టీఆర్ఎస్ నేతల్లో గుబులు!
♦ నియోజకవర్గాల పెంపు లేదని తేలడంతో ఆందోళన
♦ ‘సాక్షి’ కథనంపై సీఈవో భన్వర్‌లాల్‌కు పలువురి ఫోన్లు?
♦ మంత్రులు, ముఖ్య నేతల వద్ద మరికొందరి ఆవేదన
♦ ‘కారెక్క’డంపై పునరాలోచనలో కొందరు మాజీలు
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో కొత్తగా 34 సీట్లు పెరుగుతాయని ఆశించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న ఆ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైంది. ఇప్పుడున్న 119 స్థానాలకుతోడు పునర్విభజనలో మరో 34 సీట్లు పెరిగి 153 స్థానాలు అవుతాయని జోరుగా సాగిన ప్రచారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది ఉండదని భావించి టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు.
వీరి చేరికలను ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు వ్యతిరేకించకుండా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని టీఆర్‌ఎస్ నాయకత్వం భరోసా ఇచ్చింది. అయితే సమీప భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన విషయాన్ని సాక్షి శనివారం ప్రధాన సంచిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించిన దరిమిలా ఆయా నేతలు ఆందోళనలో పడ్డారు. కొందరైతే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు ఫోన్ చేసి నిజమేనా అని ఆరా తీసినట్లు సమాచారం. మరికొందరు తమ జిల్లాల్లో మంత్రులు, ముఖ్య నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మా పరిస్థితి ఏమిటి..?
ఖమ్మంలో గడచిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఆర్‌జేసీ కృష్ణ, పినపాకలో శంకర్ నాయక్‌లు తాజాగా అక్కడ కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేరడంతో ఆందోళనలో పడ్డారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌కు ఉనికి లేని సమయంలో తాము ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల ముందుకెళ్తే ఇప్పుడు వేరే పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చి ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు అదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కె.ఎస్.రత్నం వ్యతిరేకించారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని ఏ ఇబ్బంది లేదని ఆయనకు నచ్చజెప్పారు.
కానీ ఇప్పుడు పునర్విభజన లేదని వార్తలు వెలువడుతుండటంతో తన పరిస్థితి ఏమిటోనని ఆయన ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన టీఆర్‌ఎస్ ప్రముఖ నేతల్లో ఒకరిని కలసి నియోజకవర్గాలు పెరగకపోతే తనకే చేవెళ్ల టికెట్ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తన దారి తాను చూసుకుంటానని పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. వరంగల్ జిల్లా డోర్నకల్, మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ సహా దాదాపు 23 నియోజకవర్గాల్లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు అక్కడ్నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. ‘సీట్లు పెరుగుతాయని మాకు ఆశ చూపారు. ఇప్పుడేమో పరిస్థితి అయోమయంగా ఉంది’ అని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.