
కొత్త నియోజకవర్గాలా... జిల్లాలా?
పునర్విభజనపై తర్జనభర్జన
నియోజకవర్గాల తర్వాతే: సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లాకు 5 నియోజకవర్గాల చొప్పునలో మొత్తం 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. దాని ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేస్తే పలు సమస్యలు వస్తాయని ‘సాక్షి’ ముందుగానే విశ్లేషిం చింది. సీఎం కేసీఆర్ కూడా జిల్లాల పునర్విభజ న అంశం ఇప్పుడే లేదని శుక్రవారం తేల్చేశారు.
ఏది ముందు?
కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తే భౌగోళికంగా, రాజ్యాంగపరంగానే కాకుండా రాజకీయంగా కూడా పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కొక్క లోక్‌సభా నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున 17 లోక్‌సభా స్థానాల్లో తెలంగాణ అసెంబ్లీకి మరో 34 నియోజకవర్గాలు పెరుగనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం దీనిని 2019 ఎన్నికల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. ఒక మండలం ఒకే నియోజకవర్గంలో ఉండాలి. ఒక నియోజకవర్గం ఒకే జి ల్లాలో ఉండాలి. జనాభా సగటులో 5-10 శాతం దాకా హెచ్చుతగ్గులున్నా మిగిలిన విషయాల్లో మార్గదర్శకాలను అనుసరించాలి. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే పలు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఒక జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు, మండలాలు వేరేదానిలో కలపాల్సి రావొచ్చు. కొత్త సమస్యలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ‘సాక్షి’ విశ్లేషించింది. దీనికి తోడు స్థానిక నైసర్గిక, భౌగోళిక పరిస్థితుల మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల నుండి కొన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. విభజన అనేది అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా ఇబ్బందులే తెస్తుందని గతంలో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకని జిల్లాల పునర్విభజనను వీలైనంత కాలం వాయిదా వేయాలనే ఆలోచనలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. ‘తెలంగాణను విభజించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా?,సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. గతంలో ఎన్డీయే ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా ఎంత లాభం జరిగింది? దానికి అనుగుణంగానే జిల్లాల విభజన విషయంలోనూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ అదే వ్యూహాన్ని అనుసరించొచ్చు’ అని అదే పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు విశ్లేషించారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే
జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.‘నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పూర్తి అయిన తర్వాతనే నూతన జిల్లాల ఏర్పాటు విషయం తెరమీదకు వస్తుంది. జిల్లాల ఏర్పాటుపై ఇప్పుడు వస్తున్న వార్తలను నమ్మవద్దు’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.