న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ లెక్కల ప్రకారం పీఎన్‌బీ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్‌బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్‌పీఏలుగా చూపించింది. దీంతో ఆర్‌బీఐ, పీఎన్‌బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్‌పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్‌బీ చూపగా, ఆర్‌బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి.
దీంతో నికర ఎన్‌పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్‌బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్‌బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్‌బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్‌బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్‌బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment