దర్జాగా కబ్జా
♦ కార్పొరేషన్‌లో రూ.15 కోట్ల విలువైన స్థలం కబ్జాకు రంగం సిద్ధం
♦ అన్న క్యాంటీన్ పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమైన టీడీపీ నేత
♦ స్థలం అప్పగింతకు సిద్ధమైన నగరపాలక సంస్థ అధికారులు
♦ అధికార పార్టీ నేతలకే భవనం కూల్చివేత కాంట్రాక్టు
♦ కూల్చివేత పనుల్లోనూ నిబంధనలకు పాతర
ప్రభుత్వం ఇచ్చిన పట్టాలున్నా... ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి పేదలను రోడ్డుకీడ్చి మరీ నాడు నగర పాలక సంస్థ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నేడు మాత్రం కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి, స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ సమీపంలో రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కొట్టేసేందుకు స్థానిక టీడీపీ ముఖ్యనేత ఒత్తిడి తేగా ఆ స్థలం అప్పగింతకు మున్సిపల్ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు బండ్లమిట్ట ప్రాంతంలో ఇటీవల వందలాది పేదల ఇళ్లు కూల్చివేసి ఆ స్థలంతో పాటు ఊరచెరువును అధికార పార్టీ నేతలకు ఆదాయవనరుగా మార్చేందుకు సిద్ధమైన ఒంగోలు మున్సిపల్ అధికారులు తాజాగా నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే కార్పొరేషన్ స్థలాన్ని అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేశారు. 100 గదులకు పైగా ఉన్న ఈ స్థలాన్ని కొట్టేసేందుకు పచ్చ నేత మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాజు తలుచుకుంటే కొదువేముందన్న సామెతగా మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లు విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేశారు.
ఆ కాంట్రాక్టును సైతం అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలోని శిథిలాలను సైతం కార్పొరేషన్ అధికారులే తొలగించి స్థలాన్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం కావడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పార్టీ నేత అధికారులకు సైతం ముడుపులు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అన్న క్యాంటీన్ పేరుతో ఈ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు అధికార పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగడం గమనార్హం. తన ముగ్గురు అనుచరులను ముందు పెట్టి ముఖ్యనేత కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముగ్గురు నేతల మధ్య పోటీ..
ఆ స్థలంపై అధికార పార్టీల్లోనే పోటీ నెలకొంది. నగరానికి చెందిన ముగ్గురు స్థలం నాకంటే నాకంటూ ముఖ్యనేతపై ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. ముగ్గురు ముఖ్యనేత సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఒకరు మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తి, మరొకరు నగర శాసనసభ్యుడికి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. పైకి అన్న క్యాంటీన్ అని చెబుతున్నా... స్థలాన్ని అప్పనంగా కొట్టేసి కాంప్లెక్స్‌ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య పోటీ నేపథ్యంలో తానే ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు సమాచారం.
నిబంధనలకు పాతర..
నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సాక్షాత్తు మున్సిపల్ అధికారులే సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన భవనాన్ని కూలగొట్టే సమయంలోనే భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఏం చేయాలన్న దానికి అధికారులు ఒక నిర్ణయానికి రావాలి. దీనిపై ప్రతిపాదనలు పంపాలి. కాంప్లెక్స్ నిర్మించదలచుకుంటే దానికి సంబంధించిన డిజైన్లు రూపొందించాలి. నిధులు మంజూరు ఉత్తర్వులు తీసుకోవాలి. ఒక వేళ భవనాన్ని కూల్చాలన్నా అందుకు అనుమతులు తీసుకోవాలి. కానీ అద్దంకి బస్టాండ్‌లోని మున్సిపాలిటీ భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు ఈ నిబంధనలేమి పాటించలేదు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
పెద్ద జేసీబీ, ఇటాచీ లాంటి మిషన్లు తెచ్చి పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు అద్దంకి బస్టాండ్‌లోని భవనం కూల్చివేత పనులను మాత్రం పచ్చ నేతకు అప్పగించడం గమనార్హం. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు చేతులు మారినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ స్థలాన్ని సైతం సదరు నేతకే అప్పగించేందుకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాన్ని అన్న క్యాంటీన్‌కు అధికార పార్టీ నేతలు కావాలని కోరిన మాట నిజమేనని మున్సిపల్ కమిషనర్ ‘సాక్షి’తో చెప్పారు. తొలుత క్యాంటీన్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో పై నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా... అలాంటివేమి అమలు చేసిన దాఖలాల్లేవు. మొత్తంగా స్థలాన్ని అప్పగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.