
వివరాలు వెల్లడిస్తున్న సీపీ వి.సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్: వివాహితపై సామూహిక లైంగికదాడి జరిగిన సంఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలో చర్చనీయాంశమైంది. లైంగికదాడికి పాల్పడిన నలుగురితోపాటువారికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదివారం నగరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన రౌతు మురళీకృష్ణ ములుగు జిల్లాకేంద్రానికి చెందిన యువతిని 2007లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యులకు తెలియకుండా ఆమెతో మంకమ్మతోటలో రహస్యంగా కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు అతడికి 2017లో మేనమరదలితో వివాహం జరిపించారు. అయితే మురళీకృష్ణ కొద్దిరోజులుగా మేనమరదలిని అదనపు కట్నంకోసం వేధిస్తుండడంతో మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఇటీవల మురళీకృష్ణ కదలికలపై ఆరా తీసిన ఆమె అతడు గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. మంకమ్మతోటలో కాపురం పెట్టాడని తెలుసుకున్న ఆమె ఆదివారం తన తల్లిని, సోదరులు రాజశేఖర్, శ్రీధర్, నితిన్‌తోపాటు వారి స్నేహితుడైన ఎండీ.ఫిరోజ్‌ను వెంట తీసుకెళ్లింది. మంకమ్మతోటలోని ఇంట్లో మురళీకృష్ణ భార్య పిల్లలతో ఉండగా మురళీకృష్ణను పక్కగదిలోకి తీసుకెళ్లి చితకబాదారు.
అదే సమయంలో రాజశేఖర్, శ్రీధర్, నితిన్, ఎండీ.ఫిరోజ్ కలిసి అక్కడే ఉన్న మురళీకృష్ణ భార్య (ప్రేమ వివాహం చేసుకున్న యువతి)పై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రాజశేఖర్, శ్రీధర్, నితిన్, ఎండీ.ఫిరోజ్‌తోపాటు వారికి సహకరించిన మేనమరదలితోపాటు ఆమె తల్లిపై కేసు నమోదు చేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ(లాఅండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, సీఐలు లక్ష్మీబాబు, శ్రీనివాస్ ఉన్నారు. ఔ
Comments
Please login to add a commentAdd a comment