సాక్షి ప్రతినిధి, ఏలూరు :జల వనరుల శాఖలో బదిలీల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల బది లీలకు ఓ ఉన్నతాధికారి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందిరాసాగర్ కుడి ప్రధాన కాలువ (ఐఎస్‌ఆర్‌ఎంసీ) సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా తనకు నచ్చిన వారికి నచ్చినచోటుకు బదిలీ చేసేందుకు ఫైలు రెడీ చేసినట్టు సమాచారం. ఐఎస్‌ఆర్‌ఎంసీ సర్కిల్‌లో నలుగురు సూపరింటెండెంట్లు ఉండగా.. ఇద్దరు ఏలూరులోని కార్యాలయంలో, ఒకరు పోలవరంలో, మరొకరు కృష్ణాజిల్లా సీతానగరం కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతంలో శాఖాపరమైన పనులకు ఇబ్బంది రాకుండా నలుగురిలో ఇద్దరిని మాత్రమే బదిలీ చేసేవారు.
ఇప్పుడు మూడేళ్ల సర్వీసు దాటిన వారందరినీ బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇఎస్‌ఆర్‌ఎంసీ సర్కిల్‌లోనూ బదిలీల జాతర మొదలైంది. ఇదే సాకుతో ఉన్నతాధికారులు తమకిష్టమైన వారికి పెద్దపీట వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియారిటీతో ప్రమేయం లేకుండా. ఆప్షన్లు లేకుండా ఇద్దరు సీనియర్ సూపరింటెండెంట్లను పక్కనపెట్టి జూనియర్ అయిన మూడో వ్యక్తికి కావాల్సిన చోటకు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెగ్యులర్, నాన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నాన్ రెగ్యులర్ పోస్టుల్లోకి రెగ్యులర్ వారిని తీసుకుంటూ ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం. జాబితాను కలెక్టర్ కె.భాస్కర్‌కు పంపించినట్టు సమాచారం. ఈనెల 8నుంచి మొదలు కానున్న బదిలీల ప్రక్రియలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆమోద ముద్ర కూడా వేయించేందుకు సదరు ఉన్నతాధికారి వ్యూహం పన్నినట్టు తెలుస్తోందని నీటిపారుదల శాఖ వర్గాలు వాదిస్తున్నాయి.
ఇరిగేషన్‌లో ఇష్టారాజ్యం
Published Wed, Jun 3 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement