
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎట్టకేలకు మూడు దశాబ్దాల తర్వాత నగరంలో పోలీస్‌స్టేషన్ల పునర్విభజన జరిగింది. మొదట్లో 1898లో నెల్లూరు నగరంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. తర్వాత 1970లో మరో మూడు పోలీస్‌స్టేషన్లు ఏర్పడ్డాయి. అప్పటికి నెల్లూరు జనాభా 65 వేలు మాత్రమే. ఆ తర్వాత 1990 నుంచి 1992 మధ్య ఐదు, ఆరు టౌన్ల పోలీస్‌స్టేషన్లు ఏర్పడ్డాయి. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత నగరంలోని పోలీస్‌స్టేషన్ల పునర్విభజనతో పాటు స్టేషన్ల పేర్లు, సరిహద్దులు, పరిధిని పెరిగిన జనాభా, పెరిగిన సరిహద్దుల విస్తీర్ణానికి అనుగుణంగా మార్చారు. దీంతో నెల్లూరు నగరంలో వన్ టౌన్, టూ టౌన్ స్టేషన్లుగా కాకుండా ప్రాంతాల పేర్లతో పనిచేయనున్నాయి. స్టేషన్ల భౌగోళిక హద్దులతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదుల్లో కూడా స్టేషన్ల పేర్లు మారనున్నాయి.
రేపట్నుంచి అమలు
నగరంలో 8 లక్షల జనాభా, 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తరించింది. ఆరు పోలీస్‌స్టేషన్లను పునర్విభజన చేస్తూ జీఓ ఎమ్మెస్ నంబర్ 48ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ గురువారం నుంచి నగరంలో అమల్లోకి రానుంది. నగరంలో కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో జనాభా సంఖ్య, నేరాల సంఖ్య తక్కువగా ఉండగా, మరికొన్ని పోలీస్‌స్టేషన్లలో అత్యధికంగా ఉండటంతో శాంతిభద్రతలను పరిరక్షించడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది కొరత ఉన్నా, కొత్తగా పెంచే అవకాశాల్లేవు. దీంతో స్టేషన్ల హద్దులకు మార్పులు, చేర్పులు చేసి ఎక్కువ పరిధి ఉన్న స్టేషన్లను కొంత తగ్గించి ఇతర పోలీస్‌స్టేషన్లలో ఆ ప్రాంతాలను విలీనం చేస్తూ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
పేర్లు, పరిధుల మార్పు ఇలా..
♦ నెల్లూరు ఒకటో నగర పోలీస్‌స్టేషన్ పేరును చిన్నబజార్ పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని పుత్తా ఎస్టేట్స్, పరమేశ్వరినగర్, రాజీవ్‌గృహకల్ప, నాలుగో నగర పీఎస్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, ఫతేఖాన్‌పేట, అరవిందనగర్, జూబ్లీ హాస్పిటల్, మద్రాస్ బస్టాండ్, ముత్తుకూరు బస్టాండ్ ఈ పీఎస్ పరిధిలో కలిశాయి.
♦ నెల్లూరు రెండో నగర పీఎస్ పేరును నవాబుపేట పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, పరమేశ్వరినగర్ నవాబుపేట పీఎస్ పరిధిలోకి వచ్చాయి.
♦ నెల్లూరు మూడో నగర పీఎస్ పేరును సంతపేట పోలీస్‌స్టేషన్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని గాంధీగిరిజన కాలనీ ఈ స్టేషన్ పరిధిలోకి చేరింది.
♦ నాలుగో నగర పీఎస్ పేరును దర్గామిట్ట పీఎస్‌గా మార్చారు. ఒకటో నగర పీఎస్ పరిధిలోని బారాషహీద్‌దర్గా, కలెక్టర్ బంగ్లా, డీకేడబ్ల్యూ కళాశాల, పోలీస్ కార్యాలయం, ఐదో నగర పీఎస్ పరిధిలోని ప్రగతినగర్, జీజీహెచ్, రాజరాజేశ్వరి దేవాలయం, ఏసీ స్టేడియం, పోలీస్ కాలనీ, రెవెన్యూ కాలనీ, జ్యూడీషియల్ క్వార్టర్స్, జెడ్పీకాలనీ, పోస్టల్‌కాలనీ, నగర డీఎస్పీ కార్యాలయం దర్గామిట్ట పీఎస్ పరిధిలోకి వచ్చాయి.
♦ ఐదో నగర పీఎస్ పేరును వేదాయపాళెం పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని కొత్తూరు, అంబాపురం దీని పరిధిలోకి వచ్చాయి.
♦ ఆరో నగర పీఎస్ బాలాజీనగర్ పీఎస్‌గానే కొనసాగనుంది. నాలుగో నగర పీఎస్ పరిధిలోని రామలింగాపురం, హరనాథపురం, మినీబైపాస్‌లోని టీడీపీ కార్యాలయం, ముత్యాలపాళెం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఈ స్టేషన్ పరిధిలోకి వచ్చాయి.
సిబ్బంది నామమాత్రం
పెరిగిన దానికి అనుగుణంగా సిబ్బంది కేటాయింపులు జరగకపోవడంతో ఉన్న అరకొర సిబ్బందితోనే స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించాలి. ఒక్కో స్టేషన్లో సుమారు 20కుపైగా ఖాళీలు ఉన్నాయి. ఉన్న వారిలో పది మందికి పైగా ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే డ్యూటీలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ఉన్న వారిపైనే పనిఒత్తిడి పెరగనుంది. కేసుల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment