ఆక్రమణకు గురైన ఎల్లారెడ్డి బస్టాండ్ స్థలం
సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీకి అక్షరాలా రూ. వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 19 బస్టాండ్లకు 54 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ. 4 వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అలాగే నిజామాబాద్ జిల్లాలో 28 బస్టాండ్లకు 83.09 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ రూ. 600 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. తమకు రవాణా సౌకర్యం కోసం ప్రజలు కొన్నిచోట్ల ఉదారంగా భూములు ఆర్టీసీకి అందివ్వగా, మరికొన్ని చోట్ల కొనుగోలు చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండలానికో బస్టాండ్ నిర్మించారు. అప్పుడు ప్రజలు బస్టాండ్‌ల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను సమకూర్చారు.దీంతో 1985 నుంచి 1990 మధ్య కాలంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం’ పేరుతో ప్రభుత్వం బస్టాండ్‌లను నిర్మించింది. అయితే ప్రజలు ఆర్టీసీకి అప్పగించిన భూములకు సంబంధించి రికార్డుల నిర్వహణలో ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా చాలా చోట్ల ఆ స్థలాలు వివాదాల్లోకి వెళ్లాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని బస్టాండ్‌ల స్థలాలు ఆర్వోఆర్‌లో రికార్డు కాలేదని తెలుస్తోంది.
అడ్డగోలుగా ఆక్రమణలు
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పక్కా నిర్మాణాలు చేసుకుని దర్జాగా నివాసం ఉంటున్నారు. మరికొన్ని చోట్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోల స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. కామారెడ్డి పట్టణంలో రూ. కోట్ల విలువైన డిపో స్థలంపై కొందరు కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలు చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురైంది. రూ. కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి రాజకీయ అండతో కొందరు కోర్టులను ఆశ్రయించారు. బస్టాండ్‌కు సంబంధించిన స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు. నిజామాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లో విలువైన ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థలాలకు ప్రహరీ నిర్మించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. లింగంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, జక్రాన్‌పల్లి, సదాశివనగర్, గాంధారి, పిట్లం, నవీపేట్, నందిపేట్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీంగల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి తదితర మండల కేంద్రాల్లో ఆర్టీసీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి.
పట్టించుకోని అధికారులు
తమ పరిధిలోని ఆర్టీసీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువైన ఆస్తులను కాపాడాలన్న కనీస ప్రయత్నమూ చేయడం లేదు. డిపో మేనేజర్లు తమ పరిధిలోని ఆర్టీసీ ఆస్తులకు రక్షకుడిగా నిలవాలి. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేస్తున్నారా, వాటిని ఎలా రక్షించుకోవాలన్న విషయాలను కార్మిక సంఘాల నేతలతో అవసరం అయితే ప్రజాప్రతినిధులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏ అధికారి కూడా స్థలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదు.
ప్రహరీలతో రక్షణ
పట్టణాలు, మండల కేంద్రాల్లో ఊరి మధ్యలో ఉన్న ఆర్టీసీ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తే స్థలాలను కాపాడుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 47 చోట్ల ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. ఒక్కో చోట ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తే రూ. కోట్ల విలువైన భూములను కాపాడుకోవచ్చు. కబ్జాల చెరనుంచి ఆర్టీసీ స్థలాలను విడిపించి, వాటికి రక్షణగా గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
బస్టాండ్‌లకు విలువైన స్థలాలు
జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో అప్పట్లో ఊళ్లకు దూరంగా బస్టాండ్‌లను నిర్మించారు. పట్టణాలు, గ్రామాలు విస్తరించడంతో ఇప్పుడు అన్నిచోట్ల బస్టాండ్‌ల చుట్టూ ఇళ్లు నిర్మితమయ్యాయి. దీంతో అక్కడ భూముల విలువ అడ్డగోలుగా పెరిగింది. కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో గజం భూమి విలువ రూ. లక్షన్నరకు పైమాటే.. నిజామాబాద్ నగరంలో గజం విలువ రూ. 2 లక్షలు పలుకుతోంది. గాంధారిలో బస్టాండ్ ప్రాంతంలో గజానికి రూ. లక్షకుపైనే.. ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర పట్టణాల్లో గజం భూమి విలువ రూ. 50 వేలపైనే పలుకుతోంది. మారుమూల మండలాల్లో సైతం గజం భూమి విలువ రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది.
నిజామాబాద్ జిల్లాలో...
నిజామాబాద్ 10.35
ఆర్మూర్ 11.16
బోధన్ 12.12
నవీపేట 2.04
నందిపేట 7.16
కమ్మర్‌పల్లి 2.02
భీంగల్ 7.31
జలాపూర్ 5
డిచ్‌పల్లి 1.35
జాన్కంపేట 1.23
మాక్లూర్ 1.39
ఇందల్‌వాయి 2.03
మోర్తాడ్ 2.01
ఎడపల్లి 1.16
వర్ని 1.20
కోటగిరి 1.20
బాల్కొండ 1.07
వేల్పూర్ 1.19
సిరికొండ 1.36
ధర్పల్లి 2
రెంజల్ 1.07
జక్రాన్‌పల్లి 1.27
పడకల్‌లో 4 గుంటలు, రుద్రూర్‌లో 10 గుంటలు, పెర్కిట్‌లో 26 గుంటల భూమి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment