వాయిదా మంత్రం
* బదిలీలపై తొలగని ప్రతిష్టంభన
* జన్మభూమి కార్యక్రమాలు పూర్తికాక గందరగోళం
ఏలూరు : ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. సాంకేతిక కారణాల పేరిట ప్రభుత్వం తరచూ వాయిదా వేస్తోంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చాలా జిల్లాల్లో వాయిదా పడటంతో ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన బదిలీల ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొంది. వాస్తవంగా ఈ నెల 20 నాటికి జన్మభూమి సభలు పూర్తి కావాల్సి ఉండగా, అదే రోజున బదిలీలు చేపడతామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన్మభూమి సభలను వారుుదా వేశారు. పొరుగు జిల్లాల అధికారులు, ఉద్యోగులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లడంతో ఆయూ జిల్లాల్లోనూ వాయిదా పడ్డాయి.
తుపాను ప్రభావం లేని జిల్లాల్లో సోమవారం నుంచి జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. తుపాను బాధి త ప్రాంతాల్లో ఈ నెల 30లోగా పూర్తవుతాయూ లేదా అనేది సందేహంగానే ఉంది. మరోవైపు తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాలను అంచనా వేయూల్సి ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని జిల్లాల్లో శాఖల వారీగా బదిలీలను ఒకేసారి చేపట్టాల్సి ఉండటం, ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో బదిలీల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వ్యవహారం ఎప్పటికి కొలిక్కివస్తుందో తెలియక ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.
సూపరింటెండెంట్ల పరిస్థితి ఏమిటో!
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో కొంతమంది సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఇతర జిల్లాలకు ఇటీవల బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వారందరినీ జన్మభూమి కార్యక్రమాలు పూర్తయ్యూక ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేయూలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో జన్మభూమి కార్యక్రమాలు ఈ నెల 25 వరకు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో వారిని 25వ తేదీ తరువాత రిలీవ్ చేస్తారా, జన్మభూమి కార్యక్రమాలతో సంబంధం లేని, కార్యక్రమాలు పూర్తయిన ప్రాంతాల్లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారుల సంగతి ఏమిటనేది నేటికీ స్పష్టం కాలేదు. దీంతో వారంతా కొత్త స్థానాల్లో చేరాలా, వద్దా అనే విషయమై గందరగోళం నెలకొంది. ఇలా ప్రతి సందర్భంలోనూ బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వాయిదాల పర్వం కొనసాగే అవకాశం ఉందని సమాచారం.