impact India
-
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
UK Election Results 2024: భారత్‌పై ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్‌లో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్‌లు ఓటమి చవిచూసి లేబర్ పార్టీ గద్దెనెక్కడంతో ఈ అధికార మారి్పడి ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది. దానికి భారత వ్యతిరేక, పాక్ అనుకూల పారీ్టగా పేరుండటమే ఇందుకు కారణం. 1997లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భారత పర్యటనకు వచ్చారు. పాలక లేబర్ పార్టీ సలహా మేరకు ముందుగా పాకిస్తాన్లో ఆగడమే గాక, ‘ఇరు దేశాలూ కశీ్మర్‌పై విభేదాలను పరిష్కరించుకో’వాలని పాక్ గడ్డ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ నోటి దురుసు ప్రదర్శించడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. దీనిపై భారత్ భగ్గుమనడమే గాక, బ్రిటన్ను థర్డ్ రేట్ దేశంగా నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ ఛీత్కరించుకునేదాకా వెళ్లింది. ఉద్రిక్తతల నడుమ రాణి భారత పర్యటన మొక్కుబడిగా ముగిసింది. 2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ కశీ్మర్ సమస్యకు ఐరాస ఆధ్వర్యంలో రిఫరెండం నిర్వహించాలంటూ బ్రిటన్ పార్లమెంట్లో తీర్మానమే ప్రవేశపెట్టారు! దాంతో బ్రిటన్‌లో ప్రబల శక్తిగా ఉన్న భారతీయులు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పారీ్టకి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ఘోర ఓటమికి ఇది కూడా ముఖ్య కారణంగా నిలిచింది. పైగా ఆ పార్టీ నేతల్లో ఖలిస్తానీ సానుభూతిపరుల సంఖ్య ఎక్కువ. సారథిగా స్టార్మర్ రాకతో చాలా సానుకూల మార్పు వచి్చందంటున్నారు. ఎన్నికల్లో బ్రిటిష్ ఇండియన్ల మద్దతు కోసం ఆయన పలు చర్యలు చేపట్టారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. పారీ్టలోని ఖలిస్తానీ అనుకూల నేతల ప్రాధాన్యాన్ని బాగా తగ్గించారు. ‘‘భారత్‌తో సన్నిహిత సంబంధాలే మా ప్రాథమ్యం. హిందూఫోబియాకు బ్రిటన్‌లో ఏ మాత్రమూ స్థానం లేదు. వాణిజ్యంలోనే గాక పర్యావరణ, భద్రత వంటి పలు రంగాల్లో భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పని చేస్తాం’’ అని ప్రధానిగా తొలి ప్రసంగంలో స్టార్మర్ ప్రకటించారు. -
ట్రంప్ విజయం భారత్‌పై భారీగానే ఎఫెక్ట్!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం దాదాపు ఏడాదిన్నర సాగిన ప్రచారానికి తెరపడింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యానికి 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీక్లింటన్ను వెనక్కి నెట్టేసి ఆయన ముందంజలో నిలిచారు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు, భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంచనాలు ప్రారంభమయ్యయి. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ట్రంప్ గెలుస్తాడన్నీ అసలు ఊహించకపోవడంతో, హిల్లరీ గెలుపు ఆశావహంతోనే నడుస్తూ వచ్చాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా అమెరికా ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. దీంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 1700 పాయింట్లు పడిపోయింది. గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్‌తో ఉన్న ట్రేడ్ డీల్స్‌పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్‌ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్‌ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ట్రంప్ పాలసీలకు మొదటి బాధితులుగా మిగలనున్నాయి. ట్రంప్ ప్రచారం చాలామటుకు అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగా సాగింది. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తన్నుకు పోతున్నారని, వాటిని అరికడతామని హెచ్చరికలు చేశారు. మళ్లీ అమెరికా ఉద్యోగాలు అమెరికాకు తేస్తామని, భారత్ నుంచి వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ట్రంప్ గెలుపుతో భారత్‌కు నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కఠినతరమైన ఇమిగ్రేషన్ రూల్స్‌ను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నప్పటికీ, మరోవైపు భారత విద్యార్థుల, వ్యాపారస్తుల మనసులు గెలుచుకోవడంలో కృషిచేస్తూనే ఉన్నారు. చైనాకు ఆయన పూర్తిగా విరుద్ధం కాబట్టి అది భారత్‌కు అనుకూలంగా మారనుంది. ఒకవేళ చైనా ట్రేడ్ అగ్రిమెంట్లకు సహకరించపోతే, చైనా కరెన్సీ మానిప్యూలేటర్కు పాల్పడుతుందని నిందవేస్తూ, అత్యధిక మొత్తంలో పన్ను విధించనున్నట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్‌ను కూడా ఉగ్రవాద సహకార దేశంగా ముద్రవేయడానికి ట్రంప్ వెనుకాడరని అర్థమవుతోంది. ఉగ్రవాదంపై ట్రంప్ తీసుకునే చర్యలు, ఇండో-పాక్ రక్షణ సంబంధాలను మెరుగుపరుస్తాయని కొందరు పేర్కొంటున్నారు.