రోజుకు నాలుగు కోట్ల రూపాయలతో అత్యంత సంపన్న మహిళగా రికార్డు
బ్రిటీష్ ప్రధానమంత్రి కంటే డెనిస్ కోట్స్ జీతం 3,126 రెట్లు ఎక్కువ
కానీ పేదల పొట్టకొడుతోందంటూ విమర్శలు
మనీలాండరింగ్ ఆరోపణలు
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్‌లలో 150 మిలియన్ పౌండ్‌లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.
57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.
ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్‌లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు.
మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది.
కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
విమర్శలు, వివాదాలు
అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.
మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment