ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి | Kommineni-srinivasa-rao-article-about-water-dispute | Sakshi
Sakshi News home page

ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి

Published Wed, Jul 7 2021 12:42 AM | Last Updated on Wed, Jul 7 2021 12:43 AM

Kommineni-srinivasa-rao-article-about-water-dispute  - Sakshi

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏదో ఒక తగాదా నడిచేది. జగన్‌ ఎన్నికల్లో గెలిచాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. అయితే, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త వివాదం సృష్టించారు కేసీఆర్‌. కృష్ణా నీటిని సగం సగం పంచాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి, కేసీఆర్‌ జల రాజకీయం ఆరంభించారని విశ్లేషణలు వచ్చాయి. కేవలం సెంటిమెంటు కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్‌కు అది లాభం చేయకపోవచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుభవ జ్ఞుడు. తెలంగాణ సాధించిన నేతగా, తెలంగా ణను ఏలుతున్న అధినేతగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. కానీ ఇప్పుడు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా ఏడేళ్లుగా లేని కొత్త వివాదం సృష్టించారు. కృష్ణా నీరు ఏపీ, తెలంగాణ మధ్య ఫిఫ్టీ, ఫిఫ్టీ ఉండాలని డిమాండ్‌ చేశారు. కొన్నేళ్ల క్రితం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ వివాదం తేవడం ఎంతవరకు కరెక్టు? సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న కేసీఆర్‌ కేవలం తన రాజకీయ అవసరాలకు ఈ డిమాండ్‌ పెట్టారా? తెలంగాణ ప్రయోజనాల కోసమా అన్న చర్చ జరుగుతోంది. 

రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరిగాయి. ఏపీ జనాభా ఎక్కువ, విస్తీర్ణం అధికం. విద్యుత్‌ విషయంలో మాత్రం హైదరాబాద్, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు ఎక్కువ కేటాయించారు. నీటి ప్రాజెక్టులలో విద్యుత్‌ ఉత్పత్తికి నిర్దిష్ట ప్రోటోకాల్స్‌ ఉన్నాయి. వాటిని పట్టించు కోకుండా, కృష్ణా యాజమాన్య బోర్డు వద్దన్నా వినకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే ఎక్కువ గ్రామాలు మునిగిపోయేది ఏపీలో అన్న సంగతి కేసీఆర్‌కు తెలియనిది కాదు. దిగువ ప్రాంత ప్రజలకు, లేదా రాష్ట్రాలకు ముందుగా నదీ జలాలను వాడుకునే హక్కు ఉంటుందన్న సంగతీ తెలియదని అనుకోలేం. అలాంటప్పుడు యాభై శాతం సిద్ధాంతాన్ని ఎలా ముందుకు తెచ్చారో తెలీదు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని వాడు కున్నా అభ్యంతరం లేదు. ఈసారి వరద కాదు కదా,  శ్రీశైలంలో కనీస మట్టం కూడా లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి వివాదం సృష్టించింది.

అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రాయలసీమలోని కోట్ల మంది ప్రజల దాహార్తిని పట్టించు కోకపోవడమే. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలుంటే చెప్పడం తప్పు కాదు. ఆ ప్రాజెక్టు ఒక రూపానికే రాకముందు, తెలం గాణలో కొత్త ప్రాజెక్టులు కడతామనీ, విద్యుత్‌ కోసం ఉన్న కాస్త నీటిని వాడేస్తామనీ చెప్పడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదు. కేసీఆర్‌ తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత ప్రయోజనాలను పణంగా పెడు తున్నారా అన్న సందేహం వస్తుంది. నిజానికి జగన్, కేసీఆర్‌ మధ్య తగాదా రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇందులో ఒక వర్గం మీడియా సహజంగానే తన వంతు పాత్ర పోషిస్తోంది. ఏపీ మంత్రులుగానీ, ముఖ్యమంత్రిగానీ సంయమనం పాటిస్తున్నారు. భవిష్యత్తులో అటువైపు నుంచి మాటలు మీరితే అది రెండు రాష్ట్రా లకు ప్రయోజనకరం కాదు. ఇప్పటికే జగన్‌ ప్రధానికి, కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తే, తెలంగాణ కూడా ఏపీ స్కీములపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకప్పుడు ఇద్దరం చర్చించుకుని చేద్దాం అని చెప్పిన కేసీఆర్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీడీపీ మీడియా తెలంగాణ నేతల విమర్శలపై సంబరపడుతుండవచ్చు. కానీ వారికి తెలియకుండానే జగన్‌కు మేలు చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్, రాజోలి బండ వద్ద కాల్వ తవ్వకంపై జగన్‌ ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది అర్థం అవుతోంది.
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడే వరకు కేసీఆర్‌ను ఎద్దేవా చేసేలా మాట్లాడేవారు. అది రెండు రాష్ట్రాల మధ్య తగవుగా మారుతుండేది. కేసు తర్వాత చంద్రబాబు విజయవాడకు జారుకోవడంతో ఆ గొడవ తగ్గింది. జగన్‌ గెలిచాక  ఇరు ముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. నీటి పథకాలపై వివాదాలు వేరు, వ్యక్తిగత గొడవలు వేరు. తండ్రి రాజశేఖరరెడ్డిని మించి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా జగన్‌ ముందుకు వెళుతున్నారని కేసీఆర్‌ అన్నారట. వైఎస్‌ రూ. 35 వేల కోట్ల వ్యయంతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా, పలు చోట్ల కాల్వలు తవ్వించారు.  ఇంత వ్యయంతో అంత భారీ ప్రాజెక్టు సాధ్యమేనా అన్న సందేహం కలిగేది. ఎవరో ఒకరు ప్రారంభిస్తే, తర్వాత ఎవరో పూర్తి చేస్తారని వైఎస్‌ అనేవారు. ఎల్లంపల్లి, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్, కోయిల్‌ సాగర్, బీమా– ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టిన ఘనత ఆయనది. ప్రాణహిత–చేవెళ్ల సాధ్యం కాదేమోననుకున్నవారిని మరింత ఆశ్చర్యపరిచే విధంగా కేసీఆర్‌ ఏకంగా లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల ఎంత ఆయకట్టు పెరిగింది అన్నదానిపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, తెలంగాణలో నీటి సమస్య ఎప్పటికి తీరేనో అనుకునే కొన్ని ప్రాంతాలకు కేసీఆర్‌ సాగునీరు ఇచ్చేదశకు తెచ్చారు.

రాయలసీమ కరువు సీమకు నీటిని ఇచ్చేందుకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసె క్కులకు వైఎస్‌ పెంచారు. దానిపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పారు. ఆ మాటకొస్తే టీడీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, ప్రత్యేకించి దేవినేని ఉమామహేశ్వరరావు వంటివారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన చేశారు. తర్వాతి రోజుల్లో ఉమానే నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. అప్పటినుంచి ఎప్పుడూ ఆ ప్రాజెక్టును తప్పు పట్టలేదు. ఎన్టీఆర్‌ ఆరంభించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్‌ది. దీనిపై కూడా తెలంగాణ నేతలకు కొంత అభ్యంతరం ఉంది. చెప్పాలంటే వైఎస్‌ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు మూడింటినీ సమానంగా చూశారు. ఇప్పుడు ఆయన కుమారుడు తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం డ్యామ్‌ నుంచి వేగంగా తీసుకోవడానికి వీలుగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం చేపట్టారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసు కున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమా వేశంలో ఈ వివాదాలు ప్రస్తావనకు వచ్చాయి.
 
కేసీఆర్‌ గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపే స్కీమును ప్రతిపాదించి, ఏపీని కూడా అందులో భాగస్వామి కావాలని కోరారు. మొదట ఉత్సుకత చూపిన జగన్‌ ప్రభుత్వం, అందులోని ఇబ్బం దులను గమనంలోకి తీసుకుని వెనక్కి తగ్గింది. కేసీఆర్‌కు అది సంతృప్తిని కలిగించి ఉండకపోవచ్చు. ఆయనకు తెలంగాణ ప్రయోజ నాలతో పాటు తెలంగాణ రాజకీయం ఎంత ముఖ్యమో, జగన్‌కు ఏపీ ప్రయోజనాలతో పాటు, ఏపీ రాజకీయం అంత ముఖ్యమన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు వచ్చే రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి,  షర్మిల కొత్త పార్టీని పరిగణనలోకి తీసుకుని– కేసీఆర్‌ నీటి రాజకీయం ఆరంభించా రని విశ్లేషణలు వచ్చాయి. ఇదే సమయంలో ఏపీపై కోపంతో కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది. అలంపూర్‌ వద్ద జోగుళాంబ బ్యారేజీ పెట్టి లిఫ్ట్‌ ద్వారా అరవై, డెబ్భై టీఎంసీల నీటిని తరలించా లని ఒక స్కీము, పులిచింతల ప్రాజెక్టు కింద ఎడమకాల్వ తవ్వాలని మరో స్కీమ్, సుంకేసులవద్ద మరో ఎత్తిపోతల పథకం.. నీరు అందు బాటులో ఉన్నంతవరకు స్కీములు చేపట్టవచ్చు. హడావిడిగా చేప డితే తెలంగాణకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రజల అవ సరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ వాటాను సద్వి నియోగం చేసుకుంటే కేసీఆర్‌ను ఎవరూ తప్పుబట్టరు. కేవలం సెంటి మెంట్‌ కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్‌కు అది లాభం చేయకపోవచ్చు.

కొమ్మినేని శ్రీనివాసరావు 

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement