సాక్షి, న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీలను మారుస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు.
ఆజాద్‌తో పాటు సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాలకు చోటు కల్పించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్ సభ్యులుగా చిదంబరం, రణ్‌దీప్ సూర్జేవాలా, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్‌లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్ వోరా, ఆధిర్ రంజన్ చౌధురి, తామ్రధ్వజ్ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్‌ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించి, వివేక్ బన్సాల్‌ను ఆ పదవిలో నియమించారు.
సూర్జేవాలాను కర్నాటకకు, జితిన్ ప్రసాదను పశ్చిమబెంగాల్‌కు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి్జలుగా నియమించారు. కాంగ్రెస్‌పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, హెచ్‌కే పాటిల్, సల్మాన్ ఖుర్షీద్, దినేశ్ గుండూరావు తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్‌చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్ ఎంపీ మాణిక్కం టాగూర్ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment