సీఆర్‌డీఏకు జిల్లా అణిముత్యాలు | Stuck in Transfer process | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీఏకు జిల్లా అణిముత్యాలు

Published Fri, Jan 2 2015 2:50 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Stuck in Transfer process

నెల్లూరు(రెవెన్యూ): ‘చెప్పిన పని చేయడం మీకు తెలియదు, పనితీరు మెరుగుపర్చుకోకుంటే ఇంటికి పంపిస్తా...’ ఈ వాఖ్యలు చేసింది ఎవరో కాదు అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ ఎన్. శ్రీకాంత్. తహశీల్దార్లను హెచ్చరించిన ఆయనే ప్రస్తుతం అందులో కొందరిని ఏరికోరి సీఆర్‌డీఏకు బదిలీ చేయించుకున్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపడటంతో బదిలీ ప్రక్రియ వాయిదాపడింది. ఈ బదిలీ ప్రక్రియ ప్రస్తుతం జిల్లా రెవెన్యూ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో చెప్పిన పనిని సకాలంలో పూర్తిచేసి, నిత్యం విధి నిర్వహణలో ఉండే ఆర్డీఓలు, తహశీల్దార్లపై సీఆర్‌డీఏ కమిషనర్ చూపుపడింది.

ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక ఆదేశాలు తీసుకుని భూసేకరణ తదితర రెవెన్యూ విషయాల్లో అనుభవం ఉండే వారిని సీఆర్‌డీఏకు బదిలీ చేయిస్తున్నారు. ఇప్పటికే అన్ని విషయాలపై పట్టు ఉన్న ఆత్మకూరు ఆర్‌డీఓ ఎంవి. రమణకు సీఆర్‌డీఏకు బదిలీ చేశారు. ఆయన ఈనెల చివరి వారంలో రిలీవ్ అయి సీఆర్‌డీఏలో డీప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల చివరివారంలో జిల్లాలో పనిచేస్తున్న 10 మంది తహశీల్దార్లు సీఆర్‌డీఏకు బదిలీకానున్నారు.ఎన్. శ్రీకాంత్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరించిన సమయంలో తహశీల్దార్లు పనితీరు అధ్వానంగా ఉందని అగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో ఆయన పనిచేసినంతకాలం తహశీల్దార్లను పరుగులు తీయించారు. జిల్లాలోని 46 మంది తహశీల్దార్లకు పనితీరు ఆధారంగా ర్యాంక్‌లు కూడా కేటాయించారు. ఇటీవల జరిగిన తహశీల్దార్ల బదిలీలో ఆయన ఇచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా బదిలీలు చేయాలని జాబితా సిద్ధం చేశారు. కాకుంటే టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఆ జాబితాను పక్కన పెట్టి నాయకులు సూచించిన వారిని ఆయా మండలాలకు బదిలీలు చేశారు. తహశీల్దార్ల బదిలీ జాబితాను అనేక పర్యాయాలు మార్పులు చేశారు. అయితే ఆయన ర్యాంక్‌లు ఇచ్చిన తహశీల్దార్లను సీఆర్‌డీఏకు బదిలీ చేయించారు. బుచ్చిరెడ్డిపాళెం.

ఇందుకూరుపేట, టీపీగూడూరు తదితర మండలాల తహశీల్దార్లు ఆ జాబితాలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపడటంతో బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదాపడింది. ఈ నెల చివరివారంలో తహశీల్దార్లు సీఆర్‌డీఏకు బదిలీ కానున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ఇబ్బందులుపడే అవకాశం ఉంది. ఇష్టం లేని తహశీల్దార్లను బదిలీ చేయకూడదని రెవెన్యూ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆరోగ్యం సరిగా లేనివారు, మహిళ తహశీల్దార్లను సీఆర్‌డీఏకు బదిలీ చేయకుడదని అసోసియేషన్ సీఎంకు విన్నవించింది. కాగా అధిక శాతం మంది తహశీల్దార్లు సీఆర్‌డీఏకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement