అంతా ‘ఆఫ్‌లైనే’! | Online Transfer process in govt employee | Sakshi
Sakshi News home page

అంతా ‘ఆఫ్‌లైనే’!

Published Tue, Jun 21 2016 12:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

అంతా ‘ఆఫ్‌లైనే’! - Sakshi

అంతా ‘ఆఫ్‌లైనే’!

తమ అనుయాయులు, ఆ అనుయాయుల అనుచరులు, ఆ అనుచరులకు కావాల్సినవారు.... ఇలా ఎవరికివారు తమకు ఇష్టమైన ఉద్యోగులను తమ ఇలాకాల్లో నియమించుకోవాలని అధికార పార్టీ నాయకుల విశ్వప్రయత్నం! అంతా ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నా... మరోవైపు సిఫారసు లేఖల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి శాఖకు సంబంధించి అవి దొంతరలే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అధికార పార్టీ నేతల సిఫారసులకు పెద్దపీట వేయాలా? అనేది జిల్లా ఉన్నతాధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, జెడ్పీ, పంచాయతీరాజ్ విభాగాల్లో ఈ పరిస్థితి ఎక్కువ. గడువు రోజైన సోమవారం అర్ధరాత్రి వరకూ బదిలీల జాబితా బయటకు వెలువరించలేదు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కీలకమైన రెవెన్యూ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల్లో ఉద్యోగుల బదిలీల హడావుడి ఎక్కువగా ఉంది. వాస్తవానికి మే నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తిచే యాలి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందనే ఆరోపణలు ఉద్యోగవర్గాల్లో వెల్లువెత్తాయి. అందుకు నిదర్శనమా అన్నట్లుగానే ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన బదిలీలకు తెరలేపింది. కేవలం తొమ్మిది రోజుల్లో అంటే 20వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. పాత విధానంలోనే బదిలీలు చేయాలనే అధికారులు నిర్ణయించినా... పారదర్శకత పేరుతో ఆన్‌లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ ఆన్‌లైన్ విధానం ఉద్యోగులకు లాభం చేకూర్చుతుందనే అభిప్రాయాలు వచ్చినా చివరకు బదిలీల ప్రక్రియ సిఫారసుల విధానంలోనే కొనసాగిస్తున్నారు.
 
 సిఫారసుల వర్షం
 ప్రభుత్వం చెబుతున్నట్లు అంతా ఆన్‌లైన్‌లో చేస్తే అందరికీ మంచిదే! సిఫారసులకు అవకాశం ఉండదు! అసలు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తే మరి అధికార పార్టీ నాయకులు సిఫారసు లేఖలు... కొన్ని లేఖల్లో పదుల సంఖ్యలో పేర్లతో చిన్నచిట్టా మాదిరిగా ఇవ్వడంలో అర్థమేమిటని కొంతమంది ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంగళవారం నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ సోమవారం అర్ధరాత్రి దాటినా బదిలీల జాబితా ప్రకటించలేదు. ఎట్టిపరిస్థితిలోనూ మంగళవారం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు. కానీ ఎలా అమలు చేయాలో తెలియక శాఖాధిపతులు అవస్థ పడుతున్నారు.
 
 దేనికి ప్రాధాన్యం
 ఒకవైపు ఆన్‌లైన్‌లో ఉద్యోగుల దరఖాస్తులు, వారి ఆప్షన్లు... మరోవైపు అధికార పార్టీ నాయకుల సిఫారసులు, పేర్లతో చిట్టాలు... వాటిలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలోనని జిల్లా ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. బదిలీలపై శాఖాధిపతులదే తుది నిర్ణయం కావడంతో అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయనేది బహిరంగ రహస్యం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన గత రెండు దఫాల బదిలీల్లోనూ అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరిపోయిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
 మరోసారి అలాంటి పొరపాటులు జరిగితే తమ పరువు పోతుందని అధికారులు భయపడుతున్నారు. అలాకాకుండా ఆన్‌లైన్ ప్రక్రియకే ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేస్తే ఎక్కడ అధికార పార్టీ నాయకుల వేధింపులకు గురి అవుతామోననే భయమూ లేకపోలేదు. దీంతో అటు ఆన్‌లైన్ దరఖాస్తులను, ఇటు అధికార పార్టీ నాయకుల సిఫారసుల చిట్టాలను సరిచూసుకొనే పనితోనే సోమవారం రోజంతా గడిచిపోయింది.
 
 అర్ధంతరంతో అగచాట్లు
 గత ఏడాది జూలైలో జరిగిన బదిలీల పర్వంలో రెవెన్యూ విభాగం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొలుత అధికార పార్టీ నాయకుల సిఫారసుల ప్రకారమే గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్‌వో)లు 110 మందిని ఒకే జాబితాతో బదిలీ చేశారు. దీంతో ఆరోపణలు, ఒత్తిళ్లు రావడం, ఈలోగా గడువు ముగియడంతో ఆ బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది.
 
  ఇదే వరుసలో అప్పట్లో కొంతమంది అదేశాఖలోని సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు తమకు బదిలీ ఉత్తర్వులు వచ్చినా నిలుపుదల చేసుకున్నారు.  ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ శాఖలోని వివిధ క్యాడర్లలో 160 మందిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. వారిలో వీఆర్‌వోలే 70 మందికి పైగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కరు తప్ప జిల్లాలో ఏ తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వారిలో ఎవ్వరికీ ఒకేచోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తికాలేదు.
 
 జెడ్పీలోనూ ఇదే పరిస్థితి
 జెడ్పీ, పంచాయతీరాజ్ ఉద్యోగులకు సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికి బదులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో బదిలీకి దరఖాస్తు చేసుకున్నవారికే మరోసారి కౌన్సెలింగ్ జరుగుతున్న చోటే ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో రాజకీయ జోక్యంతోనే బదిలీలు జరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది.  అలాగే ఐసీడీఎస్ పరిధిలోని 26 మంది ఉద్యోగులు ఆప్షన్లు నమోదు చేశారు. కానీ రెండు మూడు రోజుల వరకూ బదిలీ ఉత్తర్వులు వెలువడే పరిస్థితి కనిపించట్లేదు.
 
 వైద్యశాఖలో ఆలస్యంగా జాతర
 జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు సంబంధించిన విధివిధానాలతో జీవో నంబర్ 272ను ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం విడుదల చేసింది. దీంతో పది రోజుల ఆలస్యంగా బదిలీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. 27వ తేదీన వెబ్‌కౌన్సెలింగ్, 28వ తేదీన అభ్యంతరాలు (గ్రీవెన్స్)కు అవకాశం ఇచ్చింది. 30వ తేదీలోగా ఈ బదిలీలు పూర్తి చేయాలని ఈ జీవోలో ఆదేశించింది. బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు డీఎంహెచ్‌వో చైర్మన్‌గా, అదనపు డీఎంహెచ్‌వో, అడ్మినిస్ట్రేషన్ అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అన్ని కేటగిరీల్లో సుమారు 2,700 మంది, అలాగే రిమ్స్‌లో 734 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 శాతం మందికే బదిలీ అవకాశం ఉంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement