అది పాతబస్తీ ఫలక్‌నుమాలోని మల్లికార్జున స్వామి దేవాలయం.. ఆలయానికి నిజాం హయాంలో దాతలు భూములు విరాళంగా ఇచ్చారు.. ఆ వివరాలన్నింటినీ నాటి రికార్డుల్లో పొందుపరిచారు. ఇటీవల దేవాలయం భూమిని స్థానిక నేత ఒకరు కబ్జా చేస్తున్నట్టు దేవాదాయ శాఖకు ఫిర్యాదు అందింది.. దీంతో భూమి హద్దులు తెలుసుకునేందుకు పాత రికార్డుల కోసం వెతికితే వాటి జాడే కనిపించలేదు! నిజాం నాటి ఫైల్ మాయమైంది. విలువైన ఆలయ భూమి అన్యాక్రాంతమైంది!!
సాక్షి, హైదరాబాద్ : ..ఇది ఈ ఒక్క దేవాలయం కథే కాదు.. రాజధాని నగరంలో అనేక దేవాలయాల భూముల సంగతి కూడా ఇంతే! కబ్జారాయుళ్లు ఇలా కొన్ని వేల ఎకరాల్ని చెరబట్టారు. భూముల్ని మాయం చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించటం, రికార్డులను మార్చడం కాదు.. ఏకంగా ఫైళ్లనే మాయం చేసేశారు. చట్టంలో లొసుగులు, విభాగాల మధ్య సమన్వయ లేమిని ఆసరాగా చేసుకొని కబ్జా రాబందులు రెచ్చిపోయాయి. మాన్యం భూములకే దర్జాగా శఠగోపం పెట్టారు. రాజధానిలో ఎన్ని వేల ఎకరాల భూమి ఇప్పుడు కబ్జాపాలైందో, ఇంకా ఎంత ఉందో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. లోకాయుక్తలో దాఖలైన ఓ కేసుతో ఈ వ్యవహారం డొంక కదిలింది. లోకాయుక్తా ఆదేశంతో అధికారులు రంగంలోకి దిగి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని జల్లెడపట్టి చివరకు నిజాం హయాంకు చెందిన దేవాలయ రిజిస్ట్రేషన్‌లకు చెందిన కొన్ని పత్రాలను మాత్రం గుర్తించారు. దాదాపు 35 వేల కాగితాలను వెతికిపట్టుకున్నారు. అవి ఉర్దూ, అరబిక్, పార్సీ లిపిలో ఉండటంతో ఆంగ్లంలోకి తర్జుమా చేయిస్తున్నారు. కొద్దిరోజులగా ఈ కసరత్తు జరుగుతోంది. కానీ వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ రాజ్యాభిలేఖన విభాగం (స్టేట్ ఆర్కివ్స్) సహకారంతో ఈ తర్జుమా వ్యవహారం జరుగుతోంది. విచిత్రమేంటంటే.. వాటిని కూడా మాయం చేసేందుకు కొందరు నేతలు తెర వెనుక యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నో ఉదాహరణలు..
లంగర్‌హౌజ్‌లోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయానికి ఎకరాల కొద్దీ స్థలం ఉంది. కానీ వాటిల్లో ఎడాపెడా నిర్మాణాలు వెలిశాయి. ఆలయ నిర్వాహకులమంటూ కొందరు వాటిని పరాధీనం చేసేందుకు తెగబడ్డారు. నిర్వాహకుల వారసులమంటూ కొందరు అరాచకానికి తెరదీశారంటూ మరో వర్గం ఫిర్యాదులతో విషయం కోర్టుకు చేరింది. కానీ.. దేవాలయ మాన్యం వివరాలను తేల్చే రికార్డులు ఎప్పుడో మాయమయ్యాయి. అలాగే
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి భోలక్‌పూర్ సర్వే నంబర్–92లో 1.34 ఎకరాల భూమి ఉన్నట్టు నిజాం కాలం నాటి పత్రాలు చెబుతున్నాయి. కానీ ఆ భూమి ఎక్కడుందో, దాని హద్దులేంటో దేవాదాయశాఖకు తెలియదు. దీంతో రెవెన్యూ సాయం కోరింది. ఆ వివరాలేవీ తమ రికార్డుల్లోనే లేవని రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రికార్డులు మాయం కావడంతో భూమి ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. దిక్కుతోచని స్థితిలో దేవాదాయ శాఖ ఇప్పుడు నిర్మిస్తున్న దేవాలయాలకు మాన్యం ఉండటం లేదు. కేవలం ఆలయం మాత్రమే ఉంటోంది. కొన్నిచోట్ల రోడ్డు వైపు దుకాణాలు నిర్మించి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని దేవుడి సేవలకు వినియోగిస్తున్నారు.
కానీ పూర్వకాలంలో జాగీర్దాలు, పాలకులు, సాధారణ వ్యక్తులు దేవాలయాలకు పెద్దమొత్తంలో భూముల్ని విరాళంగా ఇచ్చారు. చిన్న చిన్న ఆలయాలకు కూడా వందల ఎకరాలు భూములున్న దాఖలాలున్నాయి. రాజధాని నగరంలోనూ ఇలా భూములు ఇచ్చారు. వాటి వివరాలను నిజాం పాలకులు ప్రత్యేకంగా పొందుపరిచారు. ఏ దేవాలయానికి ఎంత భూమి ఉందో తెలియాలంటే ఈ రికార్డులే ఆధారం. కానీ అవి లేకపోవటంతో ఇప్పుడు ఆయా ఆలయాలకు ఎంత భూమి ఉందో, ఉంటే హద్దులేమిటి అన్న వివరాలు దేవాదాయశాఖ వద్ద అందుబాటులో లేవు. పాత దేవాలయాల భూములకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే అటు రెవెన్యూ రికార్డుల్లో వెతుక్కోవడం, స్టేట్ ఆర్కైవ్స్‌లో పాత రికార్డుల కోసం పరుగెత్తటం తప్ప మరో ఆధారం లేకుండా పోయింది.
20 ఏళ్ల కిందటే మాయం?
20 ఏళ్ల క్రితమే దేవాదాయ శాఖ నుంచి ‘నిజాం’ రికార్డులు మాయమైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ బడా నేత, ఓ మైనారిటీ నేత, నగరానికి చెందిన మరో నేత సహకారంతోనే ఇవి గల్లంతయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి పలుకుబడితో కొందరు నేతలు రెచ్చిపోయారని, దేవాదాయ శాఖలో పదవీ విరమణ చేసిన కొందరు అధికారులు వారికి సహకరించారని తెలుస్తోంది. 1996 ప్రాంతంలో ఓ బడా నేత నిజాం కాలం నాటి ఔకాఫ్ రిజిస్టర్లను తన కార్యాలయానికి తెప్పించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ ఫైళ్లు, ఔకాఫ్ రిజిస్టర్లు మాయమయ్యాయి.
అధికారులను పావులుగా వాడుకొని..
హైదరాబాద్‌కు ప్రత్యేకంగా 1963–67 మధ్య టౌన్ సర్వే ల్యాండ్ రికార్డు(టీఎస్‌ఎల్‌ఆర్) రూపొందించారు. అప్పటి వరకు పహాణీలే దిక్కు. అంతకుముందు ఉన్న రికార్డుల్లోని వివరాలతో టీఎస్‌ఎల్‌ఆర్‌లో పొందుపరిచారు. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది. పహాణీల్లోని వివరాలతో పొంతన లేకుండా కొన్ని ఇందులో నమోదయ్యాయి. కొన్ని వివరాలు పూర్తిగా గల్లంతయ్యాయి. దేవాలయాల భూముల వివరాలు పెద్దమొత్తంలో టీఎస్‌ఎల్‌ఆర్‌లో గల్లంతైనట్టు సమాచారం. ఇక వాటికి ఏకైక దిక్కు నిజాం రికార్డులే. ఈ విషయంపై కొందరు సీనియర్ అధికారులకు బాగా అవగాహన ఉంది. వారిని పావులుగా వాడుకుని.. రికార్డుల్లో వివరాలు గల్లంతైన తీరును ఆసరా చేసుకుని నేతలు కథ నడిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 1.34 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్న నిజాం కాలం నాటి రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment