
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్‌లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.
చైనాలోని గుయ్‌లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.
రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!.
ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..
రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్‌షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.
తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్‌నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది.
గిన్నిస్‌లోనూ చోటు!
ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు.
దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు.
(చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..)
Comments
Please login to add a commentAdd a comment