కబ్జా చేసేయ్‌.. రూ.కోట్లు మింగేయ్‌! | land grabbing in ysr district | Sakshi
Sakshi News home page

కబ్జా చేసేయ్‌.. రూ.కోట్లు మింగేయ్‌!

Published Wed, Jan 24 2018 11:45 AM | Last Updated on Wed, Jan 24 2018 11:45 AM

రాయచోటి పట్టణ పరిధిలోని రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు అక్రమార్కుల పాలవుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను సైతం పెకలించి వాటినే లోతైన వాగులలో వేసి యథేచ్ఛగా సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఆక్రమించిన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన  అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారన్న ఆరోపణలున్నాయి.

రాయచోటి/రాయచోటి టౌన్‌: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..ఇది పాత నానుడి. అధికారుల అండ, సహకారం లేనిదే రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణకు గురికావన్నది తాజా వాదన. ఇందుకు నిదర్శనంగా రాయచోటిలో ఆక్రమణల పాలవుతున్న భూములే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కంచాలమ్మగండి చెరువు నుంచి పంట పొలాలకు నీటిని అందించే ఎడమ కాల్వ రెండు కిలోమీటర్ల మేర కనిపించకుండా పోయింది. పెద్దపెద్ద రాతి గుట్టలను సైతం పేల్చివేస్తూ చదును చేస్తున్నా అడిగే నా«థుడు లేరు. ఇలా జరుగుతున్న ఆక్రమణలను చూస్తుంటే రెవెన్యూ అధికారులకు వాటాలు ముట్టాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

నకిలీ రికార్డుల తయారు
ఆక్రమించిన భూములకు రికార్డులను కూడా ఎవ్వరికి అనుమానం రాని రీతిలో మార్చేస్తున్నారు. పక్కనే ఉన్న భూముల సర్వే నంబర్ల పేరుతో ఆక్రమించిన భూములకు రికార్డులు తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే మ్యాపులతో సహా పట్టాలను తయారు చేయించి రూ.కోట్లను దోచుకుంటున్నారు. వాగులు, వంకలు చ దును చేసి ఎకరా రూ.కోటి నుంచి రూ.4కోట్ల వరకు ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు.

వంకలు కనిపించకుండా పోతున్నాయ్‌
పట్టణం చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు రియల్‌ఎస్టేట్‌ దెబ్బకు కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం మదనపల్లె–చిత్తూరు రింగ్‌రోడ్డు నుంచి ప్రారంభమై రవ్వగుంట, ఎరుకుల కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా ఎస్టీ కాలనీ వరకు ఉన్న వాగుపై ఆక్రమణదారుల కన్నుపడింది. వాగుకు ఇరుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని సైతం చదును చేస్తూ వాగులో పెద్దపెద్ద బండరాళ్లతో నింపేస్తున్నారు. రాత్రింబవళ్లు జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో బండరాళ్లతో నింపి చదును చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు.

వాగులపైనే పునాదులు
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులను పూడ్చి వాటిపైనే పునాదులు వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తే వారికి నోటీసులు ఇచ్చాం.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్పా ఆక్రమణ దారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రవ్వలగుట్ట, ఎరుకుల కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూములలో 4వ తరగతి ఉద్యోగులకు 3 సెంట్ల వంతున ప్రభుత్వం పట్టాలను ఇచ్చింది. వాటిని సైతం ఆక్రమణదారులు వదలకుండా ఆక్రమిస్తూ వారికి తోచిన విధంగా రహదారుల యత్నానికి సిద్ధపడుతున్నారు.

తప్పక చర్యలు తీసుకుంటాం: –గంగాధర్, వీఆర్వో, రాయచోటి
మదనపల్లె రింగురోడ్డు నుంచి ఎరుకల కాలనీ వరకు వాగును, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చాం. పనులు చేపడుతున్న ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్‌ చేస్తాం.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం: నరసింహ కుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్‌(డి.టి), రాయచోటి
మదనపల్లె రింగురోడ్డు సమీపంలోని 1003 సర్వే నంబరు సమీపంలోని వాగు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వస్థలాలను ఎవరు ఆక్రమించినా ఊరుకోం. సెలవుల్లో వీటి ఆక్రమణలకు పాల్పడినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వీఆర్వోలను పంపి పనులను నిలుపుదల చేయించి నోటీసులను జారీ చేస్తాం. రెండు మూడు రోజుల్లో ఆ స్థలాల్లో సర్వే చేయించి వాగులు, వంకలు యథావిధిగా ఉండేలా చూస్తాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement