ట్రంప్ విజయం భారత్పై భారీగానే ఎఫెక్ట్!
ట్రంప్ విజయం భారత్పై భారీగానే ఎఫెక్ట్!
Published Wed, Nov 9 2016 12:29 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికా అధ్యక్ష పీఠం కోసం దాదాపు ఏడాదిన్నర సాగిన ప్రచారానికి తెరపడింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యానికి 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీక్లింటన్ను వెనక్కి నెట్టేసి ఆయన ముందంజలో నిలిచారు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు, భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంచనాలు ప్రారంభమయ్యయి. భారత్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ట్రంప్ గెలుస్తాడన్నీ అసలు ఊహించకపోవడంతో, హిల్లరీ గెలుపు ఆశావహంతోనే నడుస్తూ వచ్చాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా అమెరికా ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. దీంతో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 1700 పాయింట్లు పడిపోయింది.
గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్తో ఉన్న ట్రేడ్ డీల్స్పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ట్రంప్ పాలసీలకు మొదటి బాధితులుగా మిగలనున్నాయి. ట్రంప్ ప్రచారం చాలామటుకు అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగా సాగింది. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తన్నుకు పోతున్నారని, వాటిని అరికడతామని హెచ్చరికలు చేశారు. మళ్లీ అమెరికా ఉద్యోగాలు అమెరికాకు తేస్తామని, భారత్ నుంచి వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా హెచ్చరించారు.
ట్రంప్ గెలుపుతో భారత్కు నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కఠినతరమైన ఇమిగ్రేషన్ రూల్స్ను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నప్పటికీ, మరోవైపు భారత విద్యార్థుల, వ్యాపారస్తుల మనసులు గెలుచుకోవడంలో కృషిచేస్తూనే ఉన్నారు. చైనాకు ఆయన పూర్తిగా విరుద్ధం కాబట్టి అది భారత్కు అనుకూలంగా మారనుంది. ఒకవేళ చైనా ట్రేడ్ అగ్రిమెంట్లకు సహకరించపోతే, చైనా కరెన్సీ మానిప్యూలేటర్కు పాల్పడుతుందని నిందవేస్తూ, అత్యధిక మొత్తంలో పన్ను విధించనున్నట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్ను కూడా ఉగ్రవాద సహకార దేశంగా ముద్రవేయడానికి ట్రంప్ వెనుకాడరని అర్థమవుతోంది. ఉగ్రవాదంపై ట్రంప్ తీసుకునే చర్యలు, ఇండో-పాక్ రక్షణ సంబంధాలను మెరుగుపరుస్తాయని కొందరు పేర్కొంటున్నారు.
Advertisement