grabbing
-
అసత్య 'శ్వేత' పత్రం ఆధారం ఉందా బాబు
-
అధికారం ఉంది...ఆక్రమించేద్దాం
అధికార బలంతో 2.75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేసి పట్టాలు పుట్టించారు. తీరా.. ఆ భూమి పోరంబోకుగా అధికారులు నిర్ధారించినా.. మరోసారి మంత్రి అండదండలతో రూ.కోటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో స్టోన్ క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డంపెట్టుకొని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు భూ అక్రమాలకు తెర తీశారు. తాజాగా జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లులో పోరంబోకు భూములను కైవసం చేసుకునేందుకు మంత్రి అండదండలతో ఓ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 2లో దాదాపు రూ.కోటి విలువైన 2.75 ఎకరాల భూమిలో స్టోన్ క్రషర్ నెలకొల్పేందుకు అనుకూలంగా భూమిని బదలాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయనకు సన్నిహితుడైన పి.సత్యనారాయణరాజు ఈ భూమిని పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పుట్టించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నాలను గతంలో అధికారులు అడ్డుకున్నా.. మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం గమనార్హం. ఇదీ పరిస్థితి... సీతానగరం మండలం నిడగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 4/1 నుంచి 5 సబ్డివిజన్ల వరకూ 40 ఎకరాలు పైబడి రెవెన్యూ లెక్కదాఖలా ప్రభుత్వ భూమిగా (గయ్యాలు) నమోదై ఉంది. సర్వే నంబర్–1 కొండ పోరంబోకు గానూ, సర్వే నంబర్–2 సాగునీటి చెరువు, సర్వేనంబర్ 3లో 8.5 ఎకరాలు గయ్యాలు భూమి కాగా, 4, 5 సబ్‌డివిజన్ సర్వే నంబర్లలోని భూములు గయ్యాలు భూమిగానే ఎఫ్సీవో (ఫాదర్ రికార్డు), ఎండీఆర్ (మండల్ పైక్లారిటికల్ రికార్డు) రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఈ భూముల్లో సర్వే నంబర్ 4లోని సబ్ డివిజన్ చేసి 4/3, 4/2 నంబర్లలో వ్యవసాయ భూములు, ఫలసాయాన్ని ఇచ్చే తోటలు ఉన్నాయి. ఈ భూములకు పూర్వం డి– నమూనాలు చేసి కొంత మంది రైతులకు జీవనోపాధి కోసం అప్పగించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ 8 ఎకరాల భూమిని టీడీపీ నేత రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. దానిలో సర్వే నంబర్ 4/2లో ఉన్న భూమిని ఆయిల్ కన్వర్షన్ కోసం భూమి కొనుగోలుదారు బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షులు, బేబీనాయనకు సన్హితుడు అయిన పి.సత్యనారాయణ రాజు అప్పటి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన వినతిపత్రం మేరకు ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్స్ పరిశీలించగా వేరొక యజమానుల పేరుతో ఉన్నప్పటికీ సత్యనారాయణరాజు భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. భూ కన్వర్షన్ చేయడానికి ముందు భూమికి సంబంధించిన పూర్వం నుంచి ఉన్న ఎఫ్సివో, ఎండిఆర్ రికార్డులను అధికారులు పరిశీలించారు. పూర్వపరాలు తెలుసుకునేందుకు భౌతికంగా భూములను, రికార్డులను పరిశీలించారు. రికార్డు లెక్కదాఖలా గయ్యాలు భూమిగా నమోదై ఉన్నందున ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని అప్పటి తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే, నిడగల్లులో పోరంంబోకు భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమి రైతు చేతిలో ఉన్నప్పుటి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం 2.75 ఎకరాలను ఆయిల్ కన్వర్జేషన్ చేయాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. అధికారులు కాదన్నా... నిడగల్లు రెవెన్యూ పరిధిలోని భూమి రైతులచేతిలో ఉన్నా.. వేరొకవ్యక్తి కొంత భూమిని కొనుగోలుచేసి స్టోన్ క్రషర్ నెలకొల్పడానికి సర్వేనంబర్ 2లో 2.75 ఎకరాల భూమిని భూ కన్వర్షన్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దరఖాస్తును స్వీకరించిన అప్పటి తహసీల్దార్, సిబ్బంది ఎఫ్సివో, ఎండీఆర్ రికార్డులతో భూములను భౌతికంగా పరిశీ లించారు. ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించారు. జీవనోపాధికోసం పోరంబోకు భూమిపై వ్యవసాయం చేయడానికి ఇబ్బందిలేదని, రికార్డుల ప్రకారం భూ కన్వర్షన్ చేయడానికి సిఫార్స్ చేయలేమని అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అయితే, పార్వతీపురం ఆర్డీవో, సీతానగరం ప్రస్తుత తహసీల్దార్లపై మంత్రి, అతని సోదరుడి ద్వారా సిఫార్సులు చేయించుకొని భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇతర ప్రయత్నాలను చూసిన మిగత నేతలు కొందరు తాము కూడా ఇదే పందాలో వెళ్లి పోరంబోకు భూములను కైవశం చేసుకోవాలని భావిస్తున్నారు. పేదలకు ఇచ్చిన ఈ పట్టా భూములను కొనడమే నేరమైతే వాటిని వ్యాపార అవసరం కోసం తమకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం అంతకన్నా పెద్దనేరం. పాలకులకు, అధికారులకు ఇదేమంత పెద్ద నేరంగానో, తప్పుగానో కనిపించకపోవడం విశేషం. సమాచారం అందజేస్తాం.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో సత్యనారాయణరాజు గతంలో చేసిన అర్జీపై అప్పీల్ చేయడంతో పేరావైజ్డ్ రిమార్కులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం కోరింది. రికార్డులను పరిశీలించి అడిగిన సమాచారం అందజేస్తాం. – అప్పలరాజు, తహసీల్దార్, సీతానగరం -
దేవుళ్ల ‘మాన్యం’ మాయం
అది పాతబస్తీ ఫలక్‌నుమాలోని మల్లికార్జున స్వామి దేవాలయం.. ఆలయానికి నిజాం హయాంలో దాతలు భూములు విరాళంగా ఇచ్చారు.. ఆ వివరాలన్నింటినీ నాటి రికార్డుల్లో పొందుపరిచారు. ఇటీవల దేవాలయం భూమిని స్థానిక నేత ఒకరు కబ్జా చేస్తున్నట్టు దేవాదాయ శాఖకు ఫిర్యాదు అందింది.. దీంతో భూమి హద్దులు తెలుసుకునేందుకు పాత రికార్డుల కోసం వెతికితే వాటి జాడే కనిపించలేదు! నిజాం నాటి ఫైల్ మాయమైంది. విలువైన ఆలయ భూమి అన్యాక్రాంతమైంది!! సాక్షి, హైదరాబాద్ : ..ఇది ఈ ఒక్క దేవాలయం కథే కాదు.. రాజధాని నగరంలో అనేక దేవాలయాల భూముల సంగతి కూడా ఇంతే! కబ్జారాయుళ్లు ఇలా కొన్ని వేల ఎకరాల్ని చెరబట్టారు. భూముల్ని మాయం చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించటం, రికార్డులను మార్చడం కాదు.. ఏకంగా ఫైళ్లనే మాయం చేసేశారు. చట్టంలో లొసుగులు, విభాగాల మధ్య సమన్వయ లేమిని ఆసరాగా చేసుకొని కబ్జా రాబందులు రెచ్చిపోయాయి. మాన్యం భూములకే దర్జాగా శఠగోపం పెట్టారు. రాజధానిలో ఎన్ని వేల ఎకరాల భూమి ఇప్పుడు కబ్జాపాలైందో, ఇంకా ఎంత ఉందో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. లోకాయుక్తలో దాఖలైన ఓ కేసుతో ఈ వ్యవహారం డొంక కదిలింది. లోకాయుక్తా ఆదేశంతో అధికారులు రంగంలోకి దిగి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని జల్లెడపట్టి చివరకు నిజాం హయాంకు చెందిన దేవాలయ రిజిస్ట్రేషన్లకు చెందిన కొన్ని పత్రాలను మాత్రం గుర్తించారు. దాదాపు 35 వేల కాగితాలను వెతికిపట్టుకున్నారు. అవి ఉర్దూ, అరబిక్, పార్సీ లిపిలో ఉండటంతో ఆంగ్లంలోకి తర్జుమా చేయిస్తున్నారు. కొద్దిరోజులగా ఈ కసరత్తు జరుగుతోంది. కానీ వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ రాజ్యాభిలేఖన విభాగం (స్టేట్ ఆర్కివ్స్) సహకారంతో ఈ తర్జుమా వ్యవహారం జరుగుతోంది. విచిత్రమేంటంటే.. వాటిని కూడా మాయం చేసేందుకు కొందరు నేతలు తెర వెనుక యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఉదాహరణలు.. లంగర్‌హౌజ్‌లోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయానికి ఎకరాల కొద్దీ స్థలం ఉంది. కానీ వాటిల్లో ఎడాపెడా నిర్మాణాలు వెలిశాయి. ఆలయ నిర్వాహకులమంటూ కొందరు వాటిని పరాధీనం చేసేందుకు తెగబడ్డారు. నిర్వాహకుల వారసులమంటూ కొందరు అరాచకానికి తెరదీశారంటూ మరో వర్గం ఫిర్యాదులతో విషయం కోర్టుకు చేరింది. కానీ.. దేవాలయ మాన్యం వివరాలను తేల్చే రికార్డులు ఎప్పుడో మాయమయ్యాయి. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి భోలక్‌పూర్ సర్వే నంబర్–92లో 1.34 ఎకరాల భూమి ఉన్నట్టు నిజాం కాలం నాటి పత్రాలు చెబుతున్నాయి. కానీ ఆ భూమి ఎక్కడుందో, దాని హద్దులేంటో దేవాదాయశాఖకు తెలియదు. దీంతో రెవెన్యూ సాయం కోరింది. ఆ వివరాలేవీ తమ రికార్డుల్లోనే లేవని రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రికార్డులు మాయం కావడంతో భూమి ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. దిక్కుతోచని స్థితిలో దేవాదాయ శాఖ ఇప్పుడు నిర్మిస్తున్న దేవాలయాలకు మాన్యం ఉండటం లేదు. కేవలం ఆలయం మాత్రమే ఉంటోంది. కొన్నిచోట్ల రోడ్డు వైపు దుకాణాలు నిర్మించి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని దేవుడి సేవలకు వినియోగిస్తున్నారు. కానీ పూర్వకాలంలో జాగీర్దాలు, పాలకులు, సాధారణ వ్యక్తులు దేవాలయాలకు పెద్దమొత్తంలో భూముల్ని విరాళంగా ఇచ్చారు. చిన్న చిన్న ఆలయాలకు కూడా వందల ఎకరాలు భూములున్న దాఖలాలున్నాయి. రాజధాని నగరంలోనూ ఇలా భూములు ఇచ్చారు. వాటి వివరాలను నిజాం పాలకులు ప్రత్యేకంగా పొందుపరిచారు. ఏ దేవాలయానికి ఎంత భూమి ఉందో తెలియాలంటే ఈ రికార్డులే ఆధారం. కానీ అవి లేకపోవటంతో ఇప్పుడు ఆయా ఆలయాలకు ఎంత భూమి ఉందో, ఉంటే హద్దులేమిటి అన్న వివరాలు దేవాదాయశాఖ వద్ద అందుబాటులో లేవు. పాత దేవాలయాల భూములకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే అటు రెవెన్యూ రికార్డుల్లో వెతుక్కోవడం, స్టేట్ ఆర్కైవ్స్‌లో పాత రికార్డుల కోసం పరుగెత్తటం తప్ప మరో ఆధారం లేకుండా పోయింది. 20 ఏళ్ల కిందటే మాయం? 20 ఏళ్ల క్రితమే దేవాదాయ శాఖ నుంచి ‘నిజాం’ రికార్డులు మాయమైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ బడా నేత, ఓ మైనారిటీ నేత, నగరానికి చెందిన మరో నేత సహకారంతోనే ఇవి గల్లంతయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి పలుకుబడితో కొందరు నేతలు రెచ్చిపోయారని, దేవాదాయ శాఖలో పదవీ విరమణ చేసిన కొందరు అధికారులు వారికి సహకరించారని తెలుస్తోంది. 1996 ప్రాంతంలో ఓ బడా నేత నిజాం కాలం నాటి ఔకాఫ్ రిజిస్టర్లను తన కార్యాలయానికి తెప్పించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ ఫైళ్లు, ఔకాఫ్ రిజిస్టర్లు మాయమయ్యాయి. అధికారులను పావులుగా వాడుకొని.. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా 1963–67 మధ్య టౌన్ సర్వే ల్యాండ్ రికార్డు(టీఎస్ఎల్ఆర్) రూపొందించారు. అప్పటి వరకు పహాణీలే దిక్కు. అంతకుముందు ఉన్న రికార్డుల్లోని వివరాలతో టీఎస్‌ఎల్‌ఆర్‌లో పొందుపరిచారు. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది. పహాణీల్లోని వివరాలతో పొంతన లేకుండా కొన్ని ఇందులో నమోదయ్యాయి. కొన్ని వివరాలు పూర్తిగా గల్లంతయ్యాయి. దేవాలయాల భూముల వివరాలు పెద్దమొత్తంలో టీఎస్‌ఎల్‌ఆర్‌లో గల్లంతైనట్టు సమాచారం. ఇక వాటికి ఏకైక దిక్కు నిజాం రికార్డులే. ఈ విషయంపై కొందరు సీనియర్ అధికారులకు బాగా అవగాహన ఉంది. వారిని పావులుగా వాడుకుని.. రికార్డుల్లో వివరాలు గల్లంతైన తీరును ఆసరా చేసుకుని నేతలు కథ నడిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 1.34 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్న నిజాం కాలం నాటి రికార్డులు -
కబ్జా కోరల్లో..
సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీకి అక్షరాలా రూ. వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 19 బస్టాండ్లకు 54 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ. 4 వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అలాగే నిజామాబాద్ జిల్లాలో 28 బస్టాండ్లకు 83.09 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ రూ. 600 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. తమకు రవాణా సౌకర్యం కోసం ప్రజలు కొన్నిచోట్ల ఉదారంగా భూములు ఆర్టీసీకి అందివ్వగా, మరికొన్ని చోట్ల కొనుగోలు చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండలానికో బస్టాండ్ నిర్మించారు. అప్పుడు ప్రజలు బస్టాండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను సమకూర్చారు.దీంతో 1985 నుంచి 1990 మధ్య కాలంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం’ పేరుతో ప్రభుత్వం బస్టాండ్లను నిర్మించింది. అయితే ప్రజలు ఆర్టీసీకి అప్పగించిన భూములకు సంబంధించి రికార్డుల నిర్వహణలో ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా చాలా చోట్ల ఆ స్థలాలు వివాదాల్లోకి వెళ్లాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని బస్టాండ్ల స్థలాలు ఆర్వోఆర్లో రికార్డు కాలేదని తెలుస్తోంది. అడ్డగోలుగా ఆక్రమణలు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పక్కా నిర్మాణాలు చేసుకుని దర్జాగా నివాసం ఉంటున్నారు. మరికొన్ని చోట్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. కామారెడ్డి పట్టణంలో రూ. కోట్ల విలువైన డిపో స్థలంపై కొందరు కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలు చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురైంది. రూ. కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి రాజకీయ అండతో కొందరు కోర్టులను ఆశ్రయించారు. బస్టాండ్‌కు సంబంధించిన స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు. నిజామాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లో విలువైన ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థలాలకు ప్రహరీ నిర్మించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. లింగంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, జక్రాన్‌పల్లి, సదాశివనగర్, గాంధారి, పిట్లం, నవీపేట్, నందిపేట్, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీంగల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి తదితర మండల కేంద్రాల్లో ఆర్టీసీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. పట్టించుకోని అధికారులు తమ పరిధిలోని ఆర్టీసీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువైన ఆస్తులను కాపాడాలన్న కనీస ప్రయత్నమూ చేయడం లేదు. డిపో మేనేజర్లు తమ పరిధిలోని ఆర్టీసీ ఆస్తులకు రక్షకుడిగా నిలవాలి. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేస్తున్నారా, వాటిని ఎలా రక్షించుకోవాలన్న విషయాలను కార్మిక సంఘాల నేతలతో అవసరం అయితే ప్రజాప్రతినిధులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏ అధికారి కూడా స్థలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ప్రహరీలతో రక్షణ పట్టణాలు, మండల కేంద్రాల్లో ఊరి మధ్యలో ఉన్న ఆర్టీసీ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తే స్థలాలను కాపాడుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 47 చోట్ల ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. ఒక్కో చోట ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తే రూ. కోట్ల విలువైన భూములను కాపాడుకోవచ్చు. కబ్జాల చెరనుంచి ఆర్టీసీ స్థలాలను విడిపించి, వాటికి రక్షణగా గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్లకు విలువైన స్థలాలు జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో అప్పట్లో ఊళ్లకు దూరంగా బస్టాండ్లను నిర్మించారు. పట్టణాలు, గ్రామాలు విస్తరించడంతో ఇప్పుడు అన్నిచోట్ల బస్టాండ్ల చుట్టూ ఇళ్లు నిర్మితమయ్యాయి. దీంతో అక్కడ భూముల విలువ అడ్డగోలుగా పెరిగింది. కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో గజం భూమి విలువ రూ. లక్షన్నరకు పైమాటే.. నిజామాబాద్ నగరంలో గజం విలువ రూ. 2 లక్షలు పలుకుతోంది. గాంధారిలో బస్టాండ్ ప్రాంతంలో గజానికి రూ. లక్షకుపైనే.. ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర పట్టణాల్లో గజం భూమి విలువ రూ. 50 వేలపైనే పలుకుతోంది. మారుమూల మండలాల్లో సైతం గజం భూమి విలువ రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. నిజామాబాద్ జిల్లాలో... నిజామాబాద్ 10.35 ఆర్మూర్ 11.16 బోధన్ 12.12 నవీపేట 2.04 నందిపేట 7.16 కమ్మర్పల్లి 2.02 భీంగల్ 7.31 జలాపూర్ 5 డిచ్పల్లి 1.35 జాన్కంపేట 1.23 మాక్లూర్ 1.39 ఇందల్వాయి 2.03 మోర్తాడ్ 2.01 ఎడపల్లి 1.16 వర్ని 1.20 కోటగిరి 1.20 బాల్కొండ 1.07 వేల్పూర్ 1.19 సిరికొండ 1.36 ధర్పల్లి 2 రెంజల్ 1.07 జక్రాన్‌పల్లి 1.27 పడకల్లో 4 గుంటలు, రుద్రూర్లో 10 గుంటలు, పెర్కిట్‌లో 26 గుంటల భూమి ఉంది. -
చెరువులనూ చెరబట్టారు!
గిద్దలూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణలతో కుంచించుకుపోతున్నాయి. ఆక్రమణలు అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలను సైతం లెక్కచేయకుండా అక్రమార్కులు తెగబడుతున్నారు. చెరువుల విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. చెరువుల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు దిగుతున్నారంటే అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఎంతమేర ఉన్నాయో ఇట్టే తెలుస్తోంది. వర్షాల ద్వారా వచ్చే అరకొర నీరు సైతం నిలబడేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాగాణి భూమి అంటూ.. అదనపు పన్నులు వసూలు చేస్తున్న అధికారులు చెరువుల్లో ఆక్రమణలు తొలగించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు ఇలా.. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 75 మైక్రో ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటి కింద దాదాపు 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగు నీరందించేందుకు ఎలాంటి ప్రాజెక్టులు, కాలువలు లేని ప్రాంతంలో చెరువులే ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వర్షాలపై ఆధారపడి ఉన్న చెరువులకు వచ్చే నీరు నిలిచేందుకు వీల్లేకుండా ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. నీరు–చెట్టు నిధులు వృథా.. చెరువుల్లో ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వం నీరు–చెట్టు పథకం ద్వారా నిధులు కేటాయించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.3 కోట్ల నిధులు మంజూరు కాగా ఇందుకు రూ.2.50 కోట్లతో చెరువులకు పైభాగంలో ట్రెంచి ఏర్పాటు చేశారు. ట్రెంచి నిర్మాణ పనుల కోసం కొత్త, పాత టీడీపీ నాయకులు తమ వర్గానికే పనులివ్వాలంటూ పోటీ పడ్డారు. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లో జరుగుతున్న పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆపేయించారు. ఎలాగోలా పనులు చేపట్టినా ఆక్రమణలు మాత్రం ఆగలేదు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ట్రెంచి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులే ఆక్రమణలకు తెరలేపారు. మిగిలిన రైతులు సైతం చెరువులను ఇష్టారాజ్యంగా ఆక్రమించేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణదారులు చెరువులు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. వెన్నుదన్ను టీడీపీ నేతలే చెరువుల్లో జరుగుతున్న ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేయడంతో అధికారులు ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది యడవల్లి చెరువులో ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడకు వెళ్లిన అధికారులను ప్రజాప్రతినిధులే అడ్డుకున్నారు. ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడికి దిగారు. రాచర్ల మండలం యడవల్లి చెరువులో 30 ఎకరాలు, పాలకవీడులో 20 ఎకరాలు, గుడిమెట్ట చెరువులో 75 ఎకరాలు, గిద్దలూరు మండలం దేవనగరం స్వామి చెరువులో 40 ఎకరాలు, వెల్లుపల్లె వద్ద ఆరు ఎకరాల్లో ఉన్న కుంట, ముండ్లపాడు చెరువులో 20 ఎకరాలలను ఆక్రమించారు. కొమరోలు మండలం దద్దవాడ చెరువులో 15 ఎకరాలు, కొమరోలు, రాజుపాలెం చెరువులో 20 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్నారు. అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లోని పలు చెరువుల్లోనూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చెరువుల ఆక్రమణలు అడ్డుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు వ్యవహారం తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరికొకరు చెబుతున్నారు. -
కబ్జా చేసేయ్.. రూ.కోట్లు మింగేయ్!
రాయచోటి పట్టణ పరిధిలోని రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు అక్రమార్కుల పాలవుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను సైతం పెకలించి వాటినే లోతైన వాగులలో వేసి యథేచ్ఛగా సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఆక్రమించిన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. రాయచోటి/రాయచోటి టౌన్: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..ఇది పాత నానుడి. అధికారుల అండ, సహకారం లేనిదే రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణకు గురికావన్నది తాజా వాదన. ఇందుకు నిదర్శనంగా రాయచోటిలో ఆక్రమణల పాలవుతున్న భూములే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కంచాలమ్మగండి చెరువు నుంచి పంట పొలాలకు నీటిని అందించే ఎడమ కాల్వ రెండు కిలోమీటర్ల మేర కనిపించకుండా పోయింది. పెద్దపెద్ద రాతి గుట్టలను సైతం పేల్చివేస్తూ చదును చేస్తున్నా అడిగే నా«థుడు లేరు. ఇలా జరుగుతున్న ఆక్రమణలను చూస్తుంటే రెవెన్యూ అధికారులకు వాటాలు ముట్టాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. నకిలీ రికార్డుల తయారు ఆక్రమించిన భూములకు రికార్డులను కూడా ఎవ్వరికి అనుమానం రాని రీతిలో మార్చేస్తున్నారు. పక్కనే ఉన్న భూముల సర్వే నంబర్ల పేరుతో ఆక్రమించిన భూములకు రికార్డులు తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే మ్యాపులతో సహా పట్టాలను తయారు చేయించి రూ.కోట్లను దోచుకుంటున్నారు. వాగులు, వంకలు చ దును చేసి ఎకరా రూ.కోటి నుంచి రూ.4కోట్ల వరకు ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. వంకలు కనిపించకుండా పోతున్నాయ్ పట్టణం చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు రియల్ఎస్టేట్ దెబ్బకు కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం మదనపల్లె–చిత్తూరు రింగ్‌రోడ్డు నుంచి ప్రారంభమై రవ్వగుంట, ఎరుకుల కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా ఎస్టీ కాలనీ వరకు ఉన్న వాగుపై ఆక్రమణదారుల కన్నుపడింది. వాగుకు ఇరుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని సైతం చదును చేస్తూ వాగులో పెద్దపెద్ద బండరాళ్లతో నింపేస్తున్నారు. రాత్రింబవళ్లు జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో బండరాళ్లతో నింపి చదును చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు. వాగులపైనే పునాదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులను పూడ్చి వాటిపైనే పునాదులు వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తే వారికి నోటీసులు ఇచ్చాం.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్పా ఆక్రమణ దారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రవ్వలగుట్ట, ఎరుకుల కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూములలో 4వ తరగతి ఉద్యోగులకు 3 సెంట్ల వంతున ప్రభుత్వం పట్టాలను ఇచ్చింది. వాటిని సైతం ఆక్రమణదారులు వదలకుండా ఆక్రమిస్తూ వారికి తోచిన విధంగా రహదారుల యత్నానికి సిద్ధపడుతున్నారు. తప్పక చర్యలు తీసుకుంటాం: –గంగాధర్, వీఆర్వో, రాయచోటి మదనపల్లె రింగురోడ్డు నుంచి ఎరుకల కాలనీ వరకు వాగును, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చాం. పనులు చేపడుతున్న ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం: నరసింహ కుమార్, ఇన్చార్జి తహసీల్దార్(డి.టి), రాయచోటి మదనపల్లె రింగురోడ్డు సమీపంలోని 1003 సర్వే నంబరు సమీపంలోని వాగు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వస్థలాలను ఎవరు ఆక్రమించినా ఊరుకోం. సెలవుల్లో వీటి ఆక్రమణలకు పాల్పడినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వీఆర్వోలను పంపి పనులను నిలుపుదల చేయించి నోటీసులను జారీ చేస్తాం. రెండు మూడు రోజుల్లో ఆ స్థలాల్లో సర్వే చేయించి వాగులు, వంకలు యథావిధిగా ఉండేలా చూస్తాం. -
ఇదో కబ్జా కథ
ఇళ్లలో ఎవరూ లేకుంటే సహజంగా దొంగలు కన్నేస్తారు. ఇంటిలో నగదు, నగలు, వస్తువులు దోచుకెళతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ టీడీపీ నేత ఏకంగా ఇంటికే ఎసరు పెట్టాడు. ఆ ఇంటి వాళ్లు ఊళ్లోలేరని మొత్తం స్వాధీనం చేసేసుకున్నాడు. అద్దెకిచ్చేసి పెత్తనం చలాయిస్తున్నాడు. ఇంటి వ్యవహారం కోర్టులో ఉందని తెలిసినా ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు ఓ రెవెన్యూ అధికారి నానా తంటాలు పడుతున్నాడు. ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో ఇంటి కబ్జా బాగోతం ఒక్కసారి చదవండి. తెనాలి: నిరుపేద లబ్ధిదారుకు పంపిణి చేసిన స్థలాన్ని ఇంటితోసహా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నేత కబ్జా చేస్తే అధికారిక అప్పగింతకు రెవెన్యూ అధికారి ఉత్సాహ పడుతున్నారు. అన్యాక్రాంతమైన స్థలాలు అనేకం ఉండగా కేవలం ఆ ఇంటినే స్వాధీనం చేసుకునేందుకు నోటీసు జారీ చేశారు. నిబంధనలేమీ పాటించలేదు. ఆ ఇల్లు కోర్టులో ‘జప్తు’ అయినా, వేలానికి మరో పిటిషను కోర్టుకు వెళ్లినా రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకిచ్చిన స్థలమిది.. పట్టణ రవీంద్రనాథ్నగర్లో గతంలో ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలిచ్చింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. కొందరు అమ్మేసుకుని వెళ్లిపోయారు. అలాంటి స్థలాలపై ఇటీవల తనిఖీలు జరిగాయి. అన్యాక్రాంతమైనవి స్వాధీనం చేసుకోవాలనీ, ప్రస్తుతం ఎవరైతే నివసిస్తున్నారో? వారి పేరిట పట్టాలు ఇచ్చే అవకాశం ఉందనీ తనిఖీ ఉద్యోగులే లబ్ధిదారులకు చెప్పారు. రవీంద్రనాథ్నగర్లో సర్వే నంబర్.605/3బీలోని 306 ప్లాటు అన్యాక్రాంతమైందని గుర్తించారు. ప్రస్తుత ఆ ఇంటిని స్వాధీ నంలో ఉంచుకొని అనుభవిస్తున్న టీడీపీ నేత..లబ్ధిదారైన నల్లబోతుల తిరుపతమ్మ నుంచి అన్రిజిస్టరు అమ్మక ఒప్పం దం ద్వారా కొనుగోలు చేశారంటూ ఫార్మ్–2 నోటీసును జారీ చేశారు. మండల ఆర్ఐ–1ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆరుగురి చేతులు మారాక.. లబ్ధిదారు తిరుపతమ్మ నుంచి ఆ స్థలం ఆరు చేతులు మారాక అజిత్‌కుమార్ షిండే అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులను నిర్మించుకున్నాడు. ఇతనిది మహారాష్ట్ర. తెనాలిలో స్థిరపడ్డాడు. బిస్కెట్ల వ్యాపారంలో చితికిపోవటంతో స్థిరాస్తిని తాకట్టు పెట్టి హరిభాస్కర్ షిండే అనే తోటి మరాఠీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పుల భారంతో అజిత్‌కుమార్ ఊరిలో లేరు. ఇది తెలిసిన టీడీపీ మైనారిటీ నేత ఆ ఇంటిని స్వాధీనంలోకి తీసుకుని అద్దెకు ఇచ్చేశాడు. తనకు చిట్ తాలూకా బకాయి నిమిత్తం ఇల్లు వదిలేశాడని, ఇల్లు తనదేనని టీడీపీ నేత చెప్పుకుంటున్నారు. రెవెన్యూ అధికారి మంత్రాంగం మైనారిటీ నేతకు ఆ ఇంటిని అధికారికంగా కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. ఆర్ఈసీ నంబరు, తేదీ లేకుండా, రెవెన్యూ స్టాంపు లేకుండా కేవలం తన సంతకంతోనే నోటీసు ఇచ్చారు. ఇది తెలిసిన ఒకరు, పేదలకు కేటాయించిన అక్కడి ఇళ్ల స్థలాల్లో అన్యాక్రాంత వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా, రికార్డులు లభ్యంగా లేవని సమాధానమిచ్చారు. వివరాల్లేనప్పుడు ఈ ఒక్క ఇంటికే స్వాధీనం చేసుకొవాలని నోటీసు ఎందుకు ఇచ్చారనేది ప్రశ్న! ఇంటి వ్యవహారం కోర్టులో.. ఇదిలా ఉంటే, సదరు అజిత్‌కుమార్ షిండేకు అప్పు ఇచ్చిన హరిభాస్కర్ షిండేకు రావాల్సిన బాకీ పెరిగిపోయింది. తాకట్టు పెట్టిన ఇల్లేమో టీడీపీ నేత పరమైంది. దిక్కుతోచని స్థితిలో కోర్టును ఆశ్రయించారు. 2013లో గుంటూరు మూడో అదనపు సివిల్ జడ్జి కోర్టులో స్తిరాస్థి జప్తు పిటిషను వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు, గడువులోగా ‘సూట్ అమౌంట్’కు తగిన సెక్యూరిటీ చూపకపోవటంతో స్థిరాస్తి జప్తునకు ఆదేశించింది. ఈ ఆస్తిని వేలంకు తీసుకొచ్చి తనకు రావాల్సిన డబ్బు దక్కించుకునేందుకు హరిభాస్కర్ ఇటీవలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ‘నా రూటే సెపరేటు’ అన్నట్టుగా వ్యవహరించే ఆ అధికారి.. అధికార టీడీపీ నేతలకు మేలు చేసే పనిలో తప్పటడుగులు వేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇలాగే ఓ అసైన్డ్ స్థలాన్ని మరొకరికి పట్టా ఇచ్చారనే ఆరోపణతో సదరు లబ్ధిదారు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుటే ఆందోళన చేసిన వైనం పాఠకులకు తెలిసిందే. -
హాంఫట్
- కబ్జాదారుల గుప్పిట్లో వక్ఫ్ ఆస్తులు - 8,100 ఎకరాలు అన్యాక్రాంతం - విలువ రూ.500 కోట్ల పైమాటే - పాప కార్యంలో ముతవల్లులు, ముజావర్ల భాగస్వామ్యం - వక్ఫ్ బోర్డును వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువైంది. మసీదు, ఈద్గాహ్, దర్గాల నిర్వహణ, పరిరక్షణ కోసం కేటాయించిన భూములు అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాలను తమ ఆధీనంలో పెట్టుకొని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. వీటి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. అన్యాక్రాంత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఆస్తులపై వక్ఫ్‌బోర్డు పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదనుగా భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కర్నూలు (రాజ్‌విహార్) : ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యధికంగా ముస్లింలు ఉన్న జిల్లా కర్నూలు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. మసీదులు, ఈద్గాహ్, దర్గాల నిర్వహణ కోసం నాడు పెద్దలు తమ భూములు, స్థలాలను ఇచ్చారు. వాటిని ఆయా సంస్థల పేరుతో బోర్డుకు స్వాధీనం చేశారు. వాటిని బోర్డు తమ భూములుగా పేర్కొంటూ వివరాలను గెజిట్‌లో పొందుపర్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,104 సంస్థలు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయి. వీటిలో 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూములు గెజిట్‌లో నమోదయ్యాయి. మరో పది వేల ఎకరాలు నమోదు కాలేదు. గెజిట్‌లో ఉన్న 3,099.35 ఎకరాలతో పాటు గెజిట్‌లో లేని మరో ఐదు వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కోర్టులకెళ్లడంతో 639.84 ఎకరాలను బోర్డు కోల్పోయింది. అన్యాక్రాంత ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కఠిన చట్టాలున్నా.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చట్టాలున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. వక్ఫ్ యాక్ట్ 52(1) అమెండ్మెంట్ 2013 ప్రకారం ఈ ఆస్తులు కొన్న, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఇప్పటి వరకు 50లోపే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరిపైనా చార్జిషీట్ దాఖలు కాలేదు. స్థలాలు అమ్ముతున్న ముతవల్లులు, ముజావర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. మసీదులు, దర్గాల నిర్వహణ చూసే ముతవల్లులు, ముజావర్లు ఆ భూములను సాగుచేసుకుంటూ వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని (వక్ఫ్ ఫండ్) ప్రతియేటా బోర్డుకు చెల్లించాలి. అయితే.. కొందరు సొంత భూముల్లా భావించి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న భూముల నుంచి ఏటా రూ.25 లక్షలకు పైగా వక్ఫ్ఫండ్ రావాల్సి ఉండగా, రూ.12 లక్షల్లోపే వస్తున్నట్లు సమాచారం. వేధిస్తున్న సిబ్బంది కొరత వక్ఫ్‌బోర్డులో సిబ్బంది కొరత వేధిస్తోంది. రూ.వందల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములున్న ఈ జిల్లాలో కేవలం ఇద్దరితో కాలం గడుపుతున్నారు. ఇక ఇన్స్పెక్టర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో ఆస్తులపై పర్యవేక్షణ కొరవడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలన్నరకు పైగా కార్యాలయానికి దూరంగా ఉన్న అజీమ్‌తో పాటు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్న అల్తాఫ్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్రమణకు గురైన భూముల వివరాలు – కర్నూలు మండలం దిన్నేదేవరపాడు గ్రామం సర్వే నంబర్-19లో 59.59 ఎకరాల భూమి 20ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. –కర్నూలు నగర శివారులోని జొహరాపురం రోడ్డులో సర్వే నంబర్లు 142, 154, 155, 162లో పాత బస్టాండ్‌లోని బుడాన్ఖాన్ మసీదుకు చెందిన 60 ఎకరాలు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా ఓ రిటైర్డు తహశీల్దారు, లే సెక్రటరీ హస్తం ఉందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. – కర్నూలు గ్రామ సర్వే నంబర్ -62లో 5.32 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇందులో పశువుల షెడ్డు ఏర్పాటు చేశారు. – మునగాలపాడులోని సర్వే నంబరు 93, 146లో 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దీని విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. – కల్లూరు పరిధి, కలెక్టరేట్ వెనుకాల ఉన్న రాయలసీమ క్రిష్టియన్ కళాశాల వద్ద సర్వే నంబరు 922లో 7.60 ఎకరాల భూమి అక్రమార్కుల గుప్పిట్లో ఉంది. దీని విలువ రూ.8కోట్లకు పైమాటే. నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం – ఇనాయత్, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా అనుభవిస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి స్వాధీనపర్చాలి. లేనిపక్షంలో ముందుగా నోటీసులిస్తాం. స్పందించకపోతే వక్ఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం. ఇప్పటివరకు 50కి పైగా కేసులు పెట్టాం. ఈ విషయాన్ని ఆక్రమణదారులు గమనించాలి. జిల్లాలో వక్ఫ్ సంస్థలు, ఆస్తుల వివరాలు –––––––––––––––––––––– ఆస్తులు కలిగిన సంస్థలు : 741 ఆస్తులు లేని సంస్థలు : 363 వక్ఫ్‌బోర్డు పరిధిలోని మొత్తం ఆస్తులు : 22,599.89 ఎకరాలు భూ సేకరణలో ప్రభుత్వం తీసుకున్నది : 1,200.42 ఎకరాలు ఆక్రమణకు గురైన భూములు : 3,099.35 ఎకరాలు ఆక్రమణకు గురై గెజిట్‌లో లేని భూములు : 5 వేల ఎకరాలు కోర్టుల్లో బోర్డు కోల్పోయిన భూమి : 639.84 ఎకరాలు బోర్డు చర్యల్లో ఉన్న భూమి : 850.06 ఎకరాలు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నది : 79 ఎకరాలు ప్రస్తుతం ఆధీనంలో ఉన్నది : 18,660.28 ఎకరాలు -
విశాఖలో భూదందాపై 15న విచారణ
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడి - రికార్డులు లేకపోవడం వల్లే వివాదమన్న కలెక్టర్ సాక్షి, అమరావతి / విశాఖ సిటీ: విశాఖపట్నం జిల్లాలో సాగిన భూ అక్రమాలపై బహిరంగ విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. జూన్ 15వ తేదీ ఉదయం పది గంటలకు అక్కడి కలెక్టరేట్లో జరిగే విచారణలో తనతోపాటు సీనియర్ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. విశాఖ జిల్లాలో భూ రికార్డులు మార్చివేసి అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను కొట్టేశారని, 6,000 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు మాయమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో జరిగిన భూదందా అతిపెద్దదని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్ఏ) నుంచి సీనియర్ అధికారుల బృందాన్ని రికార్డుల పరిశీలనకు విశాఖకు పంపుతామని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులు వచ్చి ఫిర్యా దు చేస్తే విచారించి సమస్య పరిష్కరిస్తామన్నారు. రికార్డులు లేకపోవడం వల్లే.. కోర్టు వివాదాల్లో ఉన్న దసపల్లా హిల్స్ భూము ల పరిరక్షణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో దసపల్లా భూములపై వస్తున్న కథనాలపై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు. రాణి కమలాదేవి, ప్రభు త్వానికి మధ్య 1998 నుంచి వివాదాలు నడుస్తున్నా యని, ఇప్పటి వరకు దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వచ్చిన తీర్పులన్నీ రాణి కమలాదేవికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో 20 ఎకరాల ప్రభుత్వ భూముల్ని గుర్తించినా.. అవి ఎక్కడ ఉన్నాయో రికార్డులు లేకపోవడం ఈ వివాదానికి కారణమన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం, ఉదాసీనత ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టులో దాఖలైన పలు రిట్ పిటిషన్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. -
విశాఖ జిల్లాలో భారీ భూ కుంభకోణం
విశాఖ : విశాఖ జిల్లాలో జరిగిన భారీ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. హుద్ హుద్ తుఫాన్ జిల్లాలో చాలామంది జీవితాలను అతలాకుతలం చేస్తే.. కొందరు బడా బాబులు మాత్రం దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.20వేల కోట్ల భూ అక్రమణలకు తెరలేపారు. తుఫాన్లో రికార్డులు కొట్టుకుపోయిన భూములను గుర్తించి భూ అక్రమణలకు పాల్పడ్డారు. ఈ భూ మాఫియాలో మంత్రి, ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి తోడల్లుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయిదు వేల ఎకరాలకు పైగా ఆక్రమణ జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలోనే ఈ భూదందా జరిగింది. బడాబాబులు భూ ఆక్రమణతో వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం నామా మాత్రపు విచారణకు సిద్దమైంది. వచ్చే నెల 15న బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే బహిరంగ విచారణ చేసి టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్నారని .. ఈ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వేలకోట్లతో భూకుంభకోణం జరిగినట్లు గుర్తించామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తాహసీల్దార్లపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంబీలు (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) సైతం మాయం అయినట్లు గుర్తించారు. మరోవైపు జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని, ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. -
విశాఖ జిల్లాలో భారీ భూ కుంభకోణం
-
అమ్మదొంగా.. రింగ రింగా!
కాంట్రాక్టర్లకు ఎస్సీ సబ్-ప్లాన్ పనులు పంచేసిన టీడీపీ ముఖ్యనేత ఆనం సోదరుల ఎత్తుకు పైఎత్తు కార్పొరేషన్ మీద అదనంగా రూ.2కోట్లు భారం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక దందా, టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు తల దూర్చవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించి వారం రోజులు కూడా గడవక ముందే ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన్ పరిధిలో జరగబోయే రూ. 42కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ పనులను దగ్గరుండి రింగ్ చేశారు. నిర్ణయించిన అంచనా వ్యయం కంటే రూ.2కోట్లు రూపాయిలను అదనంగా కొల్లగొట్టడానికి రంగం సిద్దం చేశారు. టీడీపి ముఖ్య నాయకుడి నేతృత్వంలో శనివారం సాయంత్రం పనుల సెటిల్మెంట్ పూర్తిచేశారు. కార్పొరేషన్ పరిధిలోని దళితవాడల్లో అభివృద్ది పనుల కోసం ఈ ఏడాది మార్చిలో రూ.42కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో 8 ప్యాకేజిల కింద పనులు చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే టీడీపీ ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల పనుల పంపకంలో అభిప్రాయం కుదరలేదు. దీంతో ఆరు నెలల పాటు ఈ పనుల ప్రక్రియ అటకెక్కింది. అభివృద్ది పనుల విషయంలో అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలను నిరసిస్తూ ఎస్సీ సబ్-ప్లాన్లకు వెంటనే టెండర్లు పిలవాలని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు ఇటీవల కార్పొరేషన్‌ను ముట్టడించారు. దీంతో 8 ప్యాకేజీలకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్లు ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఆనం సోదరులు అనూహ్యంగా రంగంలోకి దూకారు. నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకునేందుకు తమ మద్దతుదారు కాంట్రాక్టర్లను రంగంలోకి దింపి ఎస్సీ సబ్-ప్లాన్ పనులను చేజిక్కించుకునే ఎత్తుగడ వేశారు. పనుల కోసం పోటీ పడుతున్న కాంట్రాక్టర్లతో నేరుగా చర్చలు జరిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిలు టెండర్ల చివరి తేదీని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగింపజేశారు. సమయం తీసుకుని కాంట్రాక్టులందరిని సమావేశ పరిచి తాము చెప్పిన వారికే పనులు దక్కేలా చేసే వ్యూహం రచించారు. ఈ రకంగా ఆనం సోదరులను దెబ్బకు దెబ్బ తీసే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు శనివారం సాయంత్రం కాంట్రాక్టర్లను సమావేశ పరిచారు. టీడీపీ సిటీ నియోజకవర్గ ముఖ్యనేత కుటుంబ సభ్యుడికి 3 ప్యాకేజీలు, మిగిలిన పనులను తమ మద్దతుదారులకు పంచేసేలా సెటిల్మెంట్ చేశారు. ఎవరికైతే పనులు అప్పగించారో వారు 4.5 శాతం నుంచి 4.9 శాతం వరకు అధిక మొత్తంలో టెండర్లు దాఖలు చేసేలా తీర్మానించారు. వీరికి డమ్మీగా టెండరు షెడ్యూలు దాఖలు చేసే మరో వ్యక్తి 5శాతం కంటే ఎక్కువతో కోట్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ పనుల పందేరంతో కార్పొరేషన్ మీద అదనంగా రూ.2కోట్లు రూపాయిల భారం పడబోతోంది. సోమవారం సాయంత్రానికి ఈ టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది. -
పండుగ చేసుకున్నారు
రొట్టెల పండుగలో లక్షలాది రూపాయల దోపిడీ మేయర్ వర్గానికి చెందిన వ్యక్తులకే కాంట్రాక్ట్ పనులు అధికార పార్టీ నేతలు, అధికారులకు పర్సంటేజీలు నెల్లూరు సిటీ: పవిత్రమైన రొట్టెల పండుగను అధికార పార్టీ నేతలు, అధికారులు ఆదాయవనరుగా చేసుకున్నారు. ప్రతి పనిలో పర్సంటేజీలను గుంచి నిధులను యథేచ్ఛగా దోచేశారు.ఽ కాంట్రాక్టర్లు సైతం తమ చేతివాటం ప్రదర్శించి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా మేయర్ వర్గానికి చెందిన ఓ నేత కనుసన్నల్లో జరిగిందని కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. రూ.1.20 కోట్లు నెల్లూరు నగరంలోని బారాషహీద్‌దర్గా ఆవరణలో ఐదు రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగకు నగర పాలక సంస్ధ రూ.1.20కోట్లు ఖర్చు పెట్టింది. పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సరఫరా, కాంట్రాక్ట్ పద్ధతిన పారిశుద్ధ్య కార్మికుల నియామకం, స్టేజీలు, షామియానాలు, కార్పొరేషన్ సమాచార కేంద్రం తదితరాలకు వీటిని ఖర్చు చేశారు. కాంట్రాక్టర్లతో అధికార పార్టీ, అధికారులు కుమ్మక్కు రొట్టెల పండుగ జరిగే ఐదు రోజులూ బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చెత్తాచెదారాలు తొలగించడం, మరుగుదొడ్లు శుభ్రపరచడం వంటి వాటి కోసం 970 మంది పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం రూ.16లక్షలకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరుడు సొంతం చేసుకున్నారు. 970 మంది పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ కార్మికుల సంఖ్యను ఎక్కువగా చూపి కార్పొరేషన్ నిధులు దోచుకున్నారని విమర్శలున్నాయి. ఇదే క్రమంలో కొందరు కార్మికులకు 100 నుంచి 150 రూపాయలు ఇచ్చి తూతూ మంత్రంగా పనులు చేపట్టారు. ఇదే క్రమంలో సున్నం, బ్లీచింగ్, ఏప్రాన్స్ కొనుగోలులో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి సరఫరాలో ట్యాంకర్లను ఎక్కువగా సరఫరా చేసినట్లు లెక్కలు సృష్టించారు. ఇలా అవకాశమున్న ప్రతి చోటా రొట్టెల పండుగలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అయితే అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వడంతో వారు మిన్నకుండిపోయినట్లు సమాచారం. -
నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ
-
ఈపూరులో రూ.30 కోట్ల భూమి కబ్జా
నెల్లూరు(బృందావనం): ముత్తుకూరు మండటం ఈపూరులో రూ.30 కోట్లు విలువ చేసే, ప్రజలకు చెందాల్సిన ప్రైవేటు భూమిని టీడీపీ ప్రజాప్రతినిధులు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం భూసమస్యల కన్సల్టెంట్, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్.టిప్పు సాహెబ్, మాజీ సర్పంచ్ ఉడతా వెంకటకృష్ణయ్య, బట్టేపాటి గోపాల్, పసుపులేటి వెంకటసుబ్బయ్య, వేల్పుల ధనుంజయ, టేకుమళ్ల ఉమాశ్యాంప్రసాద్ తదితరులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ సర్వే నంబర్ 603లోని 31.25 ఎకరాల ప్రైవేట్ పట్టాభూమి 40 మంది పేరిట జాయింట్ పట్టాగా ఉందన్నారు. అధికారపార్టీ చెందిన నాయకుల ప్రలోభాలకు లోబడి అధికారులు ఆ 31.25 ఎకరాలను సంపన్నులైన 17 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందచేశారన్నారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని కోరారు. -
దేవుడి భూముల్ని వదలా..
♦ ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటున్న వైనం ♦ టీడీపీ నాయకుల చేతుల్లో ఆలయ మాన్యాలు ♦ రూ.9కోట్ల విలువచేసే భూములు హాంపట్ ♦ దేవాలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు కరువు గుడిలో వెలిగే దీపం.. సకల పాపాలను హరించి జీవితంలో అఖండ వెలుగు ప్రసరింపజేస్తుందని, మోగే గంట అందరిలో చైతన్యం కల్గిస్తుందని పెద్దల నమ్మకం. అయితే కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో ఆ రెండింటికి ఎసరుపెడుతున్నారు. దేవుడి ఆస్తులనే కైంకర్యం చేస్తున్నారు. ఫలితంగా ఎంతో ఘనచరిత్ర కలిగిన పురాతన ఆలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు భక్తులే దిక్కవుతున్నారు. కలసపాడు: మండలంలో ఆలయాల మాన్యాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. మాన్యాలను కాపు కాయాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులే కలిసి కాజేస్తున్నారు. దీంతో ఆలయాల్లో నిత్యపూజలు, నైవేద్యాలు, ఉత్సవాలకు దిక్కులేకుండా పోయింది. 13 పంచాయతీల్లో దేవుళ్లకు చెందిన 99.6 ఎకరాల భూములు అధికశాతం అధికారపక్షం నేతలే కైంకర్యం చేశారు. ఆలయాల అర్చకులకు కేటాయించిన భూములు కూడా వారిని భయపెట్టి ఆక్రమించేస్తున్నారు. ఈ భూముల విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా. ఆలయాల భూముల్లో అధిక శాతం(28 ఎకరాలు)శంకవరంలోని శ్రీభవానీశంకరునికి, ఆంజనేయస్వామికి చెందినవి కావడం విశేషం. కలసపాడు శ్రీఉమామహేశ్వరునికి సర్వే నంబర్ 287లో 5.08 ఎకరాల ఉండేది. అందులో 3.31 సెంట్ల విస్తీర్ణం 2008లో తెలుగుగంగ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంది. నష్టపరిహారం కింద రూ.2.40 లక్షలు మంజూరు చేశారు. పరిహారం మాత్రం ఎవరికి చేరిందో అంతుచిక్కడం లేదు. కలసపాడులో శ్రీలక్షీచెన్నకేశవస్వామికి సర్వేనంబరు 205 లో 0.85 సెంట్లు, పుష్పగిరి చెన్నకేశవస్వామికి సర్వేనంబర్ 368లో 0.37 సెంట్లు, 423లో 0.96 సెంట్లు, పుష్పగిరి శ్రీ చంద్రమౌళిశ్వరునికి 1.02 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూములు దేవాలయాల ఆధీనంలో లేవు. మామిళ్లపల్లె పరిధిలో శ్రీ తిరుమలకొండ స్వామికి సర్వేనంబర్ 155లో 4.43 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 2 ఎకరాల భూమి మామిళ్లపల్లెకి చెందిన ఓ పెద్దమనిషి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి అమ్మి రిజిష్టర్ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అంతా ఆక్రమించేశారు పెండ్లిమర్రి గ్రామంలోని శ్రీ అంజనేయస్వామికి సర్వే నంబ ర్ 2లో 3.83 ఎకరాలు ఈశ్వరాలయానికి సర్వేనంబర్ 9లో ఉన్న 4.83ఎకరాల భూమిని మాయం చేశారు. గంగాయిపల్లెలో 18 వ సర్వే నంబర్లో 5.24 ఎకరాలు, 43లో 8.17 ఎకరాల భూమి టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. సిద్దమూర్తిపల్లెలో శ్రీపుష్పగిరి చంద్రమౌళీశ్వరస్వామికి సర్వేనంబర్140 లో0.86 సెంట్లు, 23లో 2.14 ఎకరాలు ఆక్రమణకు గురైంది. చెన్నుపల్లె అంకాలమ్మకు 173లో 1.63 ఎకరాలు, రాజుపాలెం అహోబిళంస్వామికి 279/ఎ/బి/12లో 1.96 సెంట్లు,465లో1.08 సెంట్లు ఆక్రమణకు గురైంది. దిగువపల్లె, ఎగువతంబళ్లపల్లెల్లో శ్రీగోవిందస్వామికి సర్వేనంబర్ 28లో 2.13 ఎకరాలు,72లో 3.30 ఎకరాల భూమి ఉంది. అ దీ ఆక్రమణకు గురైంది. కొండపేట శ్రీ చెన్నకేశవస్వామి, కొండసింగరయ్యస్వామి, ఈశ్వరునికి సర్వేనంబర్ 64లో 0.49సెంట్లు, 206లో 3.02 ఎకరాలు అయ్యవారిపల్లెలో శ్రీవెర్రికొండయ్యస్వామికి సర్వే నంబర్17లో 4.73 ఎకరాల భూమి ఉండగా దానిని కూడా కొందరు తమ్ముళ్లు ఆక్రమించేశారు. శంకరుని మాన్యాలు మాయం లక్షల విలువ చేసే శంకవరం గ్రామానికి చెందిన శ్రీభవానీ శంకరుని భూములు టీడీపీ నాయకుల చేతుల్లో చేరిపోయాయి. సర్వేనంబర్ 1751లో 3.55 ఎకరాలు, 1,494లో 1.15 ఎకరాలు, 253లో 0.64 ఎకరాలు, 1,661లో 0.97 ఎక రాలు, 2003లో 0.43 సెంట్లు, మొత్తం 11.92 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన శ్రీఅంజనేయస్వామికి సర్వేనంబర్ 456లో 7.79ఎకరాలు, 351లో 0.87 ఎకరాలు, 252లో 0.59 ఎకరాలు, 988లో 3.59 ఎకరాలు, 1232లో 0.65 సెంట్లు, 1474లో 0.66 సెంట్లు,1777లో 2.08 ఎకరాలు, 279లో 0.73 సెంట్లు, మొత్తం 16.96 ఎకరాల భూమి గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు ఆక్రమించేశారు. అంకాలమ్మ, నెల్లూరమ్మకు సర్వేనంబర్ 1,121లో 1.61ఎకరాలు, 2,228లో 1.83 ఎకరాలు, శ్రీ తిరుమలనాథ ఆలయానికి చెందిన 28సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. శంకవరం శివాలయానికి సర్వేనంబర్ 1925 లో 4.21ఎకరాల భూమి లింగారెడ్డిపల్లె గ్రామంలో ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ పొలాన్ని ఆక్రమించుకుని ఏకంగా ఇళ్ల నిర్మాణమే చేపట్టారు. రికార్డులనే మాయం చేశారు మండలంలో పుష్పగిరి చెన్నకేశవస్వామి, ముక్తేశ్వరస్వామి, శ్రీతిరుమలకొండస్వామి ఆలయాలకు చెందిన భూముల రికార్డులనే మాయం చేశారు. తిరుమలకొండస్వామి, పుష్పగిరి చంద్రమౌళీశ్వరస్వామి, భైరవస్వామి, తిరుమలనాథస్వామి, గోవిందస్వామి, వెర్రికొండయ్య స్వాములకు దాతలు ఇచ్చిన 15 ఎకరాల భూములను ఆక్రమించేశారు. ఈ విషయమై ప్రస్తుత తహసీల్దార్‌ను వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా ఆలయాలు ఆస్తులను అక్రమార్కుల నుంచి విడిపించి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఏమంటున్నారంటే.. ఈ విషయమై జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకరబాలాజీని వివరణ కోరగా ఆలయాల భూములకు సంబంధించిన రికార్డులు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉంటాయని వాటిని పరిశీలించి ఆలయాల భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చెబుతానన్నారు. -
దర్జాగా కబ్జా
♦ కార్పొరేషన్లో రూ.15 కోట్ల విలువైన స్థలం కబ్జాకు రంగం సిద్ధం ♦ అన్న క్యాంటీన్ పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమైన టీడీపీ నేత ♦ స్థలం అప్పగింతకు సిద్ధమైన నగరపాలక సంస్థ అధికారులు ♦ అధికార పార్టీ నేతలకే భవనం కూల్చివేత కాంట్రాక్టు ♦ కూల్చివేత పనుల్లోనూ నిబంధనలకు పాతర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలున్నా... ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి పేదలను రోడ్డుకీడ్చి మరీ నాడు నగర పాలక సంస్థ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నేడు మాత్రం కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి, స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ సమీపంలో రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కొట్టేసేందుకు స్థానిక టీడీపీ ముఖ్యనేత ఒత్తిడి తేగా ఆ స్థలం అప్పగింతకు మున్సిపల్ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు బండ్లమిట్ట ప్రాంతంలో ఇటీవల వందలాది పేదల ఇళ్లు కూల్చివేసి ఆ స్థలంతో పాటు ఊరచెరువును అధికార పార్టీ నేతలకు ఆదాయవనరుగా మార్చేందుకు సిద్ధమైన ఒంగోలు మున్సిపల్ అధికారులు తాజాగా నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే కార్పొరేషన్ స్థలాన్ని అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేశారు. 100 గదులకు పైగా ఉన్న ఈ స్థలాన్ని కొట్టేసేందుకు పచ్చ నేత మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాజు తలుచుకుంటే కొదువేముందన్న సామెతగా మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లు విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేశారు. ఆ కాంట్రాక్టును సైతం అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలోని శిథిలాలను సైతం కార్పొరేషన్ అధికారులే తొలగించి స్థలాన్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం కావడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పార్టీ నేత అధికారులకు సైతం ముడుపులు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అన్న క్యాంటీన్ పేరుతో ఈ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు అధికార పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగడం గమనార్హం. తన ముగ్గురు అనుచరులను ముందు పెట్టి ముఖ్యనేత కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు నేతల మధ్య పోటీ.. ఆ స్థలంపై అధికార పార్టీల్లోనే పోటీ నెలకొంది. నగరానికి చెందిన ముగ్గురు స్థలం నాకంటే నాకంటూ ముఖ్యనేతపై ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. ముగ్గురు ముఖ్యనేత సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఒకరు మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తి, మరొకరు నగర శాసనసభ్యుడికి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. పైకి అన్న క్యాంటీన్ అని చెబుతున్నా... స్థలాన్ని అప్పనంగా కొట్టేసి కాంప్లెక్స్‌ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య పోటీ నేపథ్యంలో తానే ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు పాతర.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సాక్షాత్తు మున్సిపల్ అధికారులే సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన భవనాన్ని కూలగొట్టే సమయంలోనే భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఏం చేయాలన్న దానికి అధికారులు ఒక నిర్ణయానికి రావాలి. దీనిపై ప్రతిపాదనలు పంపాలి. కాంప్లెక్స్ నిర్మించదలచుకుంటే దానికి సంబంధించిన డిజైన్లు రూపొందించాలి. నిధులు మంజూరు ఉత్తర్వులు తీసుకోవాలి. ఒక వేళ భవనాన్ని కూల్చాలన్నా అందుకు అనుమతులు తీసుకోవాలి. కానీ అద్దంకి బస్టాండ్‌లోని మున్సిపాలిటీ భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు ఈ నిబంధనలేమి పాటించలేదు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పెద్ద జేసీబీ, ఇటాచీ లాంటి మిషన్లు తెచ్చి పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు అద్దంకి బస్టాండ్‌లోని భవనం కూల్చివేత పనులను మాత్రం పచ్చ నేతకు అప్పగించడం గమనార్హం. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు చేతులు మారినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ స్థలాన్ని సైతం సదరు నేతకే అప్పగించేందుకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాన్ని అన్న క్యాంటీన్‌కు అధికార పార్టీ నేతలు కావాలని కోరిన మాట నిజమేనని మున్సిపల్ కమిషనర్ ‘సాక్షి’తో చెప్పారు. తొలుత క్యాంటీన్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో పై నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా... అలాంటివేమి అమలు చేసిన దాఖలాల్లేవు. మొత్తంగా స్థలాన్ని అప్పగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
దేవుడి భూములకే దిక్కులేదు
♦ కబ్జా కోరల్లో ఆలయ భూములు ♦ వేలాది ఎకరాలు అన్యాక్రాంతం ♦ ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్న వైనం ♦ స్వాధీనానికి చర్యలు చేపట్టని దేవాదాయశాఖ అధికారులు ♦ అమలుకు నోచుకోని మంత్రి ఆదేశాలు ♦ ఆన్లైన్లో కనిపించని భూముల వివరాలు కనిగిరి: జిల్లాలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యూరుు. పైసా కౌలు చెల్లించకుండా ఆక్రమణదారులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయూల విలువైన భూములను కొందరు దర్జాగా ప్లాట్లు వేసి విక్రరుుంచుకుంటున్నా అడిగే నాధుడే లేరు. కబ్జాకు గురైన మాన్యం భూములను స్వాధీనం చే సుకుని, వేలం ద్వారా కౌలుకిచ్చి ఆదాయం పెంచాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. భూముల వివరాలు ఆన్లైన్ చేయూలన్న అమాత్యుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారు. వందల ఎకరాల భూములు రికార్డుల్లో తప్ప ఎక్కడున్నాయో తెలియడం లేదు. గుర్తించినవి వందల ఎకరాలే.. జిల్లాలో 1651 దేవాలయాలుండగా, వాటి పరిధిలో 32,755 ఎకరాలు భూములున్నాయి. మీ ఇంటికి-మీ భూమి గ్రామసభల్లో రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు రెండు వేల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు. వాటిలో కనిగిరి నియోజకవర్గంలో వందెకరాలు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో మరో 3,500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలో 15 ఆలయాలకు సుమారు మూడు వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల్లోని సుమారు 700 ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నాయి. ఆన్లైన్లో వెలుగు చూడనవి ఎన్నో.. భూముల వివరాలన్నీ ఆన్లైన్ చేయూలన్న దేవాదాయశాఖ మంత్రి ఆదే శాలు అమలుకు నోచుకోలేదు. అన్యాక్రాంత భూములు ఆన్లైన్లో కన్పించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఆక్రమణదారులు, అధికారుల లాలూచిలతో చాలా వరకు భూములు రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. కబ్జా చేసి.. ప్లాట్లుగా మార్చి.. పామూరులో వేణుగోపాలస్వామి, శ్రీవల్లి భుజంగేశ్వరస్వామి ఆలయ భూములు సుమారు 35 ఎకరాల వరకు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. సీఎస్‌పురంలోని తిరుమలనాధుని ఆలయ భూములు 100 ఎకరాలు కబ్జాకు గురికాగా, కనిగిరిలోని శంఖవరం. పీసీపల్లిలోని శివాలయ, భద్రాచలం రామాలయ భూములు ఆక్రమణలో ఉన్నాయి. జిల్లాలోని మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి, రాచర్ల ఉమామహేశ్వర, పొన్నలూరు దుర్గ మల్లేశ్వర, కందుకూరు జనార్దన, గిద్దలూరు ఆంజనేయస్వామి దేవస్థానాల భూములు కూడా కొంత అక్రమణలో ఉన్నట్లు సమాచారం. మార్తాండుని భూములు హాంఫట్.. కనిగిరిలోని విజయమార్తాండేశ్వర స్వామి భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కోట్ల విలువ చేసే ఆస్తులన్నా.. సరైన ఆదరణ లేదు. నెల్లూరు, జలదంకి, కావలి, ఉదయగిరి, అల్లూరు, సోమేశ్వరం ప్రాంతాల్లో వీటి భూములున్నాయి. విచిత్రమేమంటే వీటికి సంబంధించిన సుమారు 100 ఎకరాల భూములు ఎక్కడున్నాయో.. అధికారులకే తెలియదు. కనిగిరి మండలంలో అయ్యన్నపాలెంలో సర్వే నం: 8, 9, 10, 15, 20, 23, 28 లలోని సుమారు 100 ఎకరాలు మాన్యం భూమి రికార్డుల్లో కన్పించడం లేదు. నెల్లూరు జిల్లా జలదంకి లో సుమారు 100 ఎకరాలు భూమిని దర్జాగా అక్రమార్కులు సాగు చేసుకుంటున్నారు. చాకిరాల శివాలయానికి చెందిన167 ఎరకాలు భూమి చాకిరాల, తుమ్మగుంట, హజీస్‌పురం, పద్మాపురం గ్రామాల్లో ఉంది. ఏళ్ల కాలం నుంచి కొంత భూమి కౌలు చెల్లించకుండా అక్రమ సాగుచేస్తున్నారు. ఇదంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండా జరుగుతుందనుకుంటే పొరబాటే. -
దర్జాగా కబ్జా!
♦ ‘నారాయణ’ భూములపై వాలిన గద్దలు ♦ భూ బకాసురుల ఇష్టారాజ్యం కార్మికుల నోట్లో మట్టి ♦ డీఆర్వో కస్టోడియన్‌గా ఉన్నా.. ఫలితం శూన్యం ♦ కోర్టు తీర్పు బేఖాతర్ అక్రమార్కులకు అధికారుల అండ రామచంద్రాపురం: దొంగలు దొంగలు కలిసి దర్జాగా కార్మికుల రెక్కల కష్టం దోచుకుంటున్నారు. డీఆర్వో కస్టోడియన్‌గా ఉన్న నారాయణరావు భూములు అధికారికంగానే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కనీసం కేసులు తేలే వరకు కూడా బాధిత కార్మికుల భూములను రక్షించలేకపోతున్నారు. పటాన్చెరు ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుపై నారాయణరావు 36 ఏళ్ల కింద ప్లాట్లు చేసి అమ్ముకున్న భూములు వివాదాల్లో ఉండగా పట్టా భూములకు ఇప్పుడు వారసులు పుట్టుకొచ్చారు. ఒకవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే సిన్హా అధ్యక్షతన ఈ భూములపై సమగ్ర విచారణ జరుగుతుండగానే.. మరోవైపు అక్రమార్కులు తహసీల్దారు కార్యాలయంలో మాయచేసి పట్టాలు సృష్టించి, పంచాయతీ అధికారుల అండదండలతో ఏకంగా భూ కబ్జాకే సిద్ధమయ్యారు. సొసైటీ పేరుతో మోసం.. సిద్దిపేటకు చెందిన నారాయణరావు 1980లో పటాన్చెరు ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని స్థాపించారు. పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ, పట్టా భూముల్లో వెంచర్లు చేసి సంఘం సభ్యులకు విక్రయించారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులను రూ. 105 సభ్యత్వ రుసుం వసూలు చేసి సభ్యులుగా చేర్చుకున్నారు. 1980-87 మధ్య ఏడేళ్ల పాటు 382 ఎకరాల ప్రభుత్వ భూమి, 100 ఎకరాల పట్టా భూమిలో వెంచర్లు చేశారు. 150 నుంచి 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి సభ్యులకు విక్రయించారు. 5 వేల మందికి పైగానే సొసైటీలో సభ్యులు ఉన్నట్లు జిల్లా సహకార సంఘం నివేదికలను బట్టి తెలుస్తోంది. ఒక్కో ప్లాటుకు అప్పట్లో రూ.3,000 నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేశారు. పటాన్చెరు మండలం అమీన్‌పుర్, రామచంద్రాపురం మండలం కొల్లూరు, తెల్లాపూర్, జిన్నారం మండలం బొల్లారంలో సర్వే నంబర్ 323/14, 232/19లో 157.08 ఎకరాలు, 324/1 సర్వే నంబర్ కింద 12.14, 325/1లో 18.34 ఎకరాలు,326/1 లో 20.30 ఎకరాలు, 328 సర్వే నంబర్ నుంచి 340 వరకు 173 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించగా సర్వే నంబర్ 216, 215 కొల్లూరు భూములను నారాయణరావు కొనుగోలు చేసి వెంచర్ చేశారు. ప్రస్తుతం ఈ భూములకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కస్టోడియన్‌గా ఉన్నారు. ఏం చేశాడంటే.... సొసైటీ కోసం ముందు కొంత పట్టా భూమిని కొని దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములనూ కలుపుకున్నారు. పేద రైతుల కోసం అసైన్డ్ చేసిన భూములను తన ఖాతాలోనే వేసుకున్నారు. అప్పట్లో ఇక్కడ పని చేసిన రెవెన్యూ యంత్రాంగం సహకరించడంతో నారాయణరావు అడ్డూ అదుపు లేకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించారు. ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురికి చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఈలెక్కన ప్లాట్లు కొన్న వాళ్లు 10వేల మందికి పైగా ఉన్నారు. 1997లో నారాయణరావు రిజిస్ట్రేషన్ శాఖలోని లొసుగుల ఆధారంగా ఏవో కారణాలు చూపిస్తూ దాదాపు 4000 పైగా సంఘం సభ్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు అందుకున్న కార్మికులు ఆందోళనకు లోనై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (సీపీఐ) అసెంబ్లీలో లేవనెత్తారు. అప్పటి ప్రభుత్వం ఈ సొసైటీ వ్యవహారాలపై అప్పటి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవిని అధ్యక్షతన హౌస్ కమిటీ వేసింది. సొసైటీ అక్రమాలను దాదాపు మూడేళ్ల పాటు అధ్యయనం చేసింది. నారాయణరావు ప్రభుత్వ భూములను కబ్జాపెట్టి ప్లాట్లుగా చేసి విక్రయించారని కమిటీ నిర్ధారించింది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కమిటీ.. ప్రభుత్వానికి నివేదించింది. హైకోర్టు ఏం చెప్పిందంటే.. ప్లాట్లు తీసుకున్న సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. 2006లో వేర్వేరుగా రిట్ పిటీషన్ వేశారు. 8 ఏళ్ల పాటు సమగ్ర పరిశీలన చేసిన కోర్టు హౌస్ కమిటీ సిఫారసునే సమర్థిస్తూ 2014 ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని, పట్టా భూముల్లో చేసిన ప్లాట్లను సంఘం సభ్యులకు అప్పగించాలని ఆ తీర్పులో పేర్కొన్నది. భూములపై వాలిన గద్దలు ఈ భూములు ఇప్పటికే ‘గద్దల’ కనుసన్నల్లోకి వెళ్లిపోయాయి. అర్థ, అంగబలం ఉన్న వాళ్లు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకొని చుట్టూ ఫెన్షింగ్ చేసుకొని సెక్యురిటీ గార్డుల పేరుతో రౌడీమూకలను కాపలాపెట్టారు. మరి కొందరు తమ ఆధీనంలో ఉన్న పట్టా భూమిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆయా పట్టాభూముల్లో పట్టాలున్న సొసైటీ సభ్యుల నుంచి గజానికి రూ 500 నుంచి రూ1000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకుంటున్నారు. దీనిపై డీఆర్వో వివరణ కోసం ఆయన కార్యాలయం ఎదుట దాదాపు 30 నిమిషాల పాటు వేచి ఉన్నా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఖాళీ ఉంటే..కబ్జానే..!
► పాస్‌బుక్‌లున్నా మారుతున్న పేర్లు ► వేములవాడలో ‘రియల్’ కబ్జాలు ► అంతా అధికారుల కనుసన్నల్లోనే..! వేములవాడ రూరల్ : మీ స్థలాలు మీ పేరుమీదనే ఉన్నాయనే నమ్మకంతో ఆ స్థలాలను చూడకుండా కొన్నిరోజులపాటు నిశ్చింతంగా ఉంటే మీకు తెలియకుండానే అవి ఇతరుల పేర్ల మీదకు మారిపోతాయి. మీ కాగితాలు ఇంట్లో ఉన్నా... బ్యాంకుల్లో కుదబెట్టినా.. ఆ స్థలం మాత్రం ఇతరుల పేరుమీదకు మారుతూనే ఉంటా యి. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో వరుసగా జరగడంతో భూయజమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకున్న పాపానలేరు. ఇదీ రాజన్న క్షేత్ర పరిధిలో జరిగే రియల్ కృత్యాలు. వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేసిన భూయజమానులు వారి స్థలాలు ఇతరుల పేరుమీదుగా మారడంతో లబోదిబోమంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో వేములవాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులు తమ స్థలాలు తమ పేరుమీదనే ఉండి ఆ పాస్‌బుక్కులు బ్యాంక్‌లో ఉన్నప్పటికీ తమకు తెలియకుండా ఇతరులు కాజేశారంటూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వేములవాడ పట్టణంలోని జగిత్యాలకు వెళ్లే బస్టాప్ వద్ద ఒక ముస్లిం కుటుంబం కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆ స్థలాన్ని ఒక రియల్టర్ కొనుగోలు చేసి అందులో పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సదరు బాధితులు వెళ్లి నిలదీయగా తాను కొనుగోలు చేశానని కాగితాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డా డు. ఈ విషయంపై బాధితులు రెవెన్యూ అధికారి కార్యాలయూనికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. మండలంలోని తిప్పాపురం గ్రామంలో ఉన్న ఒక స్థలాన్ని కొందరు నాయకుల అండతో అధికారుల ప్రోద్బలంతో కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన సంఘటనలూ ఉన్నాయి. దీంతోపాటు ఒక ఆశ్రమ స్థలాన్ని ఇటీవల కొందరు నాయకులు కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ మండలం దినదినాభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంపై కొంతమంది రియల్ కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోవడంతో స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. కబ్జాదారులకు అధికారుల అండ..? వేములవాడ మండలంలో భూకబ్జాదారులకు కొంతమంది ప్రభుత్వ అధికారుల అండతోనే వారి ఆగడాలకు అంతులేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న భూముల వివరాలను భూకబ్జాదారులకు సమాచారం అందిస్తున్న కొంతమంది అధికారులు ముందస్తుగానే ముడుపుల వ్యవహారం మాట్లాడుకుని వారికి పూర్తిగా సహకరిస్తున్నార ని తెలిసింది. కొన్నేళ్లుగా ఎలాంటి కబ్జాలు లేని ఈ మం డలంలో ఈ మధ్యకాలంలో నెలకోటి కబ్జాల పర్వం వెలుగులోకి వస్తోంది. స్థలాలను పోగొట్టుకున్న బాధితులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నా వారు స్పం దించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇలాంటి వాటిపై పూర్తిగా విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
బరితెగింపు ఆపై బెదిరింపు
♦ స్టీల్‌ప్లాంట్ భూమిపై పెద్దల కన్ను ♦ రూ.70 కోట్ల భూమి కబ్జాకు పన్నాగం ♦ ఓ ఎమ్మెల్యే సన్నిహితుల భూబాగోతం ♦ తప్పుడు పత్రాలతో హడావుడి.. వెంటనే పునాది పనులు ♦ అడ్డుకున్న ప్లాంట్ అధికారులతో వాగ్వాదం ♦ ఎమ్మెల్యే పేరుతో ఫోనులో హెచ్చరికలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆ భూమిలో ఓ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు శనివారం నిర్మాణ పనులు చేపట్టారు.. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు గానీ.. ఆ తర్వాత జరిగిన తతంగం వింటే.. ఇదెక్కడి విడ్డూరం.. మరీ ఇంత బరితెగింపా.. అని విస్మయం చెందకమానరు!.. అసలు విషయమేంటంటే.. ఆ భూమి స్టీల్‌ప్లాంట్‌కు చెందినది. తప్పుడు పత్రాలతో దాన్ని ఖాతాలో జమ చేసేసుకోవాలన్న యావతో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ అధికారులుకొద్దిసేపటికే అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలు చూపి దబాయించారు.. వాగ్వాదానికి దిగారు.. చివరికి తమ బాస్ పీఏ చేత ఫోను కూడా చేయించారు..అయినా ప్లాంట్ అధికారులు లొంగకపోవడంతో ప్రస్తుతానికి వారి కబ్జాకాండకు బ్రేక్ పడింది. ఇంతకీ తెర వెనుక ఉన్న ఆ బాస్ ఎవరంటారా?..ప్రజాప్రతినిధి అయిన ఓ ఎమ్మెల్యే!! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో విచ్చలవీడి భూకబ్జాల దందాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. తన తోటివారు చాలామంది కబ్జాలు చేసేస్తుంటే నేనెందుకు మడికట్టుకు కూర్చోవాలని అనుకున్నారో.. ఏమో.. రంగంలోకి దిగారా. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న రీతిలో ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూములపై కన్నేశారు. ఎమ్మెల్యే అండతో ఆయన సన్నిహితులు స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సుమారు ఏడు ఎకరాల భూమిలో పాగా వేసేందుకు తెగించారు. తప్పుడు పత్రాలతో హడావుడి చేశారు. అంతేకాదు కబ్జాదారులకు అనుకూలంగా కొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. కబ్జాకు రాజముద్ర వేయించడానికి రాజకీయ పైరవీలు చేస్తున్నారు. రూ.70 కోట్ల భూమిపై పడ్డారు అగనంపూడి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నంబర్లు 226, 227లలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలు ఉన్నాయి. భూసేకరణ చట్టం కింద గతంలో స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన వాటిలో మిగులు భూములు ఇవి. చాలా ఏళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర సుమారు రూ.10కోట్లు. ఆ లెక్కన ఆ భూముల విలువ రూ.70 కోట్లు. అంతటి విలువైన భూమి ఖాళీగా ఉండటం కంటే తాము కబ్జా చేసేయడమే మేలని భావించారు.. నగరానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుల బృందం. ఓ ‘ఇన్ఫ్రా’ కంపెనీని నిర్వహిస్తున్న ఆ ఎమ్మెల్యే సన్నిహితుడు వెంటనే రంగంలోకి దిగారు. ఆ భూమి తమదని చెబుతూ కొన్ని పత్రాలను సృష్టించారు. వాటిని పట్టుకొని కబ్జాకాండకు తెరలేపారు. మొదట ఎకరాన్నర భూమిలో నిర్మాణ పనులు చేపట్టారు. పునాది పనులు కూడా ప్రారంభించారు. అనంతరం మిగిలిన ఐదున్నర ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలన్నది ఆయన ఉద్దేశం. స్టీల్‌ప్లాంట్ అధికారులతో వాగ్వాదం అవి స్టీల్‌ప్లాంట్ భూములని స్థానికులకు తెలుసు. దాంతో నిర్మాణ పనుల సమాచారాన్ని స్టీల్‌ప్లాంట్ అధికారులకు తెలిపారు. దాంతో స్టీల్‌ప్లాంట్ ల్యాండ్, ఎస్టేట్ విభాగం మేనేజర్ పి.ఎల్.రాముడు, సూరి అప్పారావులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే సన్నిహితులు స్టీల్‌ప్లాంట్ అధికారులపై తిరగబడ్డారు. తమ వద్ద ఉన్న పత్రాలు చూపిస్తూ ఆ భూమి తమదేనని అడ్డంగా వాదించారు. అవి ఫోర్జరీ పత్రాలని అధికారులు తేల్చిచెప్పారు. అంతలోనే స్టీల్‌ప్లాంట్ అధికారులకు ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేశారు. ‘ఎమ్మెల్యేగారు అసెంబ్లీలో ఉన్నారు. భూమి వ్యవహారం ఆయనే స్వయంగా చూస్తున్నారు. ఆ భూమి ఎమ్మెల్యేగారి మనుషులదే. మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి. ఎమ్మెల్యేగారు సిటీకి వచ్చిన తరువాత మీతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీనిపై అధికారులు మండిపడ్డారు. ఆ భూమి స్టీల్ప్లాంటుదని స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతానంటే మాకేం అభ్యంతరం లేదు.. కానీ ప్రస్తుతం ప్లాంట్ భూమిలో పనులను మాత్రం సాగనివ్వబోమని’ స్పష్టం చేశారు. దీనిపె కబ్జాదారులు, అధికారుల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం సాగింది. చివరికి అధికారులు కబ్జాదారులు తెచ్చిన పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఎమ్మెల్యే వచ్చాక.. మీ సంగతి చూస్తామని’ ఆయన సన్నిహితులు అధికారులను హెచ్చరించడం గమనార్హం. కబ్జాదారుల కోసం... కబ్జాదారులకు అనుకూలంగా ఎమ్మెల్యే సన్నిహితులతోపాటు మరికొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. స్టీల్‌ప్లాంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్‌ను విడిపించడానికి పైరవీలు చేస్తున్నారు. అంతేకాదు రాత్రికి రాత్రి ఆ భూమిలో షెడ్లు నిర్మించడానికి సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా న్యాయపరమైన వివాదాలు సృష్టించి రూ.70కోట్ల భూమిని హస్తగతం చేసుకోవాలన్నది వారి పన్నాగం. మరి స్టీల్‌ప్లాంట్ భూమిని పరిరక్షించుకునేందుకు ప్లాంట్ ఉన్నతాధికారులు ఎంత గట్టిగా నిలబడతారు?.. ఈ కబ్జా బాగోతం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది.. ఇప్పుడు చర్చనీయాంశం.