
ప్రముఖ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్‌కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్‌మార్ట్ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్‌లో నిలిచారు. వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.
వాల్టన్‌కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్ పెయింటింగ్‌ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్‌లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్‌లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్
ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్ విక్టరీ ఫండ్‌కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.