40శాతం టీచర్లను
రిలీవ్ చెయ్యని విద్యాశాఖ
ప్రత్యామ్నాయ చర్యలకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
విజయనగరం అర్బన్: సొంత ప్రాంతానికి దగ్గరగా వెళ్దామని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఉపాధ్యాయులకు బదిలీ ప్రక్రియ సంతృప్తినివ్వలేదు. ప్రతి పాఠశాలలో 50 శాతం మంది విధిగా ఉంటూ టీచర్లు రిలీవ్ అవ్వాలని మెలిక పెట్టడంతో జిల్లాలో 40 శాతం మందికి స్థానచలనం అవని పరిస్థితి ఏర్పడింది. బదిలీ అవకాశం అక్కరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కష్టాలు తీరతాయని భావించినా ఆ పరిస్థితి లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి బదిలీల ప్రక్రియను సాగదీస్తూ ఎట్టకేలకు ఇటీవల పూర్తి చేశారు. అందరినీ ఒకేసారి బదిలీ చేస్తే పాఠశాలలు మూతవేయాల్సి వస్తుందని కనీసం 50 శాతం మంది టీచర్లు ఉంటూ సీనియారిటీ ఉన్నవారినే ముందు పంపాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎంఈఓలను జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.
జిల్లాలో 3,683 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 1,450 మంది ఉపాధ్యాయులకు బదిలీ అవకాశం లభించింది. అయితే వీరిలో జీఓ నంబర్ 63 ప్రకారం రిలీవర్లు రాకుండా 50 శాతం లోపు ఉపాధ్యాయులు స్థానచలనం పొందే అవకాశం లేదు. ఉదాహరణకు నలుగురు ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ముగ్గురు బదిలీకోసం దరఖాస్తు పెట్టుకుంటే రిలీవర్స్ కనీసం 50 శాతం మంది ఉంటేనే బదిలీలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో వినియోగం లోకి రావడంతో దాదాపుగా 40 శాతం అంటే వివిధ కేటగిరి ఉపాధ్యాయులు 650 మందికి పైగా బదిలీ స్థానాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
వీరిలో సబ్జెక్ట్ టీచర్లే అధికంగా ఉన్నారు. 2013లో జరిగిన బదిలీలో ఇదీ పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల బదిలీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన ఉపాధ్యాయులు ఇప్పటికీ వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జీవోను అమలు చేశారు. జీఓను విడుదల చేసినపుడే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే నిర్దేశాలు చేయాలని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నేటికీ ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు తీరలేదు.
బదిలీ అయినా.. మారని మజిలీ
Published Fri, Nov 6 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement