బరితెగింపు ఆపై బెదిరింపు
♦ స్టీల్‌ప్లాంట్ భూమిపై పెద్దల కన్ను
♦ రూ.70 కోట్ల భూమి కబ్జాకు పన్నాగం
♦ ఓ ఎమ్మెల్యే సన్నిహితుల భూబాగోతం
♦ తప్పుడు పత్రాలతో హడావుడి.. వెంటనే పునాది పనులు
♦ అడ్డుకున్న ప్లాంట్ అధికారులతో వాగ్వాదం
♦ ఎమ్మెల్యే పేరుతో ఫోనులో హెచ్చరికలు
జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆ భూమిలో ఓ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు శనివారం నిర్మాణ పనులు చేపట్టారు.. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు గానీ.. ఆ తర్వాత జరిగిన తతంగం వింటే.. ఇదెక్కడి విడ్డూరం.. మరీ ఇంత బరితెగింపా.. అని విస్మయం చెందకమానరు!.. అసలు విషయమేంటంటే.. ఆ భూమి స్టీల్‌ప్లాంట్‌కు చెందినది. తప్పుడు పత్రాలతో దాన్ని ఖాతాలో జమ చేసేసుకోవాలన్న యావతో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ అధికారులుకొద్దిసేపటికే అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలు చూపి దబాయించారు.. వాగ్వాదానికి దిగారు.. చివరికి తమ బాస్ పీఏ చేత ఫోను కూడా చేయించారు..అయినా ప్లాంట్ అధికారులు లొంగకపోవడంతో ప్రస్తుతానికి వారి కబ్జాకాండకు బ్రేక్ పడింది. ఇంతకీ తెర వెనుక ఉన్న ఆ బాస్ ఎవరంటారా?..ప్రజాప్రతినిధి అయిన ఓ ఎమ్మెల్యే!!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో విచ్చలవీడి భూకబ్జాల దందాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. తన తోటివారు చాలామంది కబ్జాలు చేసేస్తుంటే నేనెందుకు మడికట్టుకు కూర్చోవాలని అనుకున్నారో.. ఏమో.. రంగంలోకి దిగారా. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న రీతిలో ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూములపై కన్నేశారు. ఎమ్మెల్యే అండతో ఆయన సన్నిహితులు స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సుమారు ఏడు ఎకరాల భూమిలో పాగా వేసేందుకు తెగించారు. తప్పుడు పత్రాలతో హడావుడి చేశారు. అంతేకాదు కబ్జాదారులకు అనుకూలంగా కొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. కబ్జాకు రాజముద్ర వేయించడానికి రాజకీయ పైరవీలు చేస్తున్నారు.
రూ.70 కోట్ల భూమిపై పడ్డారు
అగనంపూడి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నంబర్లు 226, 227లలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలు ఉన్నాయి. భూసేకరణ చట్టం కింద గతంలో స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన వాటిలో మిగులు భూములు ఇవి. చాలా ఏళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర సుమారు రూ.10కోట్లు. ఆ లెక్కన ఆ భూముల విలువ రూ.70 కోట్లు. అంతటి విలువైన భూమి ఖాళీగా ఉండటం కంటే తాము కబ్జా చేసేయడమే మేలని భావించారు.. నగరానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుల బృందం. ఓ ‘ఇన్‌ఫ్రా’ కంపెనీని నిర్వహిస్తున్న ఆ ఎమ్మెల్యే సన్నిహితుడు వెంటనే రంగంలోకి దిగారు. ఆ భూమి తమదని చెబుతూ కొన్ని పత్రాలను సృష్టించారు. వాటిని పట్టుకొని కబ్జాకాండకు తెరలేపారు. మొదట ఎకరాన్నర భూమిలో నిర్మాణ పనులు చేపట్టారు. పునాది పనులు కూడా ప్రారంభించారు. అనంతరం మిగిలిన ఐదున్నర ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలన్నది ఆయన ఉద్దేశం.
స్టీల్‌ప్లాంట్ అధికారులతో వాగ్వాదం
అవి స్టీల్‌ప్లాంట్ భూములని స్థానికులకు తెలుసు. దాంతో నిర్మాణ పనుల సమాచారాన్ని స్టీల్‌ప్లాంట్ అధికారులకు తెలిపారు. దాంతో స్టీల్‌ప్లాంట్ ల్యాండ్, ఎస్టేట్ విభాగం మేనేజర్ పి.ఎల్.రాముడు, సూరి అప్పారావులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే సన్నిహితులు స్టీల్‌ప్లాంట్ అధికారులపై తిరగబడ్డారు. తమ వద్ద ఉన్న పత్రాలు చూపిస్తూ ఆ భూమి తమదేనని అడ్డంగా వాదించారు. అవి ఫోర్జరీ పత్రాలని అధికారులు తేల్చిచెప్పారు. అంతలోనే స్టీల్‌ప్లాంట్ అధికారులకు ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేశారు. ‘ఎమ్మెల్యేగారు అసెంబ్లీలో ఉన్నారు. భూమి వ్యవహారం ఆయనే స్వయంగా చూస్తున్నారు. ఆ భూమి ఎమ్మెల్యేగారి మనుషులదే. మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి.
ఎమ్మెల్యేగారు సిటీకి వచ్చిన తరువాత మీతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీనిపై అధికారులు మండిపడ్డారు. ఆ భూమి స్టీల్‌ప్లాంటుదని స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతానంటే మాకేం అభ్యంతరం లేదు.. కానీ ప్రస్తుతం ప్లాంట్ భూమిలో పనులను మాత్రం సాగనివ్వబోమని’ స్పష్టం చేశారు. దీనిపె కబ్జాదారులు, అధికారుల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం సాగింది. చివరికి అధికారులు కబ్జాదారులు తెచ్చిన పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఎమ్మెల్యే వచ్చాక.. మీ సంగతి చూస్తామని’ ఆయన సన్నిహితులు అధికారులను హెచ్చరించడం గమనార్హం.
కబ్జాదారుల కోసం...
కబ్జాదారులకు అనుకూలంగా ఎమ్మెల్యే సన్నిహితులతోపాటు మరికొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. స్టీల్‌ప్లాంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్‌ను విడిపించడానికి పైరవీలు చేస్తున్నారు. అంతేకాదు రాత్రికి రాత్రి ఆ భూమిలో షెడ్లు నిర్మించడానికి సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా న్యాయపరమైన వివాదాలు సృష్టించి రూ.70కోట్ల భూమిని హస్తగతం చేసుకోవాలన్నది వారి పన్నాగం. మరి స్టీల్‌ప్లాంట్ భూమిని పరిరక్షించుకునేందుకు ప్లాంట్ ఉన్నతాధికారులు ఎంత గట్టిగా నిలబడతారు?.. ఈ కబ్జా బాగోతం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది.. ఇప్పుడు చర్చనీయాంశం.