దేవుడి భూముల్ని వదలా..
♦ ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటున్న వైనం
♦ టీడీపీ నాయకుల చేతుల్లో ఆలయ మాన్యాలు
♦ రూ.9కోట్ల విలువచేసే భూములు హాంపట్
♦ దేవాలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు కరువు
గుడిలో వెలిగే దీపం.. సకల పాపాలను హరించి జీవితంలో అఖండ వెలుగు ప్రసరింపజేస్తుందని, మోగే గంట అందరిలో చైతన్యం కల్గిస్తుందని పెద్దల నమ్మకం. అయితే కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో ఆ రెండింటికి ఎసరుపెడుతున్నారు. దేవుడి ఆస్తులనే కైంకర్యం చేస్తున్నారు. ఫలితంగా ఎంతో ఘనచరిత్ర కలిగిన పురాతన ఆలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు భక్తులే దిక్కవుతున్నారు.
కలసపాడు: మండలంలో ఆలయాల మాన్యాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. మాన్యాలను కాపు కాయాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులే కలిసి కాజేస్తున్నారు. దీంతో ఆలయాల్లో నిత్యపూజలు, నైవేద్యాలు, ఉత్సవాలకు దిక్కులేకుండా పోయింది. 13 పంచాయతీల్లో దేవుళ్లకు చెందిన 99.6 ఎకరాల భూములు అధికశాతం అధికారపక్షం నేతలే కైంకర్యం చేశారు. ఆలయాల అర్చకులకు కేటాయించిన భూములు కూడా వారిని భయపెట్టి ఆక్రమించేస్తున్నారు. ఈ భూముల విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా. ఆలయాల భూముల్లో అధిక శాతం(28 ఎకరాలు)శంకవరంలోని శ్రీభవానీశంకరునికి, ఆంజనేయస్వామికి చెందినవి కావడం విశేషం. కలసపాడు శ్రీఉమామహేశ్వరునికి సర్వే నంబర్ 287లో 5.08 ఎకరాల ఉండేది.
అందులో 3.31 సెంట్ల విస్తీర్ణం 2008లో తెలుగుగంగ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంది. నష్టపరిహారం కింద రూ.2.40 లక్షలు మంజూరు చేశారు. పరిహారం మాత్రం ఎవరికి చేరిందో అంతుచిక్కడం లేదు. కలసపాడులో శ్రీలక్షీచెన్నకేశవస్వామికి సర్వేనంబరు 205 లో 0.85 సెంట్లు, పుష్పగిరి చెన్నకేశవస్వామికి సర్వేనంబర్ 368లో 0.37 సెంట్లు, 423లో 0.96 సెంట్లు, పుష్పగిరి శ్రీ చంద్రమౌళిశ్వరునికి 1.02 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూములు దేవాలయాల ఆధీనంలో లేవు. మామిళ్లపల్లె పరిధిలో శ్రీ తిరుమలకొండ స్వామికి సర్వేనంబర్ 155లో 4.43 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 2 ఎకరాల భూమి మామిళ్లపల్లెకి చెందిన ఓ పెద్దమనిషి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి అమ్మి రిజిష్టర్ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
అంతా ఆక్రమించేశారు
పెండ్లిమర్రి గ్రామంలోని శ్రీ అంజనేయస్వామికి సర్వే నంబ ర్ 2లో 3.83 ఎకరాలు ఈశ్వరాలయానికి సర్వేనంబర్ 9లో ఉన్న 4.83ఎకరాల భూమిని మాయం చేశారు. గంగాయిపల్లెలో 18 వ సర్వే నంబర్‌లో 5.24 ఎకరాలు, 43లో 8.17 ఎకరాల భూమి టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. సిద్దమూర్తిపల్లెలో శ్రీపుష్పగిరి చంద్రమౌళీశ్వరస్వామికి సర్వేనంబర్140 లో0.86 సెంట్లు, 23లో 2.14 ఎకరాలు ఆక్రమణకు గురైంది. చెన్నుపల్లె అంకాలమ్మకు 173లో 1.63 ఎకరాలు, రాజుపాలెం అహోబిళంస్వామికి 279/ఎ/బి/12లో 1.96 సెంట్లు,465లో1.08 సెంట్లు ఆక్రమణకు గురైంది. దిగువపల్లె, ఎగువతంబళ్లపల్లెల్లో శ్రీగోవిందస్వామికి సర్వేనంబర్ 28లో 2.13 ఎకరాలు,72లో 3.30 ఎకరాల భూమి ఉంది. అ దీ ఆక్రమణకు గురైంది. కొండపేట శ్రీ చెన్నకేశవస్వామి, కొండసింగరయ్యస్వామి, ఈశ్వరునికి సర్వేనంబర్ 64లో 0.49సెంట్లు, 206లో 3.02 ఎకరాలు అయ్యవారిపల్లెలో శ్రీవెర్రికొండయ్యస్వామికి సర్వే నంబర్17లో 4.73 ఎకరాల భూమి ఉండగా దానిని కూడా కొందరు తమ్ముళ్లు ఆక్రమించేశారు.
శంకరుని మాన్యాలు మాయం
లక్షల విలువ చేసే శంకవరం గ్రామానికి చెందిన శ్రీభవానీ శంకరుని భూములు టీడీపీ నాయకుల చేతుల్లో చేరిపోయాయి. సర్వేనంబర్ 1751లో 3.55 ఎకరాలు, 1,494లో 1.15 ఎకరాలు, 253లో 0.64 ఎకరాలు, 1,661లో 0.97 ఎక రాలు, 2003లో 0.43 సెంట్లు, మొత్తం 11.92 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన శ్రీఅంజనేయస్వామికి సర్వేనంబర్ 456లో 7.79ఎకరాలు, 351లో 0.87 ఎకరాలు, 252లో 0.59 ఎకరాలు, 988లో 3.59 ఎకరాలు, 1232లో 0.65 సెంట్లు, 1474లో 0.66 సెంట్లు,1777లో 2.08 ఎకరాలు, 279లో 0.73 సెంట్లు, మొత్తం 16.96 ఎకరాల భూమి గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు ఆక్రమించేశారు. అంకాలమ్మ, నెల్లూరమ్మకు సర్వేనంబర్ 1,121లో 1.61ఎకరాలు, 2,228లో 1.83 ఎకరాలు, శ్రీ తిరుమలనాథ ఆలయానికి చెందిన 28సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. శంకవరం శివాలయానికి సర్వేనంబర్ 1925 లో 4.21ఎకరాల భూమి లింగారెడ్డిపల్లె గ్రామంలో ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ పొలాన్ని ఆక్రమించుకుని ఏకంగా ఇళ్ల నిర్మాణమే చేపట్టారు.
రికార్డులనే మాయం చేశారు
మండలంలో పుష్పగిరి చెన్నకేశవస్వామి, ముక్తేశ్వరస్వామి, శ్రీతిరుమలకొండస్వామి ఆలయాలకు చెందిన భూముల రికార్డులనే మాయం చేశారు. తిరుమలకొండస్వామి, పుష్పగిరి చంద్రమౌళీశ్వరస్వామి, భైరవస్వామి, తిరుమలనాథస్వామి, గోవిందస్వామి, వెర్రికొండయ్య స్వాములకు దాతలు ఇచ్చిన 15 ఎకరాల భూములను ఆక్రమించేశారు. ఈ విషయమై ప్రస్తుత తహసీల్దార్‌ను వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా ఆలయాలు ఆస్తులను అక్రమార్కుల నుంచి విడిపించి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
అసిస్టెంట్ కమిషనర్ ఏమంటున్నారంటే..
ఈ విషయమై జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకరబాలాజీని వివరణ కోరగా ఆలయాల భూములకు సంబంధించిన రికార్డులు ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ దగ్గర ఉంటాయని వాటిని పరిశీలించి ఆలయాల భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చెబుతానన్నారు.