రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు! | Trade Union Leaders Meeting With CS Shanti Kumari Over GO 317: Telangana | Sakshi
Sakshi News home page

రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!

Published Sat, Oct 26 2024 4:28 AM | Last Updated on Sat, Oct 26 2024 4:28 AM

Trade Union Leaders Meeting With CS Shanti Kumari Over GO 317: Telangana

మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్‌ బయటపెట్టకపోవడంపై అసంతృప్తి 

ఇక డీఏలపైనే అందరి ఆశ 

నేటి కేబినెట్‌లో తేల్చకుంటే భవిష్యత్‌ కార్యాచరణ

ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్‌ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్‌ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్‌ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్‌ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్‌ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్‌ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్‌ను అడగ్గా ఆ ఫైల్‌ సర్క్యులేషన్‌లో ఉందని.. బహుశా కేబినేట్‌ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్‌తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏలూరు శ్రీనివాస్‌రావు, చావా రవి, వి. రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement