సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పన్నుల శాఖ ఉద్యోగుల్లో ‘బదిలీ’ల గుబులు మొదలయింది. సాధారణ బదిలీల్లో కాకుండా ప్రత్యేకంగా ఈ నెలలో బదిలీ ప్రక్రియ విడుదల చేయడం, అందులోనూ సర్కిళ్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన కొత్త సర్కిళ్ల కార్యాలయాలను ఏర్పాటు చేయకుండానే బదిలీలు చేపడుతుండడం ఆ శాఖ సిబ్బందికి సమస్యగా మారుతోంది.
కొత్తగా ఏర్పాటయిన 20కిపైగా సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు తీసుకోకుండానే బదిలీలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంతో అక్కడకు బదిలీ అయితే తాము ఎక్కడ కూర్చుని పనిచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ శాఖ సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు బదిలీల నిబంధనల్లోనూ కొన్ని ఇబ్బందులున్నాయని, అన్నీ సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
91 నుంచి 100కు పెరిగిన సర్కిళ్లు
వాస్తవానికి, పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడో జరగాల్సి ఉండగా, ఇటీవలే దానిని పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతోనే సాధారణ బదిలీల్లో ఈ శాఖ సిబ్బందికి అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు శాఖ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి సర్కిళ్లను హేతుబద్ధీకరించారు. దీంతో అప్పటివరకు 91గా ఉన్న సర్కిళ్లను 100కు పెంచారు. అధికారికంగా 9 సర్కిళ్లే పెరిగినా, కొన్ని పాత సర్కిళ్లను తొలగించడంతో 20కిపైగా సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే, సర్కిళ్లలో పనిచేయాల్సిన అసిస్టెంట్ కమిషనర్లు, పన్నుల అధికారులు, డిప్యూటీ పన్నుల అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఎక్కడా కార్యాలయాలు కానీ, సీట్లు కానీ కేటాయించలేదు.
కేవలం పేపర్ల మీద సర్కిళ్లను పెంచి తాజా బదిలీల ప్రక్రియలో ఈ సర్కిళ్లకు బదిలీ ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో సర్కిల్‌కు కనీసం 10 మంది సిబ్బంది చొప్పున ఆ 20 సర్కిళ్లకు కనీసం 200 మంది బదిలీ అవుతారని అంచనా. ఈనెల 27న ప్రారంభమైన బదిలీల ప్రక్రియ వచ్చేనెల 8తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త సర్కిళ్లకు బదిలీ అయిన ఉద్యోగులు ఎక్కడ కూర్చుని పనిచేయాలన్న దానిపై ఉన్నతాధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు గతంలో ఉన్న మాదాపూర్ సర్కిల్‌ను మాదాపూర్, మాదాపూర్ 1–4, వికారాబాద్‌ల పేరుతో 6 సర్కిళ్లుగా విడగొట్టారు. ఇందులో మాదాపూర్, మాదాపూర్–1 సర్కిళ్లకు గగన్‌విహార్ కాంప్లెక్స్‌లో కార్యాలయాలున్నాయి కానీ, మిగిలిన నాలుగు సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. ఇప్పుడు ఆ 4 సర్కిళ్లకు బదిలీ అయితే తమ పరిస్థితేంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు సిటీ డివిజన్లలో మూసివేసిన సర్కిళ్ల సిబ్బందిని, చెక్‌పోస్టుల ఎత్తివేత కారణంగా పోస్టింగ్‌లు లేని వారిని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్లకు బదిలీ చేస్తామని, వీరిని కేటాయించిన తర్వాతే మిగిలిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ఉన్నతాధికారులు చెపుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే తమకు అన్యాయం జరుగుతుందని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియలో మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ వారిని రిలీవ్ చేయవద్దని, కార్యాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!
90% మందికి స్థాన చలనం
తాజాగా పన్నుల శాఖలో చేపట్టిన బది లీల కారణంగా ఆ శాఖలోని 90శాతం మంది సిబ్బందికి స్థానచలనం తప్పడం లేదు. పన్ను ల శాఖలో గత నాలుగేళ్లుగా బదిలీలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయిన సిబ్బందిని బదిలీలు చేయాలని నిర్ణయించడంతో అడపాదడపా ఇటీవల బదిలీలయిన వారు, రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారు మిన హా అందరూ బదిలీ అవుతారని అంటున్నారు. అలా జరిగితే శాఖ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని, కనీసం మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే బదిలీలు చేయాలని సిబ్బంది కోరుతుండడం గమనార్హం?
Comments
Please login to add a commentAdd a comment