
సాక్షి, వీణవంక(హుజూరాబాద్): అదనపు వరకట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధించడంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వీణవంక మండలం చల్లూరు గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చల్లూరుకు చెందిన బొంగోని వీరస్వామి–విజయ దంపతులకు కుమారుడు హరీశ్, కుమార్తె అనూహ్య అలియాస్ కావ్య(24) ఉన్నారు. కావ్యను ఇదే గ్రామానికి చెందిన వరుసకు మేనబావ అయిన తీగల పరమేశ్‌కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. రూ.15 లక్షలతోపాటు బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చి, పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ దంపతులకు కుమారుడు లోకేశ్(15 నెలలు) ఉండగా కావ్య ప్రస్తుతం 5 నెలల గర్భిణి.
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు 6 నెలలైనా గడవక ముందే భర్త పరమేశ్, అత్త భూలక్ష్మి, మామ పర్శరాములు, బావ నాగరాజు, తోటి కోడలు సంధ్య, మరిది రాము నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. మరో రూ.5 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. కావ్య ఈ విషయాన్ని పుట్టింటివాళ్లకు చెప్పి, కన్నీరు పెట్టుకుంది. పలుమార్లు ఇరువర్గాల మధ్య పంచాయితీలు కూడా జరిగాయి. ఆ తర్వాత వేధింపులు ఎక్కువవడం, నిత్యం గొడవ జరుగుతుండటంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం రాత్రి అత్తింట్లోనే చున్నీతో ఉరేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తహసీల్దార్ కనకయ్య ఆమె మృతదేహానికి సోమవారం పంచనామా నిర్వహించారు. హుజూ రాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై కిరణ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, కావ్య మృతదేహాన్ని పరిశీలించారు.
నిందితులపై కేసు..
అత్తింటివారి అదనపు వరకట్న వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి వీరస్వామి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment