దర్జాగా కబ్జా!
♦ ‘నారాయణ’ భూములపై వాలిన గద్దలు
♦ భూ బకాసురుల ఇష్టారాజ్యం కార్మికుల నోట్లో మట్టి
♦ డీఆర్వో కస్టోడియన్‌గా ఉన్నా.. ఫలితం శూన్యం
♦ కోర్టు తీర్పు బేఖాతర్ అక్రమార్కులకు అధికారుల అండ
రామచంద్రాపురం: దొంగలు దొంగలు కలిసి దర్జాగా కార్మికుల రెక్కల కష్టం దోచుకుంటున్నారు. డీఆర్వో కస్టోడియన్‌గా ఉన్న నారాయణరావు భూములు అధికారికంగానే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కనీసం కేసులు తేలే వరకు కూడా బాధిత కార్మికుల భూములను రక్షించలేకపోతున్నారు. పటాన్‌చెరు ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుపై నారాయణరావు 36 ఏళ్ల కింద ప్లాట్లు చేసి అమ్ముకున్న భూములు వివాదాల్లో ఉండగా పట్టా భూములకు ఇప్పుడు వారసులు పుట్టుకొచ్చారు. ఒకవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌కే సిన్హా అధ్యక్షతన ఈ భూములపై సమగ్ర విచారణ జరుగుతుండగానే.. మరోవైపు అక్రమార్కులు తహసీల్దారు కార్యాలయంలో మాయచేసి పట్టాలు సృష్టించి, పంచాయతీ అధికారుల అండదండలతో ఏకంగా భూ కబ్జాకే సిద్ధమయ్యారు.
సొసైటీ పేరుతో మోసం..
సిద్దిపేటకు చెందిన నారాయణరావు 1980లో పటాన్‌చెరు ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని స్థాపించారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ, పట్టా భూముల్లో వెంచర్లు చేసి సంఘం సభ్యులకు విక్రయించారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులను రూ. 105 సభ్యత్వ రుసుం వసూలు చేసి సభ్యులుగా చేర్చుకున్నారు. 1980-87 మధ్య ఏడేళ్ల పాటు 382 ఎకరాల ప్రభుత్వ భూమి, 100 ఎకరాల పట్టా భూమిలో వెంచర్లు చేశారు. 150 నుంచి 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి సభ్యులకు విక్రయించారు. 5 వేల మందికి పైగానే సొసైటీలో సభ్యులు ఉన్నట్లు జిల్లా సహకార సంఘం నివేదికలను బట్టి తెలుస్తోంది.
ఒక్కో ప్లాటుకు అప్పట్లో రూ.3,000 నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేశారు. పటాన్‌చెరు మండలం అమీన్‌పుర్, రామచంద్రాపురం మండలం కొల్లూరు, తెల్లాపూర్, జిన్నారం మండలం బొల్లారంలో సర్వే నంబర్ 323/14, 232/19లో 157.08 ఎకరాలు, 324/1 సర్వే నంబర్ కింద 12.14, 325/1లో 18.34 ఎకరాలు,326/1 లో 20.30 ఎకరాలు, 328 సర్వే నంబర్ నుంచి 340 వరకు 173 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించగా సర్వే నంబర్ 216, 215 కొల్లూరు భూములను నారాయణరావు కొనుగోలు చేసి వెంచర్ చేశారు. ప్రస్తుతం ఈ భూములకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) కస్టోడియన్‌గా ఉన్నారు.
ఏం చేశాడంటే....
సొసైటీ కోసం ముందు కొంత పట్టా భూమిని కొని దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములనూ కలుపుకున్నారు. పేద రైతుల కోసం అసైన్డ్ చేసిన భూములను తన ఖాతాలోనే వేసుకున్నారు. అప్పట్లో ఇక్కడ పని చేసిన రెవెన్యూ యంత్రాంగం సహకరించడంతో నారాయణరావు అడ్డూ అదుపు లేకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించారు. ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురికి చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఈలెక్కన ప్లాట్లు కొన్న వాళ్లు 10వేల మందికి పైగా ఉన్నారు. 1997లో నారాయణరావు రిజిస్ట్రేషన్ శాఖలోని లొసుగుల ఆధారంగా ఏవో కారణాలు చూపిస్తూ దాదాపు 4000 పైగా సంఘం సభ్యుల రిజిస్ట్రేషన్‌లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించాడు.
ఆ నోటీసులు అందుకున్న కార్మికులు ఆందోళనకు లోనై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (సీపీఐ) అసెంబ్లీలో లేవనెత్తారు. అప్పటి ప్రభుత్వం ఈ సొసైటీ వ్యవహారాలపై అప్పటి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవిని అధ్యక్షతన హౌస్ కమిటీ వేసింది. సొసైటీ అక్రమాలను దాదాపు మూడేళ్ల పాటు అధ్యయనం చేసింది. నారాయణరావు ప్రభుత్వ భూములను కబ్జాపెట్టి ప్లాట్లుగా చేసి విక్రయించారని కమిటీ నిర్ధారించింది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కమిటీ.. ప్రభుత్వానికి నివేదించింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
ప్లాట్లు తీసుకున్న సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. 2006లో వేర్వేరుగా రిట్ పిటీషన్ వేశారు. 8 ఏళ్ల పాటు సమగ్ర పరిశీలన చేసిన కోర్టు హౌస్ కమిటీ సిఫారసునే సమర్థిస్తూ 2014 ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని, పట్టా భూముల్లో చేసిన ప్లాట్లను సంఘం సభ్యులకు అప్పగించాలని ఆ తీర్పులో పేర్కొన్నది.
భూములపై వాలిన గద్దలు
ఈ భూములు ఇప్పటికే ‘గద్దల’ కనుసన్నల్లోకి వెళ్లిపోయాయి. అర్థ, అంగబలం ఉన్న వాళ్లు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకొని చుట్టూ ఫెన్షింగ్ చేసుకొని సెక్యురిటీ గార్డుల పేరుతో రౌడీమూకలను కాపలాపెట్టారు. మరి కొందరు తమ ఆధీనంలో ఉన్న పట్టా భూమిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆయా పట్టాభూముల్లో పట్టాలున్న సొసైటీ సభ్యుల నుంచి గజానికి రూ 500 నుంచి రూ1000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకుంటున్నారు. దీనిపై డీఆర్వో వివరణ కోసం ఆయన కార్యాలయం ఎదుట దాదాపు 30 నిమిషాల పాటు వేచి ఉన్నా ఆయన అందుబాటులోకి రాలేదు.