విశాఖ జిల్లాలో భారీ భూ కుంభకోణం
విశాఖ : విశాఖ జిల్లాలో జరిగిన భారీ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. హుద్ హుద్ తుఫాన్ జిల్లాలో చాలామంది జీవితాలను అతలాకుతలం చేస్తే.. కొందరు బడా బాబులు మాత్రం దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.20వేల కోట్ల భూ అక్రమణలకు తెరలేపారు. తుఫాన్‌లో రికార్డులు కొట్టుకుపోయిన భూములను గుర్తించి భూ అక్రమణలకు పాల్పడ్డారు. ఈ భూ మాఫియాలో మంత్రి, ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి తోడల్లుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయిదు వేల ఎకరాలకు పైగా ఆక్రమణ జరిగినట్లు తెలుస్తోంది.
అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలోనే ఈ భూదందా జరిగింది. బడాబాబులు భూ ఆక్రమణతో వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం నామా మాత్రపు విచారణకు సిద్దమైంది. వచ్చే నెల 15న బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే బహిరంగ విచారణ చేసి టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్నారని .. ఈ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వేలకోట్లతో భూకుంభకోణం జరిగినట్లు గుర్తించామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తాహసీల్దార్లపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంబీలు (ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్) సైతం మాయం అయినట్లు గుర్తించారు.
మరోవైపు జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని, ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.