సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సకాలంలో జరుగుతాయా.. లేదా..? అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది. వార్డుల పునర్విభజన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని మంగళవారం హైకోర్టు తీర్పునివ్వడమే దీనికి కారణం.
ప్రస్తుత పాలక మండలి గడువు డిసెంబర్ 3తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. వార్డుల జనాభా మధ్య వ్యత్యాసం పది శాతానికి మించకూడదని, ప్రస్తుతం గ్రేట ర్‌లోని కొన్ని వార్డుల్లో 90 వేలకు పైగా జనాభా ఉండగా, మరికొ న్ని వార్డుల్లో 20 వేలే ఉందని... దీనివల్ల అభివృద్ధిలో భారీ తేడా కనిపిస్తోందని ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవో 570 ప్రకారం 2011 జనాభా లెక్కల మేరకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇబ్బంది లేదు...
వాస్తవానికి జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల వాతావరణం లేదు. ఒక వేళ నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించా లన్నా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది లేదని... హైకోర్టు తీర్పు మేరకు వార్డుల పునర్విభజనకు దాదాపు రెండు నెలల సమయం సరిపోతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గరిష్టంగా అక్టోబర్‌లోగా వార్డుల విభజన పూర్తి చేయవచ్చు. దాంతోపాటే బీసీల గణన కూడా పూర్తి కావాల్సి ఉంది. దానికి అదనంగా మరో నెల సమయం తీసుకున్నా నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికలు జరిగేందుకు ఆటంకాలు ఉండకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటందన్నదే ఆసక్తికరంగా మారింది.
ఉనికి కోసం టీఆర్‌ఎస్ ఆరాటం
టీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీలో ఉనికే లేదు. గ్రేటర్‌లో జెండా ఎగురవేయాల నేది ఆ పార్టీ యోచన. ఇందులో భాగంగా వివిధ పార్టీల నుంచి వచ్చే కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వంటి వారికి స్వాగతం పలుకుతోంది. నగర రాజకీయాల్లో ప్రభావం చూపగల కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కార్పొరేటర్ల స్థాయి వారు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. త్వరలో జరిగే టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో ఈ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. వీటన్నిటినీ బే రీజు వేసుకొని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయమై టీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మూడు కార్పొరేషన్లు...
మరో వైపు జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక వేళ విభజించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకనుగుణంగా వార్డుల పునర్విభజన ఉండాలి.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి. కోర్టు తీర్పు మేరకు వార్డుల మధ్య పదిశాతం జనాభా కంటే ఎక్కువ తేడా ఉండకూడదంటే అందుకనుగుణంగా విభజించాలి. గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్‌గా ఉన్నా.. లేక మూడుగా విభజించినా దీన్ని అమలు చేయాల్సిందే. పాతబస్తీలోని వార్డులతో హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది ఎంఐఎం డిమాండ్. ఈ విషయంలో టీఆర్‌ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశమైంది.
ఏది మేలు?
గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్‌గా ఉంటే మేలా? లేక మూడు నాలుగు కార్పొరేషన్లుగా ఉంటే ప్రయోజనమా? అన్న దానిపైనా చర్చలు సాగుతున్నాయి. గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్‌గా ఉంటే.. ఫ్లై ఓవర్లు, అధునాతన రహదారులు వంటి భారీ ప్రాజెక్టులకు వీలుంటుందని.. ఆదాయంలో ప్రాంతాల మధ్య అసమానతలున్నప్పటికీ, భారీ ప్రాజెక్టులకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఎక్కువ కార్పొరేషన్లు ఉంటే.. అధికార వికేంద్రీకరణతో ప్రజలకు సౌలభ్యంగా ఉంటుం దని భావిస్తున్నారు. ఇలా ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చ సాగుతోంది. వార్డుల విభజన జరిగితే దానితో పాటు ప్రసాదరావు కమిటీ సిఫారసులు అమలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 18 సర్కిళ్లను 30గా మార్చాలనేది ప్రసాదరావు కమిటీ ప్రధాన సిఫారసు.
అందరి చూపూ గ్రేటర్‌పైనే..
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలూ జీహెచ్‌ఎంసీ పైనే కన్నేశాయి. ఓ రాష్ట్రంతో సరిసమానమైన హైదరాబాద్‌లో పార్టీ పగ్గాలు పట్టాలనేది టీఆర్‌ఎస్ లక్ష్యం. ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయిన తమకు గ్రేటర్‌లో తగినన్ని సీట్లు రాకుంటే పార్టీ ఉనికికే ప్రమాదమనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎలాగైనా నగరంలో తమ పట్టు నిలుపుకోవాలనేది ఎంఐఎం వ్యూహం. టీడీపీ, బీజేపీలు నగరంలో సత్తా చాటుతామని చెబుతున్నాయి.
ప్రస్తుతం టీడీపీకి శివారుల్లో ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి బలాన్ని ఆసరా చేసుకొని గ్రేటర్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తరహాలోనే టీడీపీ-బీజేపీ జతకడితే జీహెచ్‌ఎంసీలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోగలమన్నది ఆ రెండు పార్టీల యోచన . గ్రేటర్ ఎన్నికలపై రెండు పార్టీల మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఎంఐఎం-కాంగ్రెస్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కూటమిగా ఉన్నాయి. ఇవి అదే బంధాన్ని కొనసాగిస్తాయా.. లేక ఎంఐఎం అధికార టీఆర్‌ఎస్‌తో జత కడుతుందా అన్నది వేచి చూడాలి.
ఢీలిమిటేషన్ తరువాతే....
Published Wed, Aug 6 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement