ట్రంప్‌ రీఎంట్రీ..మార్కెట్‌ గతేంటి? | Trump re-entry, Impact On the Indian Market | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ రీఎంట్రీ..మార్కెట్‌ గతేంటి?

Nov 12 2024 4:21 AM | Updated on Nov 12 2024 4:21 AM

Trump re-entry,  Impact On the Indian Market

ట్రంప్‌ పాలసీలతో మన ఎకానమీకి ఇక్కట్లే... 

రూపాయి పతనం.. దిగుమతులు భారం 

ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం... వడ్డీరేట్ల కోత ఆశలపై నీళ్లు! 

మార్కెట్లో కొంతకాలం ఆటుపోట్లు తప్పవంటున్న విశ్లేషకులు

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ నినాదంతో ట్రంప్‌ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్‌ వరల్డ్‌ అన్‌–ప్రెడిక్టబుల్‌ అగైన్‌’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్‌ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్‌ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్‌ సెగలు తప్పవంటున్నారు!

అల్‌టైమ్‌ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్‌ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్‌ గేర్‌ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్‌ విక్టరీ కొట్టిన ట్రంప్‌.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్‌’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది 
ఆర్థిక వేత్తల అభిప్రాయం. 

మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... 
ట్రంప్‌ చెబుతున్నట్లుగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు దీనికి బ్రేక్‌ వేసే చాన్స్‌ ఉంటుంది. 

మరోపక్క, టారిఫ్‌ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్‌ ట్యాక్స్‌ కట్‌ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. 

అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్‌ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్‌కే వెల్త్‌ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్‌ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.

ట్రంప్‌ తొలి జమానాలో..
2017లో ట్రంప్‌ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్‌ మార్కెట్లో అలజడి, క్రూడ్‌ ధరల క్రాష్, గ్రీస్‌ దివాలా.. బ్రెగ్జిట్‌ ప్రభావాలతో స్టాక్‌ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్‌ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు  ట్రంప్‌ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్‌ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్‌ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్‌ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ  11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్‌బీఐ తాజా నివేదిక తెలిపింది!


ట్రంప్‌ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్‌ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్‌ హామీ మేరకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గిస్తే, యూఎస్‌ బాండ్‌ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. 
– నితిన్‌ అగర్వాల్,  క్లయింట్‌ అసోసియేట్స్‌ డైరెక్టర్‌ 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement