richest woman
-
సంపదలో తగ్గేదేలే అంటున్న ధీరవనితలు వీళ్లే!
-
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ పోటీ!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలో అత్యంత ధనిక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేస్తున్న దేశంలోనే అత్యంత మహిళా సంపన్నురాలు ఎవరు?హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..హిసార్ ప్రజలు నా కుటుంబ సభ్యులు.నా భర్త ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. జిందాల్ కుటుంబం ఎప్పుడూ హిస్సార్‌కు సేవ చేస్తూనే ఉంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పూర్తిగా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా అని అన్నారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీసావిత్రి జిందాల్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి,హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. మీ అబ్బాయి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు. మీరు అదే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ రెబల్ అభ్యర్థిగా మారారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదు. బీజేపీ సభ్యత్వం తీసుకోకుండానే నా కుమారుడు నవీన్ జిందాల్ తరుఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశాను’అని గుర్తు చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ 2005,2009లలో హిసార్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. 2013లో సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్,ఆమె కుమారుడు నవీన్ జిందాల్ పార్టీని వీడారు.నవీన్ జిందాల్ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా జాబితాలోకాగా, సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 29.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చోటు సంపాదించారు -
ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్!
ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.57267.9 కోట్లు నష్టపోయిందన్నమాట. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం ఏ బిలినీయర్ కూడా నష్టాన్ని చూడలేదని స్పష్టం చేసింది. ఇంత మొత్తంలో నష్టాన్ని చవి చూయినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతోంది. క్షీణత తర్వాత ఆమె ప్రస్తుత నికర విలువ 80.5 బిలియన్ డాలర్లు. 2008 నుంచి ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ ఎప్పుడూ తగ్గలేదని, నిన్న (శుక్రవారం) మాత్రమే కంపెనీ షేర్స్ ఏకంగా 7.5 శాతం తగ్గడం వల్ల వేలకోట్లు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని సమాచారం. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. 1909లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తాత 'యూజీన్ షుల్లెర్' (Eugene Schueller) ప్రారంభంలో హెయిర్ కలర్ ఉత్పత్తి చేసి విక్రయించడానికి సంస్థ స్థాపించారు. అదే నేడు మేయర్స్ సారథ్యంలో వేలకోట్ల కంపెనీగా అవతరించింది. బెటెన్‌కోర్ట్ మేయర్స్‌ను ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా నిలిచేలా చేసింది. -
ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళ.. ఆమెనేనా?
ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద 2023 డిసెంబర్ 28 నాటికి 100.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం ఈమె ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచింది. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో కంపెనీ విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. మహమ్మారి తగ్గుముఖం పట్టాక అమ్మకాల వేగం బాగా పెరిగింది. 2017లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా నిలిచింది. ఇదీ చదవండి: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం! బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి పెద్దగా ఆడంబరమైన జీవితాన్ని కోరుకోదని తెలుస్తోంది. ఈమె ఫైవ్ వ్యాల్యూ స్టడీ ఆఫ్ ది బైబిల్ (Five volume study of the Bible), గ్రీకు దేవతల వంశావళి అనే రెండు పుస్తకాలూ రాశారు. ఈమె ప్రతిరోజు పియానో వాయించడం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు సమాచారం. -
ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!
Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్‌సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్‌పై దృష్టి సారించి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్చే స్థాపించిన్ హెచ్సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్‌సిఎల్ చైర్పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు. కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్‌ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. -
పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే..?
Pakistani Film Actress Sangeeta: పాకిస్థాన్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలిసింది. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో 'సంగీత' ఒకరు. ఈమె ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అత్యంత ధనిక హిందూ మహిళ కావడం విశేషం. ఇంతకీ సంగీత ఎవరు? ఆమె సంపాదన ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన వేళ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో అత్యంత ధనిక హిందువు 'దీపక్ పెర్వానీ' అనే ఫ్యాషన్ డిజైనర్ కాగా, ధనిక హిందూ మహిళగా 'సంగీత' రికార్డ్ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం. సంగీత పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఈమెను 'పర్వీన్ రిజ్వీ' (Parveen Rizvi) అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతి రేఖంగా ఉండటం వల్లే పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకుంది. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం సాగిస్తోంది. కాగా ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) పర్వీన్ రిజ్వీ కేవలం నటి మాత్రమే కాదు, చిత్ర దర్శకురాలు కూడా. ఈమె కోహ్-ఎ-నూర్ అనే సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేసినప్పటికీ.. తన 21 ఏట నుంచి ఈ రంగంలో మరింత దృఢంగా నిలదొక్కుకోగలిగింది. నికాహ్, ముత్తి భర్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఒక పాపులర్ నటిగా గుర్తింపు పొందగలిగింది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి 'జియా ఖాన్'కు అత్త. సంగీత సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అనే విషయం ఖచ్చితంగా అందుబాటులో లేదు, కానీ ఈమె ఏడాదికి సుమారు రూ. 39 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదన అంతకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్‌కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆమె నెట్‌వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్‌లో వెబ్‌స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్‌లను అందించింది. దీని పోర్ట్‌ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?
Jayshree Ullal: ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి, ఆయన నికర ఆస్తులను గురించి గతంలోనే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సత్య నాదెళ్ల ఆస్తి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు కలిగిన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ సంతతికి చెందిన 'జయశ్రీ ఉల్లాల్' యూకేలో జన్మించినా ఢిల్లోలో పెరిగింది. కావున ఈమె ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత, ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళింది. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తరువాత శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఆమె అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్‌లో ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉంగర్మాన్ బాస్‌లో నాలుగు సంవత్సరాలు గడిపింది. ఆ తరువాత కొన్ని రోజులకే క్రెసెండో కమ్యూనికేషన్స్‌లో చేరింది. చివరికి సిస్కో ఉద్యోగిగా మారింది. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సిస్కో కంపెనీలో ఉన్నతమైన స్థానాన్ని పొందింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి అరిస్టా నెట్వర్క్స్కు ప్రెసిడెంట్‌గా మాత్రమే కాకుండా సీఈఓగా కూడా పనిచేశారు. వ్యక్తిగత సంపద విషయంలో ఈమె భారతదేశంలో అత్యంత ధనికురాలు. సంపద విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల కంటే ముందు ఉండటం గమనార్హం. జయశ్రీ ఉల్లాల్ సిబెడ్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన 'విజయ్ ఉల్లాల్'ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో తమ ఇద్దరి కుమార్తెలతో ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 3.4 లక్షల కోట్లు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నికర విలువ రూ.6200 కోట్లు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
LeenaTewari:దేశంలో రెండో సంపన్న మహిళ: పాములు, బల్లులంటే పిచ్చి...!
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త లీనా తివారీ ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానాన్ని సాధించారు. తాజా నివేదికల ప్రకారం రూ. 30,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన భారతదేశపు రెండవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. వ్యాపార మహిళా దిగ్గజాలు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా, నైకా ఫౌండర్, ఫల్గుణి నాయర్, జోహో కార్ప్‌కి చెందిన రాధా వెంబు వంటి వారి కంటే లీనా తివారీ ముందుకు దూసుకొచ్చారు. ఫిబ్రవరి 12, 2023న నాటి ఫోర్బ్స్ వివరాల ప్రకారం ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి సంస్థ యుఎస్వీ ఇండియా ఛైర్మన్ లీనా గాంధీ తివారి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30వేల కోట్ల పైన)ను అధిగమించి భారతదేశంలో రెండో అత్యంత సంపన్న మహిళగా ఉండగా, రాజకీయవేత్త , వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ తర్వాత టాప్-1లో అన్నారు. అలాగే రూ. 21కోట్ల విరాళాలతో 2022లో భారతదేశపు అత్యంత ఉదారమైన మహిళగా లీనా తివారి నిలిచారు. కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగాలలో భారతదేశంలోని మొదటి ఐదు స్థానాల్లో కంపెనీ ఉంది. ఇది క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాలు (APIలు), ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది.యూస్వీకి చెందిన గ్లైకోమెంట్ అని యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్ 3లో ఉంది. 1961లో విఠల్ బాల కృష్ణ గాంధీ యుఎస్వీని స్థాపించారు అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు మహిళల,వారి హక్కులను గౌరవించే సంస్థగా పేరొందింది. తివారీ ఎక్కువగా ముంబైలోని సోషల్ సర్క్యూట్, పార్టీలకు దూరంగా ఉంటారు కానీ పరోపకారి అని ఫార్చ్యూన్ పేర్కొనడం గమనార్హం. యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్ చదివారు. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ బాగా పాపులర్ అయింది. అలాగే బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త జుహీ చావ్లా తివారీ ఇద్దరూమంచి స్నేహితులు కూడా. జంతువులు, అడవులంటే ఇష్టపడే లీనాకు పాములన్నా, బల్లులన్నా పిచ్చి అట. బాలికలకు అకడమిక్, డ్యాన్స్ , కంప్యూటర్ శిక్షణను డాక్టర్ సుశీల గాంధీ సెంటర్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్‌కి లీనా సాయం చేస్తారు. లీనా భర్త యూఎస్వీ ఎండీ ప్రశాంత్ తివారీ. వీరి కుమార్తె అనీషా గాంధీ తివారీ.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్డీ చేసిన అనిషా ఆగస్టు 2022లో యూఎస్వీ బోర్డులో చేరడం విశేషం. -
సావిత్రీ జిందాల్..: ఆసియాలోకెల్లా సంపన్నురాలు
న్యూఢిల్లీ: జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రీ జిందాల్ (72) ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలోని అతి పెద్ద రియల్టీ దిగ్గజం కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ కో చైర్పర్సన్ యాంగ్ హుయాన్ (41) మూడో స్థానానికి పడిపోయారు. చైనాకే చెందిన మరో వ్యాపార దిగ్గజం ఫాన్ హాంగ్‌వియ్ (55) రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల తాజా సూచీ ఈ మేరకు పేర్కొంది. జిందాల్, ఫాన్ నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు (రూ.89,490 కోట్లు) కాగా యాంగ్ సంపద 11 బిలియన్ డాలర్లకు (రూ.87,114 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 23.7 బిలియన్ డాలర్లున్న యాంగ్ సంపద విలువ చైనా రియల్టీ సంక్షోభానికి అద్దం పడుతూ ఏడు నెలల్లోనే 50 శాతానికి పైగా పడివడం గమనార్హం! ఆమె సంపద ఒక దశలో ఒక్క రోజులోనే 100 కోట్ల డాలర్ల మేరకు హరించుకుపోయింది! కరోనా నేపథ్యంలో సావిత్రీ జిందాల్ ఆస్తులు కూడా విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2020 ఏప్రిల్‌లో ఏకంగా 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రెండేళ్లలో 15.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2005లో భర్త ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రి పదో స్థానంలో ఉన్నారు. సాధికారతకు ప్రతిరూపం 72 ఏళ్ల సావిత్రీ జిందాల్ మహిళా సాధికారతకు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఆమె 1950 మార్చి 20న అసోంలోని తిన్సుకియా పట్టణంలో జన్మించారు. 1970లో ఓపీ జిందాల్‌ను పెళ్లాడారు. 50 ఏళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్‌లో బకెట్ల తయారీ ప్లాంటుతో కెరీర్ మొదలు పెట్టిన ఓపీ జిందాల్ కొన్నేళ్లలోనే దాన్నో భారీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు. భర్త మరణానంతరం 2005లో సంస్థ పగ్గాలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆయన రాజకీయ వారసత్వాన్నీ కొనసాగించారు. హిస్సార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హరియాణా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె సారథ్యంలో కంపెనీ నికర విలువ ఏకంగా నాలుగింతలు పెరిగింది. అయితే స్టీల్, సిమెంటు, ఇంధన, ఇన్ఫ్రా వంటి పలు రంగాల్లో విస్తరించిన జిందాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్న సావిత్రి కాలేజీ చదువు కూడా చదవకపోవడం విశేషం. జిందాల్స్ది పక్కా సంప్రదాయ కుటుంబం కావడంతో భర్త ఉండగా ఎన్నడూ తెరపైకి రాకుండా గడిపారామె! కనీసం భర్తను ఎన్నడూ ఎంత సంపాదిస్తున్నారని కూడా అడిగి ఎరగనంటారు! జిందాల్ కుటుంబంలో మహిళలు పెద్దగా బయటికే రారని 2010లో ఫోర్బ్స్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి స్వయంగా చెప్పారు కూడా. ‘‘మా కుటుంబంలో బయటి పనులన్నీ మగవాళ్లే చూసుకుంటారు. ఆడవాళ్లం ఇంటి బాధ్యతలకు పరిమితమవుతాం. మా ఆయన ఉండగా నేనెప్పుడూ కనీసం (స్థానిక) హిస్సార్ మార్కెట్‌కు కూడా వెళ్లింది లేదు! మార్కెట్లో ఉండేవాళ్లంతా మా బంధువులేనని, పైగా నాకంటే పెద్దవాళ్లని మా ఆయన చెబుతుండేవారు. మా కుటుంబంలో మహిళలు పెద్దలతో మాట్లాడకూడదన్నది ఓ మర్యాద’’ అని వివరించారు. కంపెనీ వ్యాపార బాధ్యతలను కుమారులు పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్ జిందాల్ చూసుకుంటారు. భర్త మాదిరిగానే ఆమె కూడా సామాజిక కార్యకలాపాల్లో నిత్యం చురుగ్గా ఉంటారు. ఫ్యాక్టరీలు పెట్టిన ప్రతి చోటా విధిగా స్థానికుల కోసం స్కూలు, ఆస్పత్రి కూడా స్థాపించడం జిందాల్స్ పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. తమ కంపెనీల్లో పని చేసేవాళ్లు కూడా కుటుంబంలో భాగమేనన్న ఓపీ జిందాల్ ఫిలాసఫీని సావిత్రి కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటారు. యాంగ్ అలా... మరోవైపు ఐదేళ్ల పాటు ఆసియా సంపన్న మహిళల్లో టాప్‌గా నిలిచిన 41 ఏళ్ల యాంగ్ మాత్రం సావిత్రికి భిన్నంగా లో ప్రొఫైల్‌లో గడుపుతుంటారు. ఇంతటి సోషల్ మీడియా యుగంలోనూ కనీసం ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్లో పెద్దగా అందుబాటులో లేవంటే యాంగ్ది ఎంతటి ప్రైవేట్ జీవితమో అర్థం చేసుకోవచ్చు. -
కలిసొచ్చిన అదృష్టం: ఆసియా రిచెస్ట్ విమెన్‌గా సావిత్రి జిందాల్ రికార్డు
సాక్షి, ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌ను స్థానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ మేజర్ వాటాదారురాలైన యాంగ్ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రినుంచి యాంగ్, భర్త అకాలమరణంతో సావిత్రి జిందాల్) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను చేపట్టడం విశేషం. 11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డాలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్ డాలర్లతో దేశంలో టాప్-10లో ఉన్న ఏకైక మహిళ కూడా. 2005లో భర్త ఓం ప్రకాష్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు పగ్గాలను చేపట్టవలసి వచ్చింది. ఆమె నాయకత్వంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్‌లో 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్ నాటికి 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆమె ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదని చెబుతారు. అయినప్పటికీ జిందాల్ గ్రూపు వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 13 మహిళా బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. కాగా 1950లో మార్చి 20న అస్సాంలోని టిన్సుకియా పట్టణంలో జన్మించిన సావిత్రి 1970లలో ఓపీ జిందాల్‌ను వివాహం చేసుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో హర్యానా మంత్రిగా కూడా సావిత్రిజిందాల్ పాపులర్. హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా 2005లో చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో తన తండ్రి వాటాను వారసత్వంగా పొంది ఈ గ్రహం మీద ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. 20215 దాదాపు 24 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ మహిళగా నిలిచింది. అయితే గత ఐదేళ్లుగా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిన యాంగ్ సంపద ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్‌లో టాప్‌ర్యాంక్‌ను కోల్పోయారు. 2005లో యాంగ్ తండ్రి వాటాను వారసత్వంగా స్వీకరించి ఈ గ్రహం మీద అత్యంత ధనవంతురాలైన పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. -
రాణిగారి కన్నా ఏం తక్కువ
సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్ మీడియా! ఎలిజబెత్ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది. ఇన్ఫోసిస్ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్ ఇండియాలోనే ‘హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్’కి టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్ వర్కర్. కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్ టీచర్. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్ చైర్మన్. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది. ∙∙ అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్మేట్స్. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘క్యాటమరాన్ వెంచర్స్’ ఆస్తులు, ఇన్ఫోసిస్ లో ఆమెకు ఉన్న షేర్లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ∙∙ ‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి. తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు. -
సంపన్న మహిళల్లో రోష్ని నాడార్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద రూ. 54,850 కోట్లు. రూ. 36,600 కోట్ల సంపదతో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా రెండో స్థానంలోనూ, రూ. 11,590 కోట్లతో రాధా వెంబు (జోహో) మూడో స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించి 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌కి సంబంధించి ఏకంగా నలుగురు ఉన్నారు. లిస్టులోని మహిళల సంపద సగటు విలువ సుమారు రూ. 2,725 కోట్లు. కనీసం రూ. 100 కోట్ల సంపద గలవారిని జాబితాలో పరిగణనలోకి తీసుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో (వెల్త్ మేనేజ్మెంట్) ఓషర్యా దాస్ తెలిపారు. అత్యధికంగా ముంబైలో 32 మంది, న్యూఢిల్లీలో 20, హైదరాబాద్‌లో 10 మంది సంపన్న మహిళలు ఉన్నారు. -
రికార్డు సృష్టించిన మెకంజీ స్కాట్
సాక్షి,న్యూఢిల్లీ: మెకంజీ స్కాట్ (50) ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా ఘనతను దక్కించుకున్నారు. అమెజాన్ షేర్లు లాభాలతో మాకెంజీ ధన వంతుల జాబితాలో టాప్ లోకి దూసుకొచ్చారు. స్కాట్ నికర విలువ ఇప్పుడు 68 బిలియన్ డాలర్లుకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం దాత, రచయిత్రి, మెకంజీ ప్రపంచ ధనిక మహిళగా నిలిచారు. లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ను అధిగమించారు. (అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్) 2019లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తో విడాకుల పరిష్కారం సందర్భంగా స్కాట్ అమెజాన్ షేర్లలో 35 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 4 శాతం వాటాను అందుకున్నారు. తాజాగా అమెజాన్ షేర్ విలువ భారీగా పెరగడంతో మెకంజీ స్కాట్ సంపద పుంజుకుంది. దీంతో ఆమె ప్రపంచంలో12వ సంపన్నురాలుగా నిలిచారు. కాగా ఇప్పటికే 116 సంస్థలకు దాదాపు 1.7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు స్కాట్ జూలైలో ప్రకటించారు. గత మూడు నెలల్లో అమెజాన్ స్టాక్ సుమారు 28శాతం పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 90శాతం కంటే ఎక్కువ పెరిగింది. దీంతో బెజోస్ సంపద 202 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో అపర కుబేరుడిగా బెజోస్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఈ వారం ప్రారంభంలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమి
చండీగఢ్:దేశంలో అత్యంత సంపన్నురాలిగా పేరుగాంచిన సావిత్రి జిందాల్‌కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది.కాంగ్రెస్ పార్టీ తరపున హిసార్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సావిత్రి ఓటమిపాలయ్యారు. 2005, 2009 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టిన సావిత్రికి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశలు అడియాశలయ్యాయి. ఆమె 13 వేలకు పైగా ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడారు. వేల కోట్ల రూపాయల ఓపీ జిందాల్ గ్రూప్‌నకు సావిత్రి చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్‌కు తల్లి. -
సామాన్యుల చెంతకు.. సంపన్నురాలు
హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలు. కార్పొరేట్ దిగ్గజం, రాజకీయ వేత్త నవీన్ జిందాల్‌కు స్వయానా తల్లి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. అయితేనేం ఓట్ల కోసం ఓ సామన్య పౌరురాలిగా రోడ్ల వెంటపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఆమే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్. హిసార్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న సావిత్రి జిందాల్ 64 ఏళ్ల వయసులోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే సావిత్రి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. ఉపన్యాసాలు పెద్దగా ఇవ్వకుండా తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరో అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. హిసార్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సావిత్రి హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వందమంది జాబితాలో సావిత్రి కూడా ఉన్నారు.