ప్రతీకాత్మక చిత్రం
అధికార బలంతో 2.75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేసి పట్టాలు పుట్టించారు. తీరా.. ఆ భూమి పోరంబోకుగా అధికారులు నిర్ధారించినా.. మరోసారి మంత్రి అండదండలతో రూ.కోటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో స్టోన్ క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డంపెట్టుకొని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు భూ అక్రమాలకు తెర తీశారు. తాజాగా జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లులో పోరంబోకు భూములను కైవసం చేసుకునేందుకు మంత్రి అండదండలతో ఓ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 2లో దాదాపు రూ.కోటి విలువైన 2.75 ఎకరాల భూమిలో స్టోన్ క్రషర్ నెలకొల్పేందుకు అనుకూలంగా భూమిని బదలాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయనకు సన్నిహితుడైన పి.సత్యనారాయణరాజు ఈ భూమిని పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పుట్టించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నాలను గతంలో అధికారులు అడ్డుకున్నా.. మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం గమనార్హం.
ఇదీ పరిస్థితి...
సీతానగరం మండలం నిడగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 4/1 నుంచి 5 సబ్‌డివిజన్‌ల వరకూ 40 ఎకరాలు పైబడి రెవెన్యూ లెక్కదాఖలా ప్రభుత్వ భూమిగా (గయ్యాలు) నమోదై ఉంది. సర్వే నంబర్–1 కొండ పోరంబోకు గానూ, సర్వే నంబర్–2 సాగునీటి చెరువు, సర్వేనంబర్ 3లో 8.5 ఎకరాలు గయ్యాలు భూమి కాగా, 4, 5 సబ్‌డివిజన్ సర్వే నంబర్లలోని భూములు గయ్యాలు భూమిగానే ఎఫ్‌సీవో (ఫాదర్ రికార్డు), ఎండీఆర్ (మండల్ పైక్లారిటికల్ రికార్డు) రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఈ భూముల్లో సర్వే నంబర్ 4లోని సబ్ డివిజన్ చేసి 4/3, 4/2 నంబర్లలో వ్యవసాయ భూములు, ఫలసాయాన్ని ఇచ్చే తోటలు ఉన్నాయి.
ఈ భూములకు పూర్వం డి– నమూనాలు చేసి కొంత మంది రైతులకు జీవనోపాధి కోసం అప్పగించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ 8 ఎకరాల భూమిని టీడీపీ నేత రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. దానిలో సర్వే నంబర్ 4/2లో ఉన్న భూమిని ఆయిల్ కన్వర్షన్ కోసం భూమి కొనుగోలుదారు బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షులు, బేబీనాయనకు సన్హితుడు అయిన పి.సత్యనారాయణ రాజు అప్పటి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన వినతిపత్రం మేరకు ఎఫ్‌ఎంబీ, ఫెయిర్ అడంగల్స్ పరిశీలించగా వేరొక యజమానుల పేరుతో ఉన్నప్పటికీ సత్యనారాయణరాజు భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు.
భూ కన్వర్షన్ చేయడానికి ముందు భూమికి సంబంధించిన పూర్వం నుంచి ఉన్న ఎఫ్‌సివో, ఎండిఆర్ రికార్డులను అధికారులు పరిశీలించారు. పూర్వపరాలు తెలుసుకునేందుకు భౌతికంగా భూములను, రికార్డులను పరిశీలించారు. రికార్డు లెక్కదాఖలా గయ్యాలు భూమిగా నమోదై ఉన్నందున ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని అప్పటి తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే, నిడగల్లులో పోరంంబోకు భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమి రైతు చేతిలో ఉన్నప్పుటి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం 2.75 ఎకరాలను ఆయిల్ కన్వర్జేషన్ చేయాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు.
అధికారులు కాదన్నా...
నిడగల్లు రెవెన్యూ పరిధిలోని భూమి రైతులచేతిలో ఉన్నా.. వేరొకవ్యక్తి కొంత భూమిని కొనుగోలుచేసి స్టోన్ క్రషర్ నెలకొల్పడానికి సర్వేనంబర్ 2లో 2.75 ఎకరాల భూమిని భూ కన్వర్షన్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దరఖాస్తును స్వీకరించిన అప్పటి తహసీల్దార్, సిబ్బంది ఎఫ్‌సివో, ఎండీఆర్ రికార్డులతో భూములను భౌతికంగా పరిశీ లించారు. ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించారు. జీవనోపాధికోసం పోరంబోకు భూమిపై వ్యవసాయం చేయడానికి ఇబ్బందిలేదని, రికార్డుల ప్రకారం భూ కన్వర్షన్ చేయడానికి సిఫార్స్ చేయలేమని అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
అయితే, పార్వతీపురం ఆర్డీవో, సీతానగరం ప్రస్తుత తహసీల్దార్‌లపై మంత్రి, అతని సోదరుడి ద్వారా సిఫార్సులు చేయించుకొని భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇతర ప్రయత్నాలను చూసిన మిగత నేతలు కొందరు తాము కూడా ఇదే పందాలో వెళ్లి పోరంబోకు భూములను కైవశం చేసుకోవాలని భావిస్తున్నారు. పేదలకు ఇచ్చిన ఈ పట్టా భూములను కొనడమే నేరమైతే వాటిని వ్యాపార అవసరం కోసం తమకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం అంతకన్నా పెద్దనేరం. పాలకులకు, అధికారులకు ఇదేమంత పెద్ద నేరంగానో, తప్పుగానో కనిపించకపోవడం విశేషం.
సమాచారం అందజేస్తాం..
పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో సత్యనారాయణరాజు గతంలో చేసిన అర్జీపై అప్పీల్ చేయడంతో పేరావైజ్డ్ రిమార్కులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం కోరింది. రికార్డులను పరిశీలించి అడిగిన సమాచారం అందజేస్తాం.
– అప్పలరాజు, తహసీల్దార్, సీతానగరం
Comments
Please login to add a commentAdd a comment