సందర్భం
నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇంకా విచారణ ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలుసు. అన్ని ప్రజాస్వామిక దేశాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తయితే, అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా చూపే ప్రభావం మరొక ఎత్తు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుంది. 80 దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే పటిష్టమైన గూఢచార వ్యవస్థ ఉంది. రెండు దేశాల మధ్య ఎక్కడ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా జోక్యం ఉంటుంది. అలాంటి అమెరికాలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సహజం.
2025 జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన మంత్రివర్గ కూర్పులో నిమగ్నమయ్యారు. అమెరికాలో మంత్రి అనకుండా సెక్రటరీ అంటారు. ఏ సెక్రటరీ ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడికి పాలనలో తోడుంటారు. అలాంటివారు సమర్థులుగా, మంచి నడవడి కలవారుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఎంపిక చేసుకున్న కొందరిపై సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు.
పీట్ హేగ్సేత్:
ఫాక్స్ న్యూస్ ఛానల్ హోస్టుగా కనిపిస్తారు. ట్రంప్ విధేయుడు. అమెరికా మిలిటరీలో మధ్య తరగతి అధికారి. ప్రపంచ పోలీసుగా పిలువబడే అమెరికాకు ఎంతో ప్రాధాన్యం ఉన్న రక్షణ శాఖను ఈయనకు ఇస్తున్నారు. ఈయన తన ఒంటిపై ‘దావూస్ ఉల్ట్’(లాటిన్‌లో ‘దేవుడి ఇచ్ఛ’ అని అర్థం) అని టాటూ వేయించుకున్నారు. మత యుద్ధాల్లో తెల్ల తీవ్రవాది తిరగబడాలనీ, అది దేవుని నిర్ణయమనీ భావన. ఈయన లైంగిక దాడి కేసును ఎదుర్కొన్నారు. ట్రంప్ ‘కాపిటల్ దాడి’ని సమర్థిస్తారు. సైన్యంలో స్త్రీలు ఉండ కూడదంటారు.
మ్యాట్ గేట్జ్:
ఈయనను అటార్నీ జనరల్‌గా ప్రకటించారు. ఈయన ఒక పదిహేడేళ్ల అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నారనీ, మాదక ద్రవ్యాలు వినియోగించారనీ కేసులు ఉన్నాయి. ఈయన రోజూ ట్రంప్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొంటారు. ఎఫ్‌బీఐ, న్యాయ శాఖలనే రద్దు చేయాలంటారు. కాపిటల్ దాడిని సమర్థిస్తూ దానికి గర్వపడతానంటారు.
చదవండి: అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలు
తులసి గబ్బార్ద్:
ఈమెను డైరెక్టర్ అఫ్ నేషనల్ ఇంటలిజెన్స్‌గా నియమించనున్నారు. ఈమె గతంలో డెమోక్రాట్. 2020 అధ్యక్ష స్థానం కోసం పోటీ పడాలనుకుని ప్రైమరీల్లో ఓడిపోయారు. సుమారు ఇరవై ఏళ్ళు మిలిటరీలో పనిచేశారు. రష్యా సానుభూతిపరురాలు అని పేరు. సిరియా ప్రజలను ఊచకోత కోసిన అధ్యక్షుడు బషర్‌ను సమర్థిస్తారు. బషర్‌కు రష్యా మద్దతుంది. ఈమె పేరు చూసి కొందరు ఇండియన్ అనుకుంటున్నారు. కానీ ఈమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు.
క్రిస్టీ నోయెమ్:
ఈమెను హోమ్ ల్యాండ్ సెక్రటరీగా ఎంపిక చేశారు. అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత, వలసల నిరోధం లాంటివి పర్యవేక్షించాలి. ఈమె ట్రంప్ ప్రతిపాదించిన వలసవాదులను పంపించి వేయాలనే స్లోగన్‌ను బాగా సమర్థించారు. ఈమె రాసిన పుస్తకంలో– పెంపుడు కుక్క(పేరు క్రికెట్) తన ఆజ్ఞలను పాటించనందుకు చంపేయాల్సి వచ్చిందని రాస్తే పాఠకులు ఛీకొట్టారు. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటారామె.
చదవండి: వాస్తవాలను నిరాకరిస్తున్నామా?
రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్:
ఆరోగ్య మంత్రిగా ఎంపిక చేశారు. ఈయనకు టీకాలంటే అస్సలు గిట్టదు. ఔషధాల కంపెనీలంటే దురభిప్రాయం. పచ్చి ఆవుపాలు వాడటమే ఆరోగ్యమంటారు. పచ్చి పాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందనీ, వేడి చేసి వాడాలనీ ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్య మంత్రిగా ఈయన పేరు ప్రకటించగానే ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈయన అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, మధ్యలో విరమించుకుని ట్రంప్‌కు మద్దతిచ్చారు. ట్రంప్ తన మంత్రులుగా ఎంపిక చేసుకున్నవారిలో వీరు కొందరు. మరి ట్రంప్ పాలన ఎలా ఉండబోతున్నదో చూడాలి!
- డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి
రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ (అమెరికా నుంచి)
Comments
Please login to add a commentAdd a comment