సాక్షి, హైదరాబాద్: 1991లో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 320 మంది ఉద్యోగులకు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్లాట్లను ఫ్లాట్లు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 32ను కొట్టివేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు హైదరాబాద్ కూకట్‌పల్లి సర్వే నంబర్ 964, 1009లో 13 ఎకరాలను ప్రభుత్వం 1991లో కేటాయించింది. గజం రూ.45 చొప్పున కేటాయించాలని చెబుతూ ప్లాట్లను సిద్ధం చేసే బాధ్యతను హౌసింగ్ బోర్డుకు అప్పగించింది.
అయితే లేఅవుట్ సిద్ధమయ్యాక ఆ మొత్తాన్ని రూ.116కు పెంచింది. దీనిపై చర్చ కొనసాగుతుండగానే కేటాయింపును నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్లకు బదులు ఫ్లాట్లను కేటాయించాలంటూ జీవో 32ను విడుదల చేసింది. దీన్ని ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వం పేర్కొన్న విధంగా రూ.116 చెల్లించిన 107 మందికి ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చారు.
దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, హౌసింగ్‌బోర్డు, మరికొందరు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసినందున ఆ భూమిపై వారికే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించడం కొత్తకాదని, జీవో 32ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 320 మందికి ప్లాట్లను 4 నెలల్లో రిజి్రస్టేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment