సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు తన అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. కమిటీకి అవసరమైన సమాచారాన్ని అన్ని శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అధ్యయన కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు..
► ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం.
► పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
► ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి.
► వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి.
►ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి.
దీనికోసమే కొత్త జిల్లాల ఏర్పాటు..
► ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.
► ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.
► ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment