కొత్త ఏడాదిలో ఈ–ఎస్‌యూవీల జాతర...
ఈ–విటారాతో మారుతీ సుజుకీ అరంగేట్రం
జాబితాలో మహీంద్రా, టాటా, ఎంజీ, హ్యుందాయ్, టయోటా, బీవైడీ
ఆటో షోలో ఆవిష్కరణలకు రెడీ ∙భారత్‌లోకి తొలిసారి టెస్లా ఈవీలు!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.
గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్‌తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
ఆటో ఎక్స్‌పో వేదికగా...
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్‌తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది.
బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్‌యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.
టెస్లా వచ్చేస్తోంది...
భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment