విశాఖలో భూదందాపై 15న విచారణ
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడి
- రికార్డులు లేకపోవడం వల్లే వివాదమన్న కలెక్టర్
సాక్షి, అమరావతి / విశాఖ సిటీ: విశాఖపట్నం జిల్లాలో సాగిన భూ అక్రమాలపై బహిరంగ విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. జూన్ 15వ తేదీ ఉదయం పది గంటలకు అక్కడి కలెక్టరేట్‌లో జరిగే విచారణలో తనతోపాటు సీనియర్ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. విశాఖ జిల్లాలో భూ రికార్డులు మార్చివేసి అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను కొట్టేశారని, 6,000 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు మాయమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విశాఖపట్నంలో జరిగిన భూదందా అతిపెద్దదని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్‌ఏ) నుంచి సీనియర్ అధికారుల బృందాన్ని రికార్డుల పరిశీలనకు విశాఖకు పంపుతామని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులు వచ్చి ఫిర్యా దు చేస్తే విచారించి సమస్య పరిష్కరిస్తామన్నారు.
రికార్డులు లేకపోవడం వల్లే..
కోర్టు వివాదాల్లో ఉన్న దసపల్లా హిల్స్ భూము ల పరిరక్షణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో దసపల్లా భూములపై వస్తున్న కథనాలపై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు. రాణి కమలాదేవి, ప్రభు త్వానికి మధ్య 1998 నుంచి వివాదాలు నడుస్తున్నా యని, ఇప్పటి వరకు దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వచ్చిన తీర్పులన్నీ రాణి కమలాదేవికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో 20 ఎకరాల ప్రభుత్వ భూముల్ని గుర్తించినా.. అవి ఎక్కడ ఉన్నాయో రికార్డులు లేకపోవడం ఈ వివాదానికి కారణమన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం, ఉదాసీనత ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టులో దాఖలైన పలు రిట్ పిటిషన్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.