బెయిలవుట్ యత్నాల్లో డెక్కన్ క్రానికల్
Published Thu, Sep 19 2013 2:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్‌ఎల్) తాజాగా పారిశ్రామిక ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ బోర్డును (బీఐఎఫ్‌ఆర్) ఆశ్రయించింది. ఖాయిలా కంపెనీల చట్టం కింద బెయిలవుట్ కోరింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం బీఎస్‌ఈకి తెలియజేసింది. ఖాయిలా కంపెనీల చట్టం 1985 కింద బీఐఎఫ్‌ఆర్ తమ అభ్యర్థనను రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. ఈ చట్టంలో సెక్షన్ 15 (1) కింద కంపెనీ గానీ ఖాయిలా పడినట్లుగా భావించిన పక్షంలో గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదరు సంస్థల డెరైక్టర్ల బోర్డు..బీఐఎఫ్‌ఆర్‌ను ఆశ్రయించవచ్చు. కంపెనీ ఖాయిలాపడినట్లు నిర్ణయానికి వచ్చిన ఆరు నెలలలోగా లేదా.. ఆర్థిక ఫలితాల ఆడిటింగ్ పూర్తయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా మేనేజ్‌మెంట్ ఈ పని చేయొచ్చు. అయితే, తాజా ఉదంతంలో.. కంపెనీ ఖాయిలాపడినట్లు డీసీహెచ్‌ఎల్ మేనేజ్‌మెంట్ ఎప్పుడు నిర్ధారణకి వచ్చినదీ.. బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పొందుపర్చలేదు.
డీసీహెచ్‌ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైగా రుణాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, రుణంగా తీసుకున్న నిధులను ఏం చేసినదీ కంపెనీ చెప్పడం లేదు. దీంతో రుణాలిచ్చిన పలు సంస్థలు ఇప్పటికే చట్టపరమైన చర్యలకు దిగాయి. అప్పులిచ్చిన కెనరా బ్యాంక్.. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసింది.
Advertisement