న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తాజాగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన వారిలో అత్యధిక శాతం మంది .. స్టోర్స్ విస్తరణలో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంలోని వారే కావడం గమనార్హం. ‘మరింత మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగానే కార్పొరేట్ స్వరూపంలో మార్పులు చేస్తున్నాం‘ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు.
భారత్‌కు కట్టుబడి ఉన్నాం..
హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని, వీటి నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా ఆరు బెస్ట్ ప్రైస్ హోల్‌సేల్ స్టోర్స్, ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు.. అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు అయ్యర్ చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలు అందించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.
అమెజాన్, జియోమార్ట్‌లతో పోటీ..
2014 జులైలో పుణె, హైదరాబాద్‌లో బెస్ట్ ప్రైస్ స్టోర్స్‌తో వాల్‌మార్ట్.. భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫార్మాట్ల ద్వారా విక్రయాలు జరుపుతోంది. 28 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి. 2018లో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా పోటీ సంస్థ అమెజాన్.. దూకుడుగా ముందుకెడుతోంది. ఫ్యూచర్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఇతరత్రా ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల్లోనూ వాటాలు దక్కించుకుంటోంది. మరోవైపు దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో మార్ట్ పేరిట నిత్యావసరాల ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది.
వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో వాల్‌మార్ట్
Published Tue, Jan 14 2020 6:19 AM | Last Updated on Tue, Jan 14 2020 6:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment