హారిస్ ఓటమికి మహిళల ప్రతీకారం
అమెరికాలో 4బీ ఉద్యమం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు.
ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది.
ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్‌లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది.
ఏమిటీ 4బీ ఉద్యమం?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment