకు ముందు విజయనగరం ఆయోధ్యామైదానం వేదికగా జరిగిన సభలో టీడీపీ అధినేత హోదాలో ఆ మాట అన్నారు. సరి గ్గా ఐదేళ్లకు భోగాపురం సభలోనూ అదే మాట చెప్పడం విశేషం. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేయకుండా, భవిష్యతులో చేస్తానని చెప్ప డం వింత. విజయనగరం జిల్లా ప్రజలు మంచివారనీ, వెనుకబడిన ఈ జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు. నిజానికి ఇదే విషయం నాలుగున్నరేళ్లుగా చెబుతు న్నా... ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ పనులేమీ జరగలేదు. కనీసం ఇతర జిల్లాలతో పోల్చినా ఇక్కడ చేసింది తక్కువే. గిరిజన యూనివర్సటీ మంజూ రు చేసి నాలుగేళ్లుగా పట్టించుకోకుండా... ఇప్పు డు కేంద్రం అన్యాయం చేసిందనీ, పోరాడైనా యూనివర్శిటీ జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్పా రు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పారు. స్థలం కూడా అధికారులు గుర్తించారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ ఇప్పుడు మండలానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అమరావతి నుంచి భోగాపురం మండలం దిబ్బలపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ భోగా పురం ఎయిపోర్టుకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు గజపతినగరం చందన ఫుడ్‌పార్కు, పతంజలి ఫుడ్‌పార్కు, అరోగ్య మిల్లేట్ ప్రోసెసింగ్ యూనిట్, ప్రభుత్వ డీగ్రీ కాలేజీ, గురజా అప్పారావు యూనివర్సటీకి ఒకే వేదిక వద్ద శంకుస్థాపన చేశారు. అధికారులు ముందుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి భూమిపూజ చేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేటప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుతో భోగాపు రం, విజయనగరం కలిసిపోతాయన్నారు. జేఎన్టీయూ, ఏయూ క్యాంపస్ కలిపి 189 ఎకరాల్లో గురజాడ అప్పారావు యూనివర్సటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డీగ్రీ కాలేజీ వస్తుందన్నారు. ఫుడ్‌పార్కుల వల్ల అభివృద్ధి సాధించవచ్చునన్నారు. గ్రామస్వరాజ్, పోషక అభియాన్, కృషి అభియాన్‌తో జాతీయ స్థాయిలో ప్రధమస్థానం సాధించడం, పారిస్ఫోరం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్‌కు ప్రధమస్థానం రావడంపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను అభినందించారు. పైడతల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించామన్నారు. ఆగర్భ శత్రువులుగా ఉ న్న విజయనగరం, బొబ్బిలి రాజవంశాలను కలిపి న ఘనత తెలుగుదేశం పార్టీదేననీ చెప్పుకున్నారు. ఆశోక్ గైర్హాజరుపై చర్చ కేంద్ర పౌర విమాయానశాఖ మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్గజపతిరా జు ఎయిర్‌పోర్టుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీకి ఆయన కీలక నాయకుడు, పైగా భోగా పురం ఎయిర్‌పోర్టు విషయంలో తొలుత చొరవచూపిన వ్యక్తి శంకుస్థాపనకు రాకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు చర్చించుకోవడం వినిపించింది. అయితే సభలో మాట్లాడిన వారెవరూ వీటిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. జనానికి పాట్లు రాష్ట్రం పరిధిలో లేని ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసి ప్రభుత్వం హడావుడి చేయాలనుకోవడం, ఆ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి సకాలంలో రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఉదయం 10.30 నుంచి 11.30గంటల వరకు కార్యక్రమం అని ముందుగా చెప్పి, సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.40గంటలకు వచ్చారు. కార్యక్రమం 3.15వరకు సాగింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ముగియడంతో జనం ఆకలితో అలమటించారు. వెళ్లిపోదామంటే పోలీసులు బారికేడ్లు మూసేయడంతో కార్యక్రమం ముగిసే వరకు ఉండి పట్టపగలు చుక్కలు చూశారు. కార్యక్రమంలో రాష్ట్ర మం త్రి సుజయ్‌కృష్ణ రంగారావు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి, రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ ప్రసగించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలుశాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం సభలో పోలీసుల ఓవర్ యాక్షన్ పూసపాటిరేగ (భోగాపురం): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకు స్థాపన సభలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం చంద్రబాబు పాల్గొనే సభకు అతి సమీపంలోనే వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అక్కడ జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చున్నారు. గ్యాలరీలోకి వెళ్లేందుకు పోలీసులు ఎవరిని అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. కానీ సీబీఎన్ ఆర్మీ పేరిట వచ్చిన 100 మంది యువకులను మాత్రం అనుమతించారు. దీనిపై పలువురు బహిరంగంగానే పోలీసుల తీరును విమర్శించారు. ఏ హోదా లేని వ్యక్తులను వీవీఐపీ గ్యాలరీకి పంపించి, అవసరం ఉండి, లోపలికి వెళ్తామన్న వారిని పంపించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంకా భయం భయంగానే...
విజయనగరం ఫోర్ట్: దత్తిరాజేరు మండలానికి చెందిన పూర్ణ లక్ష్మి (పేరు మార్చాం)కి గజపతినగరం మండలానికి చెందిన ఓ వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం కూడా ఇచ్చారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయిన ఐదు నెలల వరకు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి భర్త వేధించసాగాడు. నువ్వు చదువుకున్న దానివని.. ఉద్యోగం చేస్తావనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను.. ఇప్పుడేమీ చేయకపోతే ఎలా అంటూ వేధించసాగాడు. అంతేకాకుండా ఇష్టం లేకపోయినా ఆశ్లీల చిత్రాల్లో మాదిరిగా శృంగారం చేయాలని సెక్సవల్ అబ్యూజ్ చేసేవాడు. అదనపు కట్నం తెమ్మని కొట్టడం, తిట్టడం వంటివి చేసేవాడు. ఆరు నెలల కిందట చున్నీతో పీక నులిమి చంపడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో అంతవరకు సహనంగా ఉన్న లక్ష్మి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా ఫలితం లేకపోయింది. చివరకు విసిగిపోయి కేంద్రాస్పత్రిలో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించింది. బొబ్బిలికి చెందిన చామంతి లక్ష్మికి (పేరు మార్చాం) 2003లో బొబ్బిలికి చెందిన వ్యక్తితో 2009లో వివాహం జరిగింది. భర్త ఆరు నెలల వరకు బాగానే చూసుకున్నాడు. చామంతి లక్ష్మి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, భర్త మాత్రం చెడు అలవాట్లకు బానిసై జులాయిగా మారాడు. తను చేసిన అప్పులను తీర్చాలంటూ భార్యను వేధించేవాడు. ఎంతగా ఇబ్బంది పెట్టినా లక్ష్మి తొమ్మిదేళ్లుగా భర్తను భరిస్తూ వచ్చింది. చివరికి బంగారు ఆభరణాలు, ఇల్లు కూడా అమ్మేసినా ఏమీ చేయలేకపోయింది. అయినప్పటికీ భర్త వేధిస్తుండడంతో చేసిది లేక చివరకు గృహహింస విభాగాన్ని ఆశ్రయించింది. ఇది ఈ ఇద్దరు మహిళల పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా అనేకమంది గృహిణులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మహిళలకు రక్షణగా అనేక చట్టాలు వచ్చినప్పటికి వేధింపులు, కొట్టడాలు, చంపడాలు తగ్గడం లేదు. గతంలో కంటే వేధింపులు ఇంకా పెరుగుతునే ఉన్నాయి. చెప్పుకోలేకపోతున్న మహిళలు.. భర్త, అత్తమామలు ఎన్ని వేధింపులు పెట్టినా చాలామంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ఎదురించి సమస్యను పరిష్కరించుకుంటున్నా, ఇంకా చాలామంది వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అదనపు కట్నం తేవాలని.. కారు, ఇల్లు కొనడానికి డబ్బులు తీసుకురావాలి వేధిస్తున్న వారు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఈ వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యయత్నానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా మరణాన్నే ఆశ్రయిస్తున్నారు. కాస్త ధైర్యం ఉన్నవారు మాత్రం గృహహింస విభాగంలో ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారానికి కృషి గృహహింసలో నమోదైన కేసులను కౌన్సిలర్లు మాధవి, రజనీ విచారిస్తారు. ముందుగా భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పటికీ సమస్య కొలిక్కి రాకపోతే కోర్టులో సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూస్తారు. కేసుల వివరాలు .. 2006 నుంచి ఇప్పటి వరకు 529 మంది ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్లో 86 కేసులు పరిష్కరించగా, 85 కేసులు ఉపసంహరించుకున్నారు. 358 కేసుల్లో గృహ ఘటన నివేదిక పొందుపరచగా, 53 కేసులు కోర్టులో విత్‌డ్రా అయ్యాయి. గృహఘటన నివేదిక పొందుపరిచిన తర్వాత విత్ డ్రా అయినవి 34 కాగా ఒక కేసులో తాత్కాలిక ఉత్తర్వులు వచ్చాయి. కోర్టులో తుదితీర్పు వచ్చినవి 174 కాగా ఇంకా పెండింగ్‌లో ఉన్నవి 97 కేసులు. -
అధికారం ఉంది...ఆక్రమించేద్దాం
అధికార బలంతో 2.75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేసి పట్టాలు పుట్టించారు. తీరా.. ఆ భూమి పోరంబోకుగా అధికారులు నిర్ధారించినా.. మరోసారి మంత్రి అండదండలతో రూ.కోటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో స్టోన్ క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డంపెట్టుకొని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు భూ అక్రమాలకు తెర తీశారు. తాజాగా జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లులో పోరంబోకు భూములను కైవసం చేసుకునేందుకు మంత్రి అండదండలతో ఓ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 2లో దాదాపు రూ.కోటి విలువైన 2.75 ఎకరాల భూమిలో స్టోన్ క్రషర్ నెలకొల్పేందుకు అనుకూలంగా భూమిని బదలాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయనకు సన్నిహితుడైన పి.సత్యనారాయణరాజు ఈ భూమిని పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పుట్టించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నాలను గతంలో అధికారులు అడ్డుకున్నా.. మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం గమనార్హం. ఇదీ పరిస్థితి... సీతానగరం మండలం నిడగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 4/1 నుంచి 5 సబ్డివిజన్ల వరకూ 40 ఎకరాలు పైబడి రెవెన్యూ లెక్కదాఖలా ప్రభుత్వ భూమిగా (గయ్యాలు) నమోదై ఉంది. సర్వే నంబర్–1 కొండ పోరంబోకు గానూ, సర్వే నంబర్–2 సాగునీటి చెరువు, సర్వేనంబర్ 3లో 8.5 ఎకరాలు గయ్యాలు భూమి కాగా, 4, 5 సబ్‌డివిజన్ సర్వే నంబర్లలోని భూములు గయ్యాలు భూమిగానే ఎఫ్సీవో (ఫాదర్ రికార్డు), ఎండీఆర్ (మండల్ పైక్లారిటికల్ రికార్డు) రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఈ భూముల్లో సర్వే నంబర్ 4లోని సబ్ డివిజన్ చేసి 4/3, 4/2 నంబర్లలో వ్యవసాయ భూములు, ఫలసాయాన్ని ఇచ్చే తోటలు ఉన్నాయి. ఈ భూములకు పూర్వం డి– నమూనాలు చేసి కొంత మంది రైతులకు జీవనోపాధి కోసం అప్పగించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ 8 ఎకరాల భూమిని టీడీపీ నేత రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. దానిలో సర్వే నంబర్ 4/2లో ఉన్న భూమిని ఆయిల్ కన్వర్షన్ కోసం భూమి కొనుగోలుదారు బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షులు, బేబీనాయనకు సన్హితుడు అయిన పి.సత్యనారాయణ రాజు అప్పటి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన వినతిపత్రం మేరకు ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్స్ పరిశీలించగా వేరొక యజమానుల పేరుతో ఉన్నప్పటికీ సత్యనారాయణరాజు భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. భూ కన్వర్షన్ చేయడానికి ముందు భూమికి సంబంధించిన పూర్వం నుంచి ఉన్న ఎఫ్సివో, ఎండిఆర్ రికార్డులను అధికారులు పరిశీలించారు. పూర్వపరాలు తెలుసుకునేందుకు భౌతికంగా భూములను, రికార్డులను పరిశీలించారు. రికార్డు లెక్కదాఖలా గయ్యాలు భూమిగా నమోదై ఉన్నందున ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని అప్పటి తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే, నిడగల్లులో పోరంంబోకు భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమి రైతు చేతిలో ఉన్నప్పుటి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం 2.75 ఎకరాలను ఆయిల్ కన్వర్జేషన్ చేయాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. అధికారులు కాదన్నా... నిడగల్లు రెవెన్యూ పరిధిలోని భూమి రైతులచేతిలో ఉన్నా.. వేరొకవ్యక్తి కొంత భూమిని కొనుగోలుచేసి స్టోన్ క్రషర్ నెలకొల్పడానికి సర్వేనంబర్ 2లో 2.75 ఎకరాల భూమిని భూ కన్వర్షన్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దరఖాస్తును స్వీకరించిన అప్పటి తహసీల్దార్, సిబ్బంది ఎఫ్సివో, ఎండీఆర్ రికార్డులతో భూములను భౌతికంగా పరిశీ లించారు. ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించారు. జీవనోపాధికోసం పోరంబోకు భూమిపై వ్యవసాయం చేయడానికి ఇబ్బందిలేదని, రికార్డుల ప్రకారం భూ కన్వర్షన్ చేయడానికి సిఫార్స్ చేయలేమని అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అయితే, పార్వతీపురం ఆర్డీవో, సీతానగరం ప్రస్తుత తహసీల్దార్లపై మంత్రి, అతని సోదరుడి ద్వారా సిఫార్సులు చేయించుకొని భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇతర ప్రయత్నాలను చూసిన మిగత నేతలు కొందరు తాము కూడా ఇదే పందాలో వెళ్లి పోరంబోకు భూములను కైవశం చేసుకోవాలని భావిస్తున్నారు. పేదలకు ఇచ్చిన ఈ పట్టా భూములను కొనడమే నేరమైతే వాటిని వ్యాపార అవసరం కోసం తమకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం అంతకన్నా పెద్దనేరం. పాలకులకు, అధికారులకు ఇదేమంత పెద్ద నేరంగానో, తప్పుగానో కనిపించకపోవడం విశేషం. సమాచారం అందజేస్తాం.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో సత్యనారాయణరాజు గతంలో చేసిన అర్జీపై అప్పీల్ చేయడంతో పేరావైజ్డ్ రిమార్కులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం కోరింది. రికార్డులను పరిశీలించి అడిగిన సమాచారం అందజేస్తాం. – అప్పలరాజు, తహసీల్దార్, సీతానగరం -
పొట్టేల పందేలపై పోలీసుల దాడి, నలుగురి అరెస్ట్
విజయనగరం: జిల్లాలోని ఎల్ కోట మండలం వీరభద్రపేట సమీపంలో పొట్టేల పందెలపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దాడులు జరిపి పొట్టేల పందెలను అడ్డుకున్నారు. పందెలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్
* ఏపీలో లక్షల పింఛన్లపై వేలాడుతున్న వడపోత * కత్తి కుంటిసాకులు చూపుతూ వేటేస్తున్న అధికారులు ఈ ఫొటోలోని బడ్నాన అప్పలస్వామి, నరసమ్మలు దంపతులు. అప్పలస్వామి వయసు 70 ఏళ్లు, నరసమ్మ వయసు 66 సంవత్సరాలు. వీరిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎరకందొరవలస గ్రామం. నిరుపేదలైన వీరికి గత ఏడాది రచ్చబండలో రేషన్‌కార్డు ఇచ్చారు. అప్పటి నుంచీ వీరికి వృద్ధాప్య పింఛను వస్తోంది. తాజాగా సర్కారు చేపట్టిన తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ దంపతులకు పింఛను కత్తిరించేశారు. వారు కాళ్లావేళ్లా పడ్డా.. స్థానిక నేతలు బతిమిలాడినా కనికరం చూపలేదు. ఇంతకీ పింఛను కత్తిరించటానికి అధికారులు చూపిన కారణం.. పండు ముదుసలులైన వీరిద్దరి ఫొటోలతో ఉన్న రేషన్ కార్డులో వారి వయసు 25 ఏళ్లు, 22 ఏళ్లుగా నమోదై ఉండటమే! రేషన్ కార్డు నమోదులో ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పును సాకుగా చూపి.. పండు ముదుసలులు కళ్లెదుట కనబడుతున్నా పింఛన్లు కత్తిరించేశారు!! ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సామాజిక పింఛన్లను ఏరివేయటానికి సర్కారు వారు ఎంతగా తహతహలాడుతున్నారో తెలియడానికి!!! సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. ఇక తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు. సర్కారు సాయంతో ఇల్లు కట్టుకున్నా కట్... 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక.. అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పింఛన్ల జాతరలో పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కాగా, వేలిముద్రలతో సరిపోల్చుతూ ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ లేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు. నిరంతరం వేలాడనున్న వడపోత కత్తి... పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. ఈ జాబితా వడపోతను నిరంతరం కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబి తాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడిం చారు. సానుభూతితోనూ, మానవతా థృ క్పథం తో అందించే పింఛన్ల జాబితాపైనా ఇకపై ఆంక్ష ల పర్వం కొనసాగించాలని నిర్ణయించారు. నామమాత్ర కేటాయింపులతో ఎలా? ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్ర మే కేటాయించారు. గడిచిన 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.650 కోట్లు అవు తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పు న, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున రూ. 3,080 కోట్లు కావాలి. గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తా న్ని కలిపితే కనీ సంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల కత్తిరింపు అమానవీయం: వైఎస్సార్సీపీ పింఛన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇపుడు కోతలు విధించడం అమానవీయం, అమానుషమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2 నుంచి పిం ఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశతో ఎదురు చూసిన లక్షలాది వృద్ధులు, వితంతువుల పింఛన్లను అడ్డంగా క త్తిరించి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు కోత లు పెడుతూ మరోవైపు ‘భరోసా’ ఇస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఆధార్ కార్డు లేదన్న కారణంగా 1.7 లక్షలు, అనర్హులంటూ 3.5 లక్షల మంది పింఛన్లకు కోత విధించారని విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతను కల్పించే ఈ పింఛన్లను సంతృప్తస్థాయిలో ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు. -
విజయనగరంలో సిలిండర్ పేలి మహిళ మృతి
విజయనగరం: జిల్లాలోని బోగాపురం మండలం రావడలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. అయితే గాయపడ్డవారిలో ఏడేళ్ల చిన్నారి ఉన్నట్టు తెలిసింది. వారి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
రెండు తలల దూడ
రామభద్రపురం: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామంలో ఆవుకు రెండు తలలు, నాలుగు కళ్లు, రెండు చెవులతో సోమవారం ఓ దూడ పుట్టింది. ఆ గ్రామంలోని కిలపర్తి శివుడు అనే రైతుకు చెందిన జెర్సీ ఆవు రెండో కాన్పులో ఈ దూడ పుట్టింది. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. పశువైద్యాధికారి దీన కుమార్ ఈ దూడను పరిశీలించి జన్యుపరమైన లోపం వల్ల ఇలా పుట్టిందని తెలిపారు. -
30 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం
పూసపాటిరేగ: వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో వీస్తున్న గాలులకు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చింతపల్లిలో బుధవారం తెల్లవారుజామున సముద్రం 30 అడుగుల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం వద్ద ఉన్న వలలు సముద్రంలో కొట్టుకు పోయి సుమారు రూ.3లక్షల వరకు నష్ట పోయినట్లు మత్స్యకారులు తెలిపారు. తీరం అంచున ఉన్న పడవల కిందకు సముద్రం నీరు చేరడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అధికారుల హెచ్చరికలతో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లలేదు.