మరో ఫేక్‌ న్యూస్‌ సంచలనం | Another Fake News Viral On Rs 4 lakh Crore Of Bad Loans | Sakshi
Sakshi News home page

మరో నకిలీ వార్త సంచలనం

Published Wed, Apr 25 2018 4:49 PM | Last Updated on Wed, Apr 25 2018 8:04 PM

Another Fake News Viral On Rs 4 lakh Crore Of Bad Loans - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టుల పీఐబీ గుర్తింపు కార్డులను తక్షణం రద్దు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ సర్కులర్‌ జారీ చేయడం, దాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. పీఐబీ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు రాయరని, సోషల్‌ మీడియా ఊపందుకున్న నేపథ్యంలో ఆకాశ రామన్నలు, అజ్ఞాతవ్యక్తులే అలాంటి వార్తలు రాస్తారని కాబోలు స్మృతి ఇరానీ సర్కులర్‌ విషయంలో నరేంద్ర మోదీ తక్షణం స్పందించారు.
ఇప్పుడు మరో నకిలీ వార్త సంచలనం సృష్టించింది.

యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్‌ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పేరుకు పోయిన 9 లక్షల కోట్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల నిరర్థక ఆస్తులు లేదా రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ) 2016’ వసూలు చేసిందన్నది ఆ నకిలీ వార్త. ఈ వార్తను ముందుగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఏప్రిల్‌ 14వ తేదీన పోస్ట్‌ చేయగా, ప్రధాన మంత్రి వెబ్‌సైట్‌ కూడా ఈ వార్తను మీడియా విభాగంలో ప్రముఖంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి ‘నమో’ యాప్‌ విస్తతంగా షేర్‌ చేసింది. బీజేపీతోపాటు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఈ వార్తను షేర్‌ చేస్తున్నారు. ఈ వార్త నకిలీదని తెలుసుకోగానే బీజేపీ పార్టీ, ప్రధాని వెబ్‌సైట్‌ దాన్ని తొలగించాయి.

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే మాటలు కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆ ప్రభుత్వం ఘనతగానే పరిగణించవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ నకిలీ వార్త ముందుగా ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్‌ న్యూస్‌’ వెబ్‌సైట్‌ నెట్‌లో తూర్పార పట్టగా, ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికలో ఏప్రిల్‌ నాలుగవ తేదీతో ‘4 లాక్‌ క్రోర్‌ రూపీస్‌ ఎన్పీఏఎస్‌ రిటర్న్‌ డ్యూ టూ ఇన్సాల్వెన్సీ సిస్టమ్‌: అఫీషియల్‌’ అనే శీర్షికతో ఓ వార్త ఉంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక లేదా చెడ్డ రుణాల్లో సగానికి కొంచెం తక్కువగా, 4 లక్షల కోట్ల రూపాయలు ‘ఐబీసీ–2016’ కింద వసూలయ్యాయన్నది ఆ వార్త. ఆ వార్త కూడా ఓ అధికారి చెప్పినట్లు ఉంది.  ఆ వార్తను ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ‘ఐఏఎన్‌ఎస్‌’ అనే వార్తా సంస్థ నుంచి తీసుకొంది. ‘ఇండస్ట్రీ ఛాంబర్‌ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ’  పరిశ్రమలు దివాలా సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారట.

ఆ తర్వాత ఈ వార్తకు మరింత మసాలా అద్ది నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిన వెబ్‌సైట్‌ ‘పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌’ ప్రచురింది. ‘మాసివ్‌ క్రాక్‌డౌన్‌ బై మోదీ గవర్నమెంట్‌ ఆన్‌ ఎన్పీఎస్‌’ శీర్షికన ప్రచురించింది. ‘కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన 9 లక్షల కోట్ల మొండి రుణాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను అంటే, 44.44 శాతం రుణాలను ఇటీవల ప్రవేశపెట్టిన ఐబీసీ విధానం ద్వారా మోదీ వసూలు చేశారు’ అని అందులో ఉంది. పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ను ఎక్కువగా నమ్ముకునే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఈ వార్తను పిక్‌ చేశాయి. షేర్‌ చేశాయి. నకిలీ వార్తల కేసులో పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ ఎడిటర్‌ మహేశ్‌ విక్రమ్‌ హెగ్డేను మార్చి 30వ తేదీన బెంగుళూరులో పోలీసులు అరెస్ట్‌ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం 9.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎక్కువగా పెరిగినది 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే.

ఏదైమైనా నాలుగు లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాలు వసూలయ్యాయంటే సాధారణ చార్టర్డ్‌ అకౌంటెంట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్‌బీఐ ప్రకటించిన డేటాను సేకరించేందుకు ప్రయత్నించగా, రాజ్యసభలో మార్చి నెలలోనే ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రసాద్‌ శుక్లా ఆర్‌బీఐ డేటాను వెల్లడించిన విషయం వెలుగుచూసింది. రిటెన్‌ ఆఫ్‌ చేసిన 2. 73 లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాల్లో 29, 343 కోట్ల రూపాయలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు. బ్యాంక్‌ రుణాల రైటాఫ్‌కు, రుణాల వేవర్‌కు తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా లేకుండా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తుంటాయి. రైటాఫ్‌ చేసిన రుణాలను వసూలు చేసేందుకు వివిధ రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. రైటాఫ్‌ చేసిన రుణాలను వసూలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ‘ఐబీసీ–2016’ విధానాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ నిరర్థక ఆస్తుల్లో వసూలు ఎప్పటిలాగే 10.77 శాతం మాత్రమే ఉందని శుక్లా వివరించారు.

తుది వివరణ కోసం ‘ఆల్టర్‌ న్యూస్‌’ రిపోర్టర్, కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తన వార్తను మీడియా తప్పుగా అర్థం చేసుకొందని చెప్పారు. ‘బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 50 శాతం ఆస్తులను ఐబీసీ పరిధిలోకి తెచ్చాం. 3.30 లక్షల కోట్ట రూపాయలను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగించాం, ట్రిబ్యునల్‌కు నివేదించడానికి ముందే 83,000 కోట్ల రూపాయలు సెటిల్‌ అయ్యాయి. వాటిని కలుపుకుంటే నాలుగు లక్షలు దాటుతుంది’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. వసూలైన 83వేల కోట్ల రూపాయలను వసూలుకాని రుణాలకు ఎందుకు కలుపుకోవాలో ఆయనకే తెలియాలి. ఈ అసలు వార్త అలా, అలా నకిలీ వార్తగా మారిపోయింది. ఎకనామిక్‌ టైమ్స్‌లాగానే శ్రీనివాస్‌ వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఫస్ట్‌పోస్ట్‌ పత్రికలు ప్రచురించినప్పటికీ వసూలైన మొత్తం కచ్చితంగా అంత ఉండదని సందేహం వ్యక్తం చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement