
ఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఈ రోజు(గురువారం) హెగ్సే కు ఫోన్ చేసి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్ .
ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే చరిత్ర ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు తెలిపారు రాజ్ నాథ్. దీనిలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలను తాము మద్దతిస్తామన్నారు హెగ్సే. ఉగ్రవాదంపై భారత్ కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని హెగ్సే పేర్కొన్నారు. భారత్ కు అమెరికా అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.
Secretary Hegseth said that the U.S.…— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025
పాకిస్తాన్ కవ్వింపు చర్యలు..
కాగా, నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్‌వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్‌ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.
మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్‌ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.
పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. దీన్ని భారత్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.