పండుగ చేసుకున్నారు
-
రొట్టెల పండుగలో లక్షలాది రూపాయల దోపిడీ
-
మేయర్ వర్గానికి చెందిన వ్యక్తులకే కాంట్రాక్ట్ పనులు
-
అధికార పార్టీ నేతలు, అధికారులకు పర్సంటేజీలు
నెల్లూరు సిటీ: పవిత్రమైన రొట్టెల పండుగను అధికార పార్టీ నేతలు, అధికారులు ఆదాయవనరుగా చేసుకున్నారు. ప్రతి పనిలో పర్సంటేజీలను గుంచి నిధులను యథేచ్ఛగా దోచేశారు.ఽ కాంట్రాక్టర్‌లు సైతం తమ చేతివాటం ప్రదర్శించి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా మేయర్ వర్గానికి చెందిన ఓ నేత కనుసన్నల్లో జరిగిందని కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి.
రూ.1.20 కోట్లు
నెల్లూరు నగరంలోని బారాషహీద్‌దర్గా ఆవరణలో ఐదు రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగకు నగర పాలక సంస్ధ రూ.1.20కోట్లు ఖర్చు పెట్టింది. పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సరఫరా, కాంట్రాక్ట్ పద్ధతిన పారిశుద్ధ్య కార్మికుల నియామకం, స్టేజీలు, షామియానాలు, కార్పొరేషన్ సమాచార కేంద్రం తదితరాలకు వీటిని ఖర్చు చేశారు.
కాంట్రాక్టర్లతో అధికార పార్టీ, అధికారులు కుమ్మక్కు
రొట్టెల పండుగ జరిగే ఐదు రోజులూ బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చెత్తాచెదారాలు తొలగించడం, మరుగుదొడ్లు శుభ్రపరచడం వంటి వాటి కోసం 970 మంది పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం రూ.16లక్షలకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరుడు సొంతం చేసుకున్నారు. 970 మంది పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ కార్మికుల సంఖ్యను ఎక్కువగా చూపి కార్పొరేషన్ నిధులు దోచుకున్నారని విమర్శలున్నాయి. ఇదే క్రమంలో కొందరు కార్మికులకు 100 నుంచి 150 రూపాయలు ఇచ్చి తూతూ మంత్రంగా పనులు చేపట్టారు. ఇదే క్రమంలో సున్నం, బ్లీచింగ్, ఏప్రాన్స్ కొనుగోలులో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి సరఫరాలో ట్యాంకర్‌లను ఎక్కువగా సరఫరా చేసినట్లు లెక్కలు సృష్టించారు. ఇలా అవకాశమున్న ప్రతి చోటా రొట్టెల పండుగలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అయితే అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్‌లు పర్సంటేజీలు ఇవ్వడంతో వారు మిన్నకుండిపోయినట్లు సమాచారం.